Share News

16 ఏళ్ల కింద సౌదీ వెళ్లి.. నేడు శవంలా ఇంటికి!

ABN , Publish Date - Mar 08 , 2025 | 04:59 AM

చేసిన అప్పులు తీర్చి.. కుటుంబాన్ని పోషించుకునేందుకు ఏడారి దేశం వెళ్లిన మరో తెలంగాణ ప్రవాసీ జీవితం విషాదాంతంగా ముగిసింది.. 16 ఏళ్ల క్రితం సౌదీ వెళ్లిన అతడు.. చివరికి శవంలా తిరిగొస్తున్నాడు..

16 ఏళ్ల కింద సౌదీ వెళ్లి.. నేడు శవంలా ఇంటికి!

  • మరో గల్ఫ్‌ కార్మికుడి జీవితం విషాదాంతం

  • మోసం కేసులో ఇరికి.. ఆరోగ్యం క్షీణించి దుర్మరణం

  • మృతుడిది మహబూబ్‌నగర్‌ జిల్లా వేపూర్‌..

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): చేసిన అప్పులు తీర్చి.. కుటుంబాన్ని పోషించుకునేందుకు ఏడారి దేశం వెళ్లిన మరో తెలంగాణ ప్రవాసీ జీవితం విషాదాంతంగా ముగిసింది.. 16 ఏళ్ల క్రితం సౌదీ వెళ్లిన అతడు.. చివరికి శవంలా తిరిగొస్తున్నాడు.. మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడా మండలం వేపూర్‌ గ్రామ రామాలయం తండాకు చెందిన సబావత్‌ రవి నాయక్‌ ఉపాధి కోసం 2009లో సౌదీ అరేబియాకు వెళ్లాడు. భవన నిర్మాణ కూలీగా పనిచేస్తూ.. అప్పులు తీర్చుకుంటున్న క్రమంలో అతడిపై మోసానికి సంబంధించి ఒక కేసు నమోదైంది. దీంతో అతడి జీవితమే మారిపోయింది.. కేసుకు తోడు, ఆ తర్వాత వీసా గడువు ముగియడంతో ఏళ్లు గడిచినా దేశం తిరిగొచ్చె మార్గం లేక అక్కడే అక్రమంగా ఉండాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అతడి ఆరోగ్యం క్షీణించసాగింది.


ఇటు సౌదీకి వెళ్లే ముందు చూసిన తన 3 నెలల పాప పూజ ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది. ఆమెను ఎప్పటికైనా కలవకపోతానా అని రవి ఎదురుచూస్తున్న క్రమంలోనే ఆరోగ్యం మరింత విషమించి ఆస్పత్రి పాలయ్యాడు. ఈనేపథ్యంలోనే జనవరి 26న మరణించాడు. అతడి శవాన్ని స్వదేశానికి పంపించాలని సౌదీలోని తోటి కార్మికులు ప్రయత్నించగా.. అతడిపై ఉన్న కేసు కారణంగా వీసా రద్దు కాలేదు. దీంతో వారు ఏం చేయాలో తెలియక అల్లాడిపోయారు. ఈ నేపథ్యంలోనే మలయాళీ సామాజిక కార్యకర్తలు 2 నెలల పాటు చేసిన ప్రయత్నాలు ఫలించి వీసా రద్దయింది. రవి మృతదేహాన్ని శుక్రవారం స్వదేశానికి పంపించారు. శనివారం ఉదయం స్వస్థలానికి చేరుకోనుంది.

Updated Date - Mar 08 , 2025 | 04:59 AM