Share News

Earth Sciences University: కొత్తగూడెం ఎర్త్‌ సైన్సెస్‌ వర్సిటీలో ఆగస్టు నుంచి తరగతులు!

ABN , Publish Date - Jul 30 , 2025 | 05:07 AM

దేశంలోనే మొదటి ఎర్త్‌ సైన్సెస్‌ (భూ విజ్ఞాన శాస్త్రం) యూనివర్సిటీని రాష్ట్ర ప్రభు త్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో ఏర్పాటు చేసింది.

Earth Sciences University: కొత్తగూడెం ఎర్త్‌ సైన్సెస్‌ వర్సిటీలో ఆగస్టు నుంచి  తరగతులు!

  • ‘దోస్త్‌’ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తుల స్వీకరణ

  • పీజీ కోర్సులూ ఈ ఏడాది నుంచే ప్రారంభం

కొత్తగూడెం ఎడ్యుకేషన్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే మొదటి ఎర్త్‌ సైన్సెస్‌ (భూ విజ్ఞాన శాస్త్రం) యూనివర్సిటీని రాష్ట్ర ప్రభు త్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో ఏర్పాటు చేసింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో అంతకుముందున్న మైనింగ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలను ఎర్త్‌ సైన్స్‌ వర్సిటీగా అప్‌గ్రేడ్‌ చేసి.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మాజీ ప్రధాని దివంగత మన్మోహన్‌ సింగ్‌ పేరు పెట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ఇచ్చేందుకు ‘దోస్త్‌’ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించింది. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. మెరిట్‌, రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయిస్తారు. బీఎస్సీలో జియాలజీ, జియోఫిజిక్స్‌, జియోకెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ కోర్సులతో పాటు పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సులు కూడా ఈ ఏడాది నుంచే ప్రారంభించనున్నారు.


ఒక్కో విభాగం లో బీఎస్సీలో 60, పీజీలో 40సీట్లు ఉన్నాయి. ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా పీజీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. ప్రస్తుతం ఎర్త్‌ సైన్సెస్‌ కోర్సులన్నీ దేశంలో ఎక్కడా ఒకే వర్సిటీలో ఎక్కడా లేవు. ఈ కోర్సులకు దేశ విదేశాల్లో వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఎర్త్‌ సైన్సెస్‌ వర్సిటీ 312 ఎకరాల్లో ఏర్పాటవుతోంది. రూ.500 కోట్లతో సదుపాయాలు కల్పిస్తున్నారు. మొద టి ఏడాది ఏ కోర్సుల్లో ఏ సబ్జెక్టులు ఉండాలనే అంశంపై వివిధ వర్సిటీల అధ్యాపకులతో చర్చించారు. ఆగస్టులో తరగతులు ప్రారంభమవుతాయని విద్యా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, వైస్‌ చాన్సలర్‌ యోగితా రాణా తెలిపారు. బీఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్‌ ఫీజు రూ.19,500 వరకు ఉంటుందని, స్కాలర్‌షిప్‌ లభిస్తుందని ప్రిన్సిపాల్‌ జగన్‌ మన్మోహన్‌రాజు చెప్పారు.

Updated Date - Jul 30 , 2025 | 05:07 AM