Hyderabad: తెలంగాణ నమూనాను ప్రపంచానికి చాటుతాం
ABN , Publish Date - Apr 25 , 2025 | 03:29 AM
అభివృద్ధి విషయంలో తెలంగాణ నమూనాను ప్రపంచానికి చాటి చెప్పడానికే ‘భారత్ సదస్సు-2025’ను నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శుక్ర, శనివారాల్లో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.

అందుకే ‘భారత్ సదస్సు-2025’ నిర్వహణ
రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానిస్తాం
ప్రగతిశీల పార్టీలతో కలిసి డిక్లరేషన్ విడుదల
100కు పైగా దేశాల నుంచి 450కు పైగా ప్రతినిధులు: డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క
నేడు నోవాటెల్‌లో సదస్సు ప్రారంభం
హైదరాబాద్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి విషయంలో తెలంగాణ నమూనాను ప్రపంచానికి చాటి చెప్పడానికే ‘భారత్ సదస్సు-2025’ను నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శుక్ర, శనివారాల్లో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లోని నోవాటెల్ హోటల్‌లో సదస్సు జరగనుంది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి గురుదీప్ సింగ్ సప్పల్‌తో కలిసి భట్టి విక్రమార్క గురువారమిక్కడ సదస్సు వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఈ సదస్సు ద్వారా ప్రభుత్వ ఆలోచనా విధానాలను ప్రపంచానికి చెప్పనున్నామని, తద్వారా రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆహ్వానిస్తామని తెలిపారు. లౌకికవాద కాంగ్రెస్ పార్టీ ఆలోచన, సిద్ధాంతాలను వివరించనున్నట్లు చెప్పారు. ప్రగతిశీల భావజాల రాజకీయ పార్టీలతో కలిసి డిక్లరేషన్‌ను రూపొందించి, విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ మోడల్‌ను ప్రపంచానికి చాటడానికి సదస్సు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే ఇక్కడ నిర్వహిస్తున్నామని తెలిపారు.
కాంగ్రెస్ మూల సిద్ధాంతాలైన అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై వివిధ దేశాల ప్రతినిధులతో అభిప్రాయాలను పంచుకుంటామని చెప్పారు. 100కు పైగా దేశాల నుంచి 450 మందికి పైగా ప్రభుత్వ అధినేతలు, ఎంపీలు, జాతీయ పార్టీల నాయకులు, కార్పొరేట్ దిగ్గజాలు, మేధావులు, నిపుణులు, సిద్ధాంతకర్తలు, ప్రగతిశీల భావజాల నాయకులు హాజరవుతారని వివరించారు. అప్పట్లో అమెరికా, రష్యా వంటి రెండు అగ్ర దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న సందర్భంలో జవహర్‌లాల్ నెహ్రూ ఆలోచనలతో భారత దేశం అలీన విధానాన్ని ముందుకు తెచ్చిందని చెప్పారు. అదే విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు ముందుకు తీసుకెళుతున్నాయన్నారు. ఆ పరంపరలో భాగంగా రాహుల్ గాంధీ ‘న్యాయ్’ అనే ఆలోచన మేరకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహిస్తోందన్నారు. ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను నిలిపేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రగతిశీల రాజకీయ పార్టీలను మాత్రమే ఆహ్వానించామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సదస్సు నిర్వహణతో పెట్టుబడుల విషయంలో తెలంగాణకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని భావిస్తున్నట్లు ఉత్తమ్ తెలిపారు.
సాంస్కృతిక కార్యక్రమాల తొలగింపు
పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో సదస్సులో సాంస్కృతిక కార్యక్రమాలు, విందులు వంటివాటిని తొలగించామని ఏఐసీసీ కార్యదర్శి గురుదీ్‌పసింగ్ సప్పల్ చెప్పారు. ఇలాంటి సందర్భంలో భారత్ సమ్మిట్‌ను నిర్వహించడం సమంసజం కాదన్న అభిప్రాయాలూ ఉన్నాయని, అందుకే ఆడంబరాలకు తావివ్వడం లేదని తెలిపారు. ఉగ్రదాడులు, దేశ రక్షణ గురించి కూడా సదస్సులో చర్చించి, డిక్లరేషన్‌లో చేరుస్తామని చెప్పారు. కాగా, భారత్ సమ్మిట్ ఏర్పాట్లను భట్టి, ఉత్తమ్, మీనాక్షి నటరాజన్, మహేశ్‌కుమార్‌గౌడ్ పరిశీలించారు.
ఇవి కూడా చదవండి
Honeymoon Couple: హనీమూన్‌కు వెళ్లిన జంట.. కాల్పులకు ముందు ఏం చేశారంటే..
Nellore Police High Alert: నెల్లూరుపై ఉగ్రనీడలు.. పోలీసుల అలర్ట్
Read Latest Telangana News And Telugu News