Yadadri Bhuvanagiri: భువనగిరిలో ఆర్‌ఆర్‌ఆర్ నిర్వాసితుల ధర్నా
ABN , Publish Date - Jan 26 , 2025 | 05:03 AM
భూమికి భూమి ఇవ్వాలని, లేదంటే మార్కెట్ ధర చెల్లించాలని, దక్షిణ భాగంలో అలైన్‌మెంట్ మార్చాలనే డిమాండ్‌తో ఆర్‌ఆర్‌ఆర్ నిర్వాసిత రైతులు శనివారం యాదాద్రి కలెక్టరేట్ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చారు.

హైవేపై రాస్తారోకో, కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లే యత్నం
పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట.. తీవ్ర ఉద్రిక్తత
భువనగిరి అర్బన్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట రీజినల్ రింగ్ రోడ్డు నిర్వాసిత రైతులు శనివారం నిర్వహించిన మహాధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నిర్వాసితులకు మద్దతుగా బీజేపీ, బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొనడంతో సుమారు నాలుగు గంటల పాటు హైటెన్షన్ నెలకొంది. భూమికి భూమి ఇవ్వాలని, లేదంటే మార్కెట్ ధర చెల్లించాలని, దక్షిణ భాగంలో అలైన్‌మెంట్ మార్చాలనే డిమాండ్‌తో ఆర్‌ఆర్‌ఆర్ నిర్వాసిత రైతులు శనివారం యాదాద్రి కలెక్టరేట్ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చారు. కాగా, బీజేపీ ఎంపీ లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పార్టీ శ్రేణులతో రైతులకు మద్దతుగా నిలిచారు.
ఈ క్రమంలో కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించిన లక్ష్మణ్, శేఖర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో పార్టీల కార్యకర్తలు, రైతులు దూసుకుపోయేందుకు ప్రయత్నించారు. చివరకు పైళ్ల శేఖర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకుడు క్యామ మల్లేశ్‌ను పోలీసులు కలెక్టరేట్‌లోకి అనుమతించారు. అరగంట ముందే కలెక్టరేట్‌లోకి వెళ్లిన ఎంపీ లక్ష్మణ్.. కలెక్టర్ లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్ వీరారెడ్దికి వినతిపత్రం అందజేశారు. అనంతరం రైతులు ఆందోళన విరమించారు.