Telangana: రాష్ట్రంలో 4 వెడ్డింగ్ డెస్టినేషన్లు
ABN , Publish Date - Jun 30 , 2025 | 03:44 AM
ప్రకృతి అందాలు, ఆధునిక వసతులు, అలంకరణల మధ్య రాచఠీవీతో అద్భుతమైన మధుర జ్ఞాపకాలను మూటగట్టే డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు దేశంలో ఆదరణ పెరుగుతోంది.

అభివృద్ధి చేయనున్న పర్యాటక శాఖ
నిజాంసాగర్, నాగార్జునసాగర్,బస్వాపూర్, సోమశిల ప్రాంతాల్లో..
హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి అందాలు, ఆధునిక వసతులు, అలంకరణల మధ్య రాచఠీవీతో అద్భుతమైన మధుర జ్ఞాపకాలను మూటగట్టే డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు దేశంలో ఆదరణ పెరుగుతోంది. రాష్ట్రంలోని సంపన్నులు తమ కుటుంబంలో ఇలాంటి వివాహ వేడుకల కోసం రాజస్థాన్, జైపూర్, గోవా, కేరళ తదితర ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఇందుకు కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నారు. ఇక నుంచి వారు దూర ప్రాంతాలకు వెళ్లి అనవసర వ్యయప్రయాసలు పడకుండా రాష్ట్రంలోనే తమ అభిరుచికి అనుగుణంగా, అత్యంత ఆర్భాటంగా పెళ్లిళ్లు, పేరంటాలు, విందులు, వినోదాల వేడుకలు నిర్వహించుకునే అవకాశాన్ని పర్యాటక శాఖ కల్పించబోతోంది. రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో అలాంటి వెడ్డింగ్ డెస్టినేషన్‌లను అభివృద్ధి చేసేందుకు సమాయత్తమవుతోంది. ఆధునిక విలాసాలు, ప్రపంచశ్రేణి ప్రమాణాలతో వీటిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పర్యాటక పాలసీ మేరకు హైదరాబాద్ నుంచి రాకపోకలకు సులువుగా ఉన్న ఆహ్లాదకరమైన ప్రాంతాల్లో వెడ్డింగ్ డిస్టినేషన్‌లను ఏర్పాటు చేస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సభలు, సమావేశాలు, చర్చాగోష్ఠులు, వర్క్‌షాప్‌లు నిర్వహించే అవకాశాలను పరిగణనలోకి తీసుకుని అధికారులు పలు ప్రాంతాలను పరిశీలించారు. ప్రాథమికంగా కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్, యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్, నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ బుద్ధవనం ప్రాజెక్టు సమీపాన, నాగర్ కర్నూల్ జిల్లాలోని కృష్ణా-తుంగభద్ర నదీతీరమైన సోమశిల ప్రాంతాల్లో ఈ వెడ్డింగ్ డెస్టినేషన్‌ల అభివృద్ధి కోసం అవసరమైన స్థలాలను గుర్తించారు. ఐదేళ్లలో పర్యాటక రంగంలో సుమారు రూ.15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే ప్రధాన లక్ష్యంతో రూపొందించిన ప్రతిపాదనల్లో వెడ్డింగ్ డెస్టినేషన్‌ల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించనున్నారు.