Wine Industry: కొత్త వైన్ పరిశ్రమ
ABN , Publish Date - Jul 08 , 2025 | 04:41 AM
తెలంగాణలో త్వరలో కొత్త వైన్ పరిశ్రమ రానుంది. రాష్ట్రంలో వైన్ వినియోగం నానాటికీ పెరుగుతున్నప్పటికీ..

రాష్ట్రంలో ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న 3 సంస్థలు
ప్రభుత్వ పరిశీలనలో ఫైల్.. ఒక సంస్థకు అనుమతి!
ఈ ఏడాది జూన్ కల్లా 2.68 లక్షల వైన్ కేసుల విక్రయం
అందులో 8,725 కేసులు మాత్రమే స్థానిక కంపెనీలవి
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 700 ఎకరాలకు పైగా ద్రాక్షసాగు.. అక్కడేవైనరీ పరిశ్రమల స్థాపనకు చర్యలు
హైదరాబాద్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో త్వరలో కొత్త వైన్ పరిశ్రమ రానుంది. రాష్ట్రంలో వైన్ వినియోగం నానాటికీ పెరుగుతున్నప్పటికీ.. స్థానిక కంపెనీలు తక్కువగా ఉన్నందున హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. కొత్త వైనరీల ఏర్పాటుకు మూడు సంస్థలు దరఖాస్తు చేసుకోగా.. వాటిలో ఒకదానికి అనుమతి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో వైన్ విక్రయాలను పరిశీలిస్తే.. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో (జనవరి-జూన్) రూ.300 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి. మొత్తం 2,67,245 కార్టన్ల వైన్ విక్రయిస్తే.. అందులో కేవలం 8,725 కేసులు మాత్రమే స్థానిక కంపెనీలవి. ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌శాఖ వైనరీ పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపింది. నాలుగు రోజుల క్రితం వైన్ తయారీ పరిశ్రమ ఏర్పాటుపై మంత్రి జూపల్లి సమక్షంలో ఉన్నతాధికారులతో సమావేశం జరిగినట్లు తెలిసింది. ఎక్సైజ్ శాఖ పంపిన నివేదికను పరిశీలించాక..వైనరీ ఏర్పాటుకు త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
ఇవీ లెక్కలు..
రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏడాదికి 8 లక్షల బల్క్ లీటర్ల సామర్థ్యం కలిగిన ఒకే ఒక వైన్ తయారీ పరిశ్రమ ఉంది. అయితే.. ఏటా స్థానికంగా పెరుగుతున్న వైన్ వినియోగానికి తగ్గట్లుగా రాష్ట్రంలో వైన్ ఉత్పత్తి కావడంలేదు. ఎక్సైజ్‌శాఖ లెక్కల ప్రకారం.. 2021-22లో వైన్ విక్రయాల ద్వారా రూ.201 కోట్ల విలువైన 1.87లక్షల వైన్ కేసులు (ఒక కేసు అంటే లీటర్ బాటిళ్లు 12) విక్రయించగా ఇందులో కేవలం 16,205 కేసులు మాత్రమే స్థానికంగా తయారయ్యాయి. మిగిలిన సరుకంతా విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్నదే. ఇక 2022-23లో 2.35 లక్షల కేసులు (రూ.260 కోట్లు).. 2023-24లో 2.41 లక్షల వైన్ కేసులు (రూ.275 కోట్లు) అమ్ముడయ్యాయి.
ఈ ఏడాదిలో వైన్ వినియోగం భారీగా పెరిగింది. రాష్ట్రంలోనే వైన్ తయారీ పరిశ్రమలు స్థాపిస్తే.. వైన్ ఉత్పత్తి పెరగడమేకాకుండా స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని, ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతోందని ఆబ్కారీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ద్రాక్ష, ఆపిల్, అరటి, ఉసిరి, పైనాపిల్ వంటి పండ్లతో వైన్ తయారీకి అవకాశం ఉండటంతో భవిష్యత్తులో ఆయా పండ్ల తోటల సాగు విస్తీర్ణం కూడా పెరుగుతుందని అంచనా. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు కేంద్రం భారీగా రాయితీలు ఇస్తుండటంతో వైన్ తయారీపరిశ్రమల ఏర్పాటుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 700ఎకరాలకు పైగా దాక్షతోటలు ఉండటంతో ఆ ప్రాంతాన్ని.. కొత్తగా వైన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకునేందుకు అనువైనదిగా ఎక్సైజ్‌శాఖ ఇప్పటికే గుర్తించింది. కొత్తగా వైనరీని స్థాపించడానికి ఆసక్తి కలిగిన పారిశ్రామికవేత్తల నుంచి దరఖాస్తులు కోరింది. దీంతో బ్లూసీల్, ఈరియా, బగ్గా కంపెనీలు ఆసక్తి చూపుతూ దరఖాస్తు చేశాయి. దీనిపై ప్రభుత్వం పరిశీలించిన తర్వాత.. త్వరలోనే ఒక వైన్ తయారీ పరిశ్రమకు ఆమోదం లభించనుంది.
ఇవి కూడా చదవండి
జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు లక్షా 12 వేల జీతం,
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి