Share News

రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లు!

ABN , Publish Date - Feb 24 , 2025 | 03:57 AM

రాష్ట్రంలో కొత్త దేశీయ, విదేశీ లిక్కర్‌ బ్రాండ్లు రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కొత్త మద్యం బ్రాండ్ల సరఫరాకు అవకాశం కల్పించింది.

రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లు!

  • దరఖాస్తుల ఆహ్వానం.. 15వరకు గడువు

  • ఆ తర్వాత 10 రోజుల్లో..

  • ఆన్‌లైన్‌లో బహిరంగ విచారణ

  • బ్రాండ్లపై అభ్యంతరాలుంటే చర్యలు

  • కొత్త దేశీయ, విదేశీ మద్యానికి చాన్స్‌

  • ప్రస్తుతం రాష్ట్రంలో 53 కంపెనీల మద్యం

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త దేశీయ, విదేశీ లిక్కర్‌ బ్రాండ్లు రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కొత్త మద్యం బ్రాండ్ల సరఫరాకు అవకాశం కల్పించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు విక్రయాలు జరపని మద్యం కంపెనీలు, ఇప్పటికే సరఫరా చేస్తున్నా రిజిస్టర్‌ చేసుకోని బ్రాండ్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(టీజీబీసీఎల్‌) నోటిఫికేషన్‌ జారీ చేసింది. మార్చి 15 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే.. కొత్త బ్రాండ్ల విషయంలో నూతన విధానంలో ముందుకు వెళ్తోంది. దాంతో దరఖాస్తుల గడువు ముగిశాక.. 10 రోజుల పాటు ఆన్‌లైన్‌లో బహిరంగ విచారణ జరపనుంది. ఈ క్రమంలో ఏదైనా కంపెనీపై అభ్యంతరాలు వస్తే.. చర్యలు తీసుకోవడంతోపాటు.. ఆ బ్రాండ్‌ను బ్లాక్‌లి్‌స్టలో పెట్టేలా చర్యలు తీసుకోనుంది.


అంతేకాకుండా.. రాష్ట్రంలో సరఫరా చేసేందుకు ఆసక్తి చూపే కంపెనీలు.. ఇప్పటికే సరఫరా చేస్తున్న రాష్ట్రాల్లో తమ మద్యం అమ్మకాలు, నాణ్యత ప్రమాణాలకు సంబంధించి ఇబ్బందుల్లేవని, తమ కంపెనీలపై ఎలాంటి ఆరోపణలు లేవని నిర్ధారించేలా.. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి సర్టిఫికెట్‌ను జతచేయాల్సి ఉంటుందని నూతన విధానం నిబంధనల్లో స్పష్టం చేసింది. గతంలో ‘సోం’ బీర్ల కంపెనీ అనుమతులపై వివాదం చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కొత్త బ్రాండ్లే కాకుండా.. ఇప్పటికే మద్యాన్ని సరఫరా చేస్తున్న కంపెనీలు కూడా కొత్త బ్రాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని టీజీబీసీఎల్‌ సూచించింది. ప్రస్తుతం తెలంగాణలో 53 కంపెనీలు మద్యాన్ని, బీర్లను సరఫరా చేస్తున్నాయి. వీటిల్లో దేశీయ, విదేశీ బ్రాండ్లు కూడా ఉన్నాయి. తెలంగాణలోనే ఉత్పత్తి చేసే కంపెనీలు 15 (వీటిలో 6 బీర్ల కంపెనీలు) ఉన్నాయి. ఇటీవలే ప్రభుత్వం మద్యం, బీర్ల ధరలు పెంచడంతో కొత్త బ్రాండ్ల ధరలు ఎలా ఉంటాయనే ఆసక్తి నెలకొంది.

Updated Date - Feb 24 , 2025 | 03:57 AM