Share News

పదేళ్లలో రాష్ట్రంలో పెట్టుబడులు.. రూ.1.98 లక్షల కోట్లు

ABN , Publish Date - Jan 06 , 2025 | 04:28 AM

రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు భారీగా రాయితీలను ఇవ్వాలని ప్రభుత్వం ని ర్ణయించింది.

పదేళ్లలో రాష్ట్రంలో పెట్టుబడులు.. రూ.1.98 లక్షల కోట్లు

  • 1.14 లక్షల మందికి ఉద్యోగావకాశాలు

  • 2035 కల్లా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని

  • 49,500 మెగావాట్లకు పెంచడమే లక్ష్యం

  • పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు భారీ ప్రోత్సాహకాలు

  • భూములకు నాలా కన్వర్షన్‌ నుంచి మినహాయింపు

  • యంత్రాలపై 50-100ు ఎస్‌జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌

  • 10 శాతం నామమాత్రపు అద్దెతో లీజుకు సర్కారు స్థలాలు

  • పునరుత్పాదక ఇంధన విధానం-2025కు క్యాబినెట్‌ ఓకే

హైదరాబాద్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు భారీగా రాయితీలను ఇవ్వాలని ప్రభుత్వం ని ర్ణయించింది. సౌర, పవన, పునరుత్పాదక ఇంధనం, ఎనర్జీ స్టోరేజీ (బ్యాటరీ+పంప్డ్‌ స్టోరేజీ) ప్రాజెక్టులు, జియోథర్మల్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌ వంటి పునరుత్పాదక విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటును పెద్దఎత్తున ప్రోత్సహించనుంది. ప్రస్తుతం రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్తు సరఫరా సామర్థ్యం 10,095.20 మెగావా ట్లు ఉండగా, 2029-30 నాటికి 31,400 మెగావాట్లకు పెంచాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. 2034-35 నాటికి 49,500మెగావాట్లకు పెంచాలని భావిస్తోంది. వీటి ఏర్పాటుకు వచ్చే పదేళ్లలో రూ.1.98 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 1.14 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు రూపొందించిన తెలంగాణ పునరుత్పాదక ఇంధన విధానం-2025ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. పదేళ్ల పాటు ఈ విధానం అమల్లో ఉండనుంది.


బిడ్డింగ్‌ ద్వారా కేంద్రాల ఏర్పాటు

విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)లు టారిఫ్‌ ఆధారిత కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ ద్వారా కొత్త సౌర, పవన, పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్తు ప్లాంట్లు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం, జియో థర్మల్‌, మినీ హైడల్‌, వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు బిడ్లను ఆహ్వానించనున్నాయి. వీటిని గ్రిడ్‌కు అనుసంధానం చేసి, విద్యుత్తును కొనుగోలు చేయనున్నాయి. డెవలపర్లకు ప్రభుత్వ స్థలాలను నామమాత్రపు అద్దెతో లీజుకు ఇస్తారు. బిడ్డింగ్‌లో గెలిచిన వారికి మార్కెట్‌ రేటులో 10ు లీజు ధరతో భూములను కేటాయిస్తారు. అనంతరం రెండేళ్లకోసారి లీజు ధరను 5ు పెంచుతారు. విద్యుత్తు కొనుగోలు ఒప్పందం(పీపీఏ) జరిగాక జిల్లా కలెక్టర్లతో లీజు ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. డెవలపర్లు రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని ప్రైవేటు సంస్థలకు అమ్ముకోవచ్చు. సొంత అవసరాలకూ వాడుకోవచ్చు. ఎకరాకు రూ.లక్ష ధర తో ఇలాంటి ప్రాజెక్టులకు ప్రభుత్వం 25 ఏళ్లు, లేదా ప్రాజెక్టు జీవిత కాలానికి స్థలాలను కేటాయిస్తుంది. సబ్‌స్టేషన్‌ పరిధిలో కొత్త విద్యుదుత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు ఎంత సామర్థ్యం లభ్యత ఉంటుందో ఆ మేరకే అనుమతిస్తారు. ముందు దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యంలభించనుంది. సౌర, పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్తు ప్లాంట్లను రెండేళ్లలో, పవన విద్యు త్తు ప్లాంట్లను మూడేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుం ది. ఇక నీటిపారుదల శాఖ భాగస్వామ్యంతో జలాశయాలపై ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టుల ఏర్పాటును ప్రోత్సహిస్తారు. ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు జలాశయాలను నామినేషన్‌ పద్ధతిలో కేటాయిస్తారు.


మహిళా సంఘాలతో సౌర విద్యుత్కేంద్రాలు

500 కిలోవాట్‌ నుంచి 2 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్తు ప్లాంట్ల స్థాపనకు డిస్కంలు స్వయం సహాయక సంఘాల మహిళల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానించనున్నాయి. వారి నుంచి నిర్ణీత ధరకు విద్యుత్తును కొనుగోలు చేస్తాయి.

భారీ ప్రోత్సాహకాలు..

  • పునరుత్పాదక విద్యు త్తుప్రాజెక్టులను స్థా పించే భూములకు నాలా కన్వర్షన్‌ నుంచి మినహాయింపు.

  • టీజీ-ఐపాస్‌ ద్వారా ఏకగవాక్ష విధానంలో సత్వర అనుమతులు.

  • పారిశ్రామిక హోదా కల్పించి అన్ని రకాల ప్రోత్సాహకాల వర్తింపు.

  • ప్రతి మెగావాట్‌కు 4 ఎకరాల చొప్పున భూగరిష్ఠ పరిమితి చట్టం నుంచి మినహాయింపు.

  • భూముల కొనుగోళ్లపై స్టాంప్‌ డ్యూటీ 100శాతం తిరిగి చెల్లింపు.

  • వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు 100శాతం రాష్ట్ర జీఎస్టీని తిరిగి చెల్లింపు.

  • సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సౌర, పవన విద్యుత్తు వాడుకుంటే 8 ఏళ్ల పాటు విద్యుత్తు సుంకం నుంచి మినహాయింపు.

  • డిస్కంలకు విద్యుత్తు విక్రయిస్తే ప్రోత్సాహకాలు.

  • ఇతర సౌర, పంప్డ్‌, బ్యాటరీ స్టోరేజీ ప్రాజెక్టులకు 50శాతం రాష్ట్ర జీఎస్టీ తిరిగి చెల్లిస్తారు.

  • ఎస్‌హెచ్‌జీలు/గ్రామ సమాఖ్యలు ఏర్పాటు చేసే సౌర, పవన విద్యుత్తు ప్రాజెక్టులతో పాటు ఇళ్లు, ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలపై ఏర్పాటు చేసే రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్రాజెక్టులకు 100 శాతం రాష్ట్ర జీఎస్టీని తిరిగి చెల్లిస్తారు.


పీఎస్పీలకు 45 ఏళ్ల లీజుకు స్థలాలు..

పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్తు ప్రాజెక్టుల(పీఎస్పీ)కుప్రభుత్వ భూములను 45 ఏళ్ల పాటు లీజుకి ఇస్తారు. ఒకే ప్రాంతంలో సౌర, పవన, పవన+ఫ్లోటింగ్‌ సో లార్‌ వంటి హైబ్రిడ్‌ పునరుత్పాదక విద్యుత్తు ప్రాజెక్టులతోపాటు విండ్‌+స్టోరేజీ, హైబ్రిడ్‌+స్టోరేజీ వంటి ప్రాజెక్టుల ఏర్పాటునూ ప్రోత్సహించనున్నారు.

2029-30, 2034-35 నాటికి పెంచనున్న సామర్థ్యం కేటగిరీల వారీగా (మెగావాట్లలో)

ప్రస్తుత లక్ష్యం లక్ష్యం

పునరుత్పాదక విద్యుత్తు సామర్థ్యం (2029-30 నాటికి) (20234-35 నాటికి)

(నిర్మాణంలో ఉన్నవి కలిపి)

సౌర విద్యుత్తు 7900 19800 26,000

పునరుత్పాదక ఇంధనం 467 4300 8000

పవన విద్యుత్తు 128 2500 4500

ఎనర్జీ స్టోరేజీ (పంప్డ్‌+బ్యాటరీ) 1600 3800 8000

జియో థర్మల్‌ (20కేడబ్ల్యూ) 1000 3000

మొత్తం 10,095.20 31,400 49,500

Updated Date - Jan 06 , 2025 | 04:28 AM