Share News

Ashwini Vaishnaw: కాజీపేట రైల్వే డివిజన్‌ ఏర్పాటు చేయండి

ABN , Publish Date - Mar 09 , 2025 | 04:02 AM

కాజీపేటను రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేయడంతో పాటు, రాష్ట్రానికి కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రులు, ఎంపీలు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు.

Ashwini Vaishnaw: కాజీపేట రైల్వే డివిజన్‌ ఏర్పాటు చేయండి

  • కొత్త రైల్వే లైన్లను ఇవ్వండి

  • కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు

హైదరాబాద్‌, శంషాబాద్‌ రూరల్‌, వరంగల్‌, మార్చి8(ఆంధ్రజ్యోతి): కాజీపేటను రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేయడంతో పాటు, రాష్ట్రానికి కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రులు, ఎంపీలు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మంత్రు లు సీతక్క, కొండా సురేఖ, ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌, కడియం కావ్య.. కేంద్ర మంత్రిని శనివారం శంషాబాద్‌ విమానాశ్రయంలో కలిసి వినతిపత్రాలు అందించారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి మా ట్లాడుతూ రాష్ట్రానికి కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయడంతో పాటు, వాటిని పూర్తిగా రైల్వే నిధులతోనే నిర్మించేలా సహకరించాలని, ప్రస్తుతం కాజీపేటలో కొనసాగుతున్న రైల్వే తయారీ యూనిట్‌ పనులను వేగవంతం చేసి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరామన్నారు. వరంగల్‌ చుట్టూ నిర్మిస్తున్న రింగ్‌ రోడ్డు నిర్మాణంతో పాటు రింగ్‌ రైల్‌ను నిర్మించే అంశంపై కేంద్రమంత్రి సానుకూలత వ్యక్తం చేశారని తెలిపారు. కాగా, మార్కెట్‌ నిర్మాణం కోసం వరంగల్‌ మండలం గిర్మాజీపేట్‌లో సర్వే నెంబర్‌ 8లోని రైల్వేకు చెందిన స్థలంలో 1.10 ఎకరాలు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ రైల్వే మంత్రికి సమర్పించిన వినతి పత్రంలో కోరారు. గిర్మాజీపేట్‌ గ్రామంలోని రైల్వే అండర్‌ బ్రిడ్జికి సమీపంలో నిరంతరం వీధివ్యాపార కార్యకలాపాలు కొనసాగడంతో ఈప్రాంతం నుంచి వచ్చి వెళ్లే పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.


అశ్వినీ వైష్ణవ్‌కు మంత్రి తుమ్మల లేఖ

పాండురంగాపురం-మల్కాన్‌గిరి రైల్వేలైన్‌ మం జూరు చేసినందుకు అశ్విని వైష్ణవ్‌కు మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. సత్తుపల్లి-కొవ్వూరు, పెనుబల్లి-కొండపల్లి(అమరావతి) వర కు కొత్త రైల్వే లైన్‌ మంజూరు చేయాలని ఇదే అంశంపై రాసిన లేఖను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కేంద్ర మంత్రికి అందజేశారు. కాగా, కరీంనగర్‌ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి కరీంనగర్‌లకు ప్రతి రోజూ రైళ్లను నడిపేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో..

Car Accident: అంతా చూస్తుండగానే అదుపుతప్పిన కారు.. క్షణాల్లోనే..

Updated Date - Mar 09 , 2025 | 04:02 AM