CM Revanth Reddy unveiled the Vision 2047: రేపటి కోసం..
ABN , Publish Date - Dec 01 , 2025 | 06:14 AM
తెలంగాణ ప్రభుత్వం గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలతో పాలసీ డాక్యుమెంట్‌ను రూపొందిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు....
క్యూర్, ప్యూర్, రేర్ ప్రాంతాలుగా రాష్ట్రం.. గత అనుభవాల పాఠాలతో విధానపత్రం
తెలంగాణ సత్తాను ప్రపంచానికి చాటుతాం
అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడేలా విజన్
నేటి నుంచి తెలంగాణ రైజింగ్ ఉత్సవాలు
ఓఆర్‌ఆర్ లోపల కాలుష్యరహితంగా మారుస్తాం
అంతర్జాతీయ విద్యా సంస్థలను రప్పిస్తాం
మెట్రో, బుల్లెట్ ట్రైన్‌కు కేంద్రం ఓకే: సీఎం రేవంత్
హైదరాబాద్, నవంబరు 30 (ఆంఽధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలతో పాలసీ డాక్యుమెంట్‌ను రూపొందిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. భవిష్యత్తు తరాల కోసం దీనిని జాతికి అంకితం చేయబోతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ రైజింగ్ పేరుతో నిర్వహిస్తున్న ఉత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. 13 రోజులపాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని, 9న విజన్-2047 విధానాన్ని ప్రకటిస్తామని చెప్పారు. ఈ అంశంపై ఆదివారం మంత్రులతో సీఎం సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. విజన్ డాక్యుమెంట్‌ను తెలంగాణ రైజింగ్-2047గా పిలుస్తున్నామని, ఇందులో విజన్, స్ర్టాటజీ రెండు అంశాలు ఉంటాయని అన్నారు. విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో లక్షలాది మందిని భాగస్వాములను చేస్తున్నామని, నీతి ఆయోగ్, ఐఎ్‌సబీ లాంటి సంస్థల సహకారంతో డాక్యుమెంట్‌ను తయారు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి అంశాన్నీ లోతుగా విశ్లేషించి భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా విభజించామని తెలిపారు. ఓఆర్‌ఆర్ లోపల కోర్ అర్బన్ రీజనల్ ఎకానమీ (క్యూర్), ఓఆర్‌ఆర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు పెరీ అర్బన్ రీజనల్ ఎకానమీ (ప్యూర్), ఆర్‌ఆర్‌ఆర్ నుంచి రాష్ట్రమంతా రూరల్ అగ్రికల్చరల్ రీజనల్ ఎకానమీ (రేర్)గా గుర్తించి ప్రత్యేక ప్రణాళిక అమలు చేయనున్నామని వివరించారు.
మూడు విభాగాలుగా తెలంగాణ..
దేశవ్యాప్తంగా మెట్రోపాలిటన్ నగరాలు ప్రస్తుతం కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణలో తాము క్యూర్‌గా పేర్కొంటున్న ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను ఈ ప్రాంతం నుంచి తరలిస్తున్నామని తెలిపారు. క్యూర్ ప్రాంతాన్ని సర్వీస్ సెక్టార్‌గా మారుస్తున్నామని, ఇందులో మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ వంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నామని పేర్కొన్నారు. ఇక ఔటర్ రింగ్ రోడ్డు అవతలి భాగంలో 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్లు రాబోతున్నాయని, ప్యూర్‌గా పిలుచుకోనున్న ఈ ప్రాంతంలో భారత్ ప్యూచర్ సిటీతోపాటు అనేక పారిశ్రామిక పార్కులు ఉంటాయని వెల్లడించారు. గ్రీన్ ఫీల్డ్ హైవే, బుల్లెట్ ట్రైన్ వంటివి ఇక్కడ రాబోతున్నాయని, దీనికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని ప్రకటించారు. అలాగే వ్యాపార ఎగుమతులు, దిగుమతులకు నౌకాశ్రయం కీలకమని, తెలంగాణలో తీర ప్రాంతం లేనందున ఏపీలోని మచిలీపట్నం పోర్టుకు కనెక్టివిటీ తీసుకొస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ నుంచి మచిలీపట్నం పోర్టుకు డెడికేటెడ్ గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మించనున్నామన్నారు.
వరంగల్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం..
తెలంగాణలో ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ఉన్నందున.. వరంగల్‌లోనూ అంతర్జాతీయ విమానాశ్రయం కావాలని పారిశ్రామికవేత్తలు కోరుతున్నారని సీఎం రేవంత్ అన్నారు. దీంతో వ్యాపార ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయని, అందుకే వరంగల్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. అలాగే ఆదిలాబాద్, కొత్తగూడెం, రామగుండంలో ఎయిర్ పోర్టులు తీసుకురాబోతున్నామని, హైవే, పోర్ట్, ఎయిర్ పోర్టు కనెక్టివిటీతో పెట్టుబడులు తీసుకువచ్చి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేస్తామని చెప్పారు. ఇక రీజనల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు మూడో రీజియన్‌గా పరిగణిస్తున్నామన్నారు. వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను మరింత ప్రోత్సహించడం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటుచేయడం, రైతుల ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కోసం ఈ ప్రాంతాన్ని రేర్‌గా పిలుస్తున్నామని పేర్కొన్నారు. క్యూర్, ప్యూర్, రేర్‌లో తెలంగాణ ముఖచిత్రాన్ని చూస్తున్నామని, ఈ మూడింటినీ క్రోడికరించి తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఉండబోతోందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి ప్రణాళికలు రచిస్తున్నామన్నారు.
దేశ ఆర్థికవ్యవస్థలో 10ు వాటా లక్ష్యంగా..
దేశానికి అవసరమైన దాని కంటే ఎక్కువ ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తున్నామని, అయినా.. ప్రజలకు పౌష్ఠికాహారం ఇవ్వలేకపోతున్నామని సీఎం రేవంత్ అన్నారు. అందరికీ విద్య అందుబాటులో ఉన్నప్పటికీ నాణ్యమైన విద్య, సాంకేతిక విద్య అందుబాటులో లేదన్నారు. అందుకే అంతర్జాతీయ విద్యా సంస్థలను రాష్ట్రానికి రప్పించి నాలెడ్జ్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. దేశ జనాభాలో తెలంగాణ వాటా 2.5 శాతం ఉండగా, దేశ ఆర్థిక వ్యవస్థలో 5శాతంగా ఉందని, దీనిని 10 శాతానికి పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం లక్ష్యమని పునరుద్ఘాటించారు. తెలంగాణ రైజింగ్ ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా నిపుణులు వస్తున్నారని, సచివాలయంలో వార్ రూం, డిప్యూటీ సిఎం పర్యవేక్షిస్తారని అన్నారు. ‘‘ఏపీ, తమిళనాడు, మరో రాష్ట్రం మాకు పోటీ కాదు. చైనా, జపాన్, జర్మనీ, సింగపూర్, దక్షిణ కొరియాతో పోటీ పడబోతున్నాం. అభివృద్ధి చెందిన దేశాలే మాకు పోటీ. వారే మాకు ఆదర్శం. చైనా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ మాకు రోల్ మోడల్. వారినే ఆదర్శంగా తీసుకుని పోటీ పడతాం. ఆయా దేశాల నుంచీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. తెలంగాణలో పెట్టుబడులు పెట్టకుంటే చాలా కోల్పోతామన్న భావన అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు కలిగేలా విజన్-2047 ప్రణాళిక ఉంటుంది’’ అని సీఎం రేవంత్ అన్నారు.
ఈ నెల 6 వరకు జిల్లాల్లో ఉత్సవాలు
తెలంగాణ రాష్ట్రం దేశంతోనే కాకుండా.. ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అన్నారు. తెలంగాణ రైజింగ్-2047 సమ్మిట్ పేరిట డిసెంబరు 1 నుంచి 6వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాల వారీగా ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించే ఉత్సవాల్లోనూ సీఎం పాల్గొంటారని తెలిపారు. ఇక గ్లోబల్ సమ్మిట్‌లో ఏర్పాటుచేసిన స్టాళ్లను ప్రజలందరూ చూసేందుకు డిసెంబరు 11, 12, 13 తేదీల్లో అవకాశం కల్పిస్తామన్నారు. కాగా, విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు రాష్ట్రవ్యాప్తంగా 4లక్షల మంది ప్రజల అభిప్రాయాలు సేకరించామన్నారు. కాగా, తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో పాల్గొనాలంటూ ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రాసిన లేఖను సీఎం రేవంత్, మంత్రులు విడుదల చేశారు.
రేపటిలోగా నివేదిక సమర్పించాలి: సీఎం రేవంత్
మంత్రులు, అధికారులు తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌లో తమ శాఖ పరిధిలోని ప్రతి అంశాన్నీ సోమ, మంగళవారాల్లో చర్చించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. 2వ తేదీ రాత్రికి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. 3, 4 తేదీలలో అన్ని శాఖలు ఇచ్చిన నివేదికలను సీఎస్, స్పెషల్ సీఎస్, సీఎంవో అధికారులు పరిశీలించాలని, అవసరమైన మార్పులు చేసి.. తుది ప్రతిని సిద్ధం చేయాలని అన్నారు. 6వ తేదీ సాయంత్రం వరకు విజన్ 2047 డాక్యుమెంట్ సంపూర్ణంగా సిద్ధం కావాలని, అన్ని విభాగాల అధికారులు డాక్యుమెంట్ రూపకల్పన కోసం పూర్తి సమయం కేటాయించాలని నిర్దేశించారు. గ్లోబల్ సదస్సు ఏర్పాట్లు నిర్వహణలో శాఖల మధ్య సమన్వయం ఉండాలన్నారు. ఇక ఈ నెల 13న ఎల్బీ స్టేడియంలో ప్రపంచ దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ పాల్గొనే సెలెబ్రిటీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఆడేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం గంటపాటు ప్రాక్టీస్ చేశారు. ఎంసీహెచ్‌ఆర్‌డీలోని ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో ఇతర క్రీడాకారులతో కలిసి ప్రాక్టీ్‌సలో పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
New Liquor Policy: 71,550 కోట్లు
Village Elections: పల్లెపోరు..నామినేషన్ల జోరు