Share News

Mallikarjun Kharge: బీసీ రిజర్వేషన్లకు నమూనాగా తెలంగాణ!

ABN , Publish Date - Jul 22 , 2025 | 04:58 AM

దేశ వ్యాప్తంగా ఓబీసీలకు రిజర్వేషన్లను పెంచే విషయంలో తెలంగాణను ఏఐసీసీ నమూనాగా తీసుకోనుందా? ఈ నమూనా చూపుతూ ఉద్యమ కార్యాచరణను ఖరారు చేయాలని భావిస్తోందా? అంటే.. అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి.

Mallikarjun Kharge: బీసీ రిజర్వేషన్లకు నమూనాగా తెలంగాణ!

దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లు పెంచాలంటూ ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్న ఏఐసీసీ

  • 24న ఢిల్లీకి రేవంత్‌.. రాహుల్‌తో భేటీ

  • కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరనున్న సీఎం

  • 25న ఓబీసీ సమ్మేళన్‌కు హాజరు కానున్న నేతలు

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, జూలై 21(ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్తంగా ఓబీసీలకు రిజర్వేషన్లను పెంచే విషయంలో తెలంగాణను ఏఐసీసీ నమూనాగా తీసుకోనుందా? ఈ నమూనా చూపుతూ ఉద్యమ కార్యాచరణను ఖరారు చేయాలని భావిస్తోందా? అంటే.. అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కులగణన, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల అంశంపై తమ ఎంపీల ద్వారా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఏఐసీసీ భావిస్తోంది. విద్య, ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులూ కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ బిల్లులను ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని భావిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. 24న డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌తో కలిసి ఢిల్లీకి వెళ్లనున్నారు. తొలుత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీతో భేటీ అయి.. విద్య, ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించాల్సిన ఆవశ్యకత, రాష్ట్రంలో కులగణన జరిగిన తీరును వివరించనున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకురావాలని నిర్ణయించిన సంగతిని ప్రస్తావించనున్నారు. అదే రోజు సాయంత్రం ఇందిరాభవన్‌లో జరగనున్న కాంగ్రెస్‌ ఎంపీల సమావేశంలో ఆయా అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. రెండు బీసీ బిల్లులకూ ఆమోద ముద్ర వేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎంపీలను కోరనున్నారు.


25న న్యాయ సమ్మేళన్‌లోనూ!

ఏఐసీసీ ఓబీసీ సెల్‌ ఆధ్వర్యంలో 25న ఢిల్లీలోని తల్కటేరా స్టేడియంలో భాగేదారీ న్యాయ సమ్మేళన్‌ నిర్వహించనున్నారు. ఇందులో రాహుల్‌గాంధీ, ఖర్గేతో పాటు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, ఓబీసీ ప్రజా ప్రతినిధులు, ఇతర నాయకులు పాల్గొననున్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, మహేశ్‌గౌడ్‌, బీసీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇందులోనూ తెలంగాణలో చేపట్టిన కులగణన సర్వే, దాని ఆధారంగా ఓబీసీలకు 42 శాతం కల్పించాలంటూ బిల్లుల రూపకల్పన, అసెంబ్లీ ఆమెదం వంటి అంశాలను సీఎం వివరించనున్నారు. ఈ సమ్మేళన్‌ ద్వారా జనాభా ప్రాతిపదికన ఓబీసీలకు వాటా కల్పించాల్సిన ఆవశ్యకతపై రాహుల్‌గాంధీ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలను నమూనాగా చేసుకుని ఉద్యమ కార్యాచరణ ఖరారు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరో వైపు.. ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ దొరికితే.. రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో కలిసి వెళ్లి.. బీసీ బిల్లులను 9వ షెడ్యూల్‌లో చేర్చాల్సిందిగా కోరనున్నట్లు చెబుతున్నారు. 25న జరిగే భాగేదారీ సమ్మేళన్‌లో బీసీ ప్రజా ప్రతినిధులందరూ పాల్గొనాలని, పేరు నమోదు చేసుకున్నా వారికే ప్రవేశం ఉంటుందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ తెలిపారు. మరోవైపు.. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదంతో పంపిన బీసీ బిల్లులపై కేంద్రం పలు సందేహాలు లేవనెత్తగా.. రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘ వివరణలు పంపినట్లు తెలిసింది. ఇదంతా సాధారణంగా జరిగేదనని అధికారవర్గాలు చెప్పాయి. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఢిల్లీలోనే ఉంటున్న నేపథ్యంలో 25న జరగాల్సిన రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం వాయిదా పడింది. ’


రాజగోపాల్‌ వ్యాఖ్యలను అధిష్ఠానం పరిశీలిస్తోంది నేతలు ఆచితూచి మాట్లాడాలి: మల్లు రవి

కులగణన, బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచే అంశంపై అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ నేతృత్వంలో 100 మంది కాంగ్రెస్‌ ఎంపీలకు సీఎం రేవంత్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నట్టు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల ఫోరం కన్వీనర్‌ మల్లు రవి వెల్లడించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌పై ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలను అధిష్ఠానం పరిశీలిస్తోందని తెలిపారు. ఏ సందర్భంలో సీఎం అలాంటి వ్యాఖ్యలు చేశారో రాజగోపాల్‌కు తెలియదన్నారు. కాంగ్రెస్‌ ముఖ్య నేతలు ఆచితూచి మాట్లాడాలని, పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించకూడదని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ మంచి ఫలితాలను సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌తో పాటు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో మంత్రి గడ్డం వివేక్‌, ఎంపీలు సురేశ్‌ షెట్కార్‌, చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, వంశీకృష్ణ, తదితరులున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 22 , 2025 | 04:58 AM