Blood Tests Children: బాలలకు రక్తపరీక్షలు..
ABN , Publish Date - Jul 19 , 2025 | 04:29 AM
రాష్ట్రంలోని అంగన్‌వాడీల్లోని చిన్నారులు, ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న పిల్లలందరికీ రక్త పరీక్షలు చేయాలని సర్కారు నిర్ణయించింది.

అంగన్‌వాడీ నుంచి పదో తరగతి విద్యార్థుల వరకు
చిన్నారుల్లో ఎదుగుదల లేకపోవడం, బాలికల్లో
రక్తహీనత పెరుగుతుండడంతో నిర్ణయం
పిల్లల ఆరోగ్యంపై ప్రతినెలా ‘గ్రోత్ ప్రోగ్రెస్ రిపోర్టు’
‘మిషన్-100 డేస్’ పేరుతో ఆరోగ్యంపై ప్రచారం
హైదరాబాద్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అంగన్‌వాడీల్లోని చిన్నారులు, ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న పిల్లలందరికీ రక్త పరీక్షలు చేయాలని సర్కారు నిర్ణయించింది. పిల్లలు వయసుకు తగిన ఎత్తు, బరువు పెరగడంలేదని, వారిలో ఎదుగుదల సరిగా ఉండడంలేదని పలు నివేదికలు పేర్కొంటున్న నేపథ్యంలో వారి ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అంగన్‌వాడీ చిన్నారుల నుంచి పదో తరగతి విద్యార్థుల వరకు బాల, బాలికలందరికీ రక్త పరీక్షలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. వీరితోపాటు బాలింతలు, గర్భిణుల ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ వహించేలా చర్యలు తీసుకోనుంది. ఐదేళ్లలోపు చిన్నారుల్లో కంటిచూపు, వినికిడి లోపాలు, వయసు ప్రకారం రావాల్సిన మాటలు వస్తున్నాయా, లేదా అనే విషయాన్ని గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. దీంతోపాటు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే ఆహారం, వారి ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. ఇందుకోసం అంగన్‌వాడీ కేంద్రాల్లో ‘రేడియో’ ప్రసారాలు చేయాలని సర్కారు భావిస్తోంది. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారు. అలాగే.. పిల్లలకు రక్తపరీక్షలు చేసిన తరువాత వారికి అవసరమైన ఆహారాన్ని అందించి, దానికి తగిన ఎదుగుదల ఉంటుందా లేదా అనేది తెలుసుకోవడానికి ప్రతినెలా ‘గ్రోత్ ప్రోగ్రెస్ రిపోర్టు’ను కూడా తీసుకోవాలని సర్కారు యోచిస్తోంది. చిన్నారులు, విద్యార్థులు, బాలింతలు, గర్భిణుల ఆరోగ్యం, వారు తీసుకోవాల్సిన ఆహారం, వ్యక్తిగత శుభ్రతకు సంబంఽధించి ప్రత్యేకంగా ‘మిషన్-100 డేస్’ పేరుతో కార్యక్రమం నిర్వహించనున్నారు. తొలుత వంద రోజులు ప్రచారం నిర్వహించి.. ఆ తరువాత దానిపై క్షేత్ర స్థాయి సిబ్బంది నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు మిషన్ మోడ్‌లో పనిచేయాలని నిర్ణయించారు. ప్రచార కార్యక్రమాల కోసం స్థానికంగా ఉండే ప్రముఖ గాయకులు, వక్తల సేవలను వినియోగించుకోనున్నారు. స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)లో ఉండే సభ్యులను ఈ ప్రచార కార్యక్రమానికి ‘బ్రాండ్ అంబాసిడర్లు’గా నియమించాలని నిర్ణయించినట్టు తెలిసింది. మరోవైపు ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా పిల్లల ఆరోగ్యానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక ‘న్యూట్రిషన్ ప్లాన్’ కూడా తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం నిపుణులతో న్యూట్రిషన్ కమిటీని నియమించనున్నట్టు సమాచారం.
అంగన్‌వాడీల స్థాయిలోనే సమస్యల గుర్తింపు..
రాష్ట్ర వ్యాప్తంగా 35,700 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 7నెలల నుంచి 6ఏళ్ల వయసులోపు పిల్లలు 19 లక్షల మందికిపైగా ఉన్నారు. అలాగే గర్భిణులు, బాలింతలు సుమారు 3.55 లక్షల మంది ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. పిల్లల్లో ఎదుగుదల, వినికిడి సమస్య, కంటిచూపు లోపాలు, వయసు ప్రకారం మాటలకు సంబంధించిన సమస్యలను 5 ఏళ్లలోపు గుర్తించగలిగితే.. వాటికి చికిత్స అందించి పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే ఇలాంటి సమస్యలకు హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో చికిత్సలు అందిస్తున్నారు. ఇలాంటి సమస్యలకు చికిత్స చేయించుకున్న కొంతమంది పిల్లలు గతంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రకమైన సమస్యలను గుర్తించేందుకు అంగన్‌వాడీలకు ప్రత్యేక కార్యాచరణ ఇవ్వనున్నారు. వినికిడి, కంటిచూపు లోపాలు, మాటలు పలకలేని చిన్నారులు ఉన్నట్టు గుర్తిస్తే.. వెంటనే వారిని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఆ చిన్నారికి ఏదైనా చికిత్స చేయాలని వైద్యులు నిర్ధారిస్తే అందుకు తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై ప్రభుత్వ పరిధిలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇక అంగ న్‌వాడీల్లోని పిల్లలను నిత్యం పర్యవేక్షించేలా సీ.సీ కెమెరాలను ఏర్పాటు చేసి.. వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించనున్నారు. ఇక పిల్లల్లో పోషకాహార లోపాన్ని ఒకేసారి తగ్గించలేని కారణంగా ఏడాదికి 5శాతం తగ్గించుకుంటూ రావాలని నిర్ణయించగా.. ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీని ప్రకారం చిన్నారులతో పాటు బాలింతలు, గర్భిణులకు అందించే ఆహారంలో కొన్ని మార్పులు చేయనున్నారు. ప్రధానంగా మిల్లెట్‌ల (తృణధాన్యాల)తో కూడిన ఆహారాన్ని అందించాలని నిర్ణయించారు.
పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక కార్యాచరణ
ఇటీవల వచ్చిన పలు నివేదికల్లో ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ లాంటి రాష్ట్రాల కంటే తెలంగాణలోని కౌమార దశ పిల్లల్లో వయసుకు తగ్గ ఎదుగుదల లేకపోవడంతోపాటు బాలికల్లో రక్తహీనత సమస్య ఉందని తేలినట్లు సమాచారం. దీంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రభుత్వ కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, యూఆర్‌ఎ్‌సలు, గురుకులాలు, ఎయిడెడ్ స్కూళ్లలో ఉన్న సుమారు 24 లక్షల మంది విద్యార్థులకు రక్త పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఆ తరువాత విద్యార్ధుల వయసు వారీగా, వారికి ఉన్న సమస్యకు అవసరమైన పోషకాలతో కూడిన ఆహారం ఇవ్వనున్నా రు. అలాగే తల్లిదండ్రులకు కూడా పిల్లలకు ఇవ్వాల్సిన ఆహారంపై అవగాహన కల్పించనున్నారు.
నేటి బాలలే.. తెలంగాణ భవిష్యత్ పౌరులు
అంగన్‌వాడీ పిల్లలకు బ్రేక్‌ఫా్‌స్టతోపాటు చిరుతిళ్లు అందిస్తాం. రాత్రిపూట వారు తినే భోజనాన్నీ పర్యవేక్షిస్తాం. పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు గ్రోత్ స్టేటస్ తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరలో న్యూట్రిషన్ ప్లాన్‌తోపాటు ఓ కమిటీని కూడా ఏర్పాటుచేయాలని అనుకుంటున్నాం. నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే హామీ ఇచ్చారు. నేటి బాలలే.. రేపటి తెలంగాణ భవిష్యత్తు పౌరులు. ఆ భవిష్యత్తును చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఆరోగ్య తెలంగాణ దిశగా ముందుకెళ్తున్నాం.
- సీతక్క, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి