Share News

Suspension: నిలోఫర్‌ సూపరింటెండెంట్‌పై కొరడా

ABN , Publish Date - May 24 , 2025 | 03:44 AM

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో ఒకే రోజు ముగ్గురు కీలక అధికారులపై వేటు పడింది. హైదరాబాద్‌ నిలోఫర్‌ ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవికుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

Suspension: నిలోఫర్‌ సూపరింటెండెంట్‌పై కొరడా

  • అవినీతి, అక్రమాల ఆరోపణలు

  • ఆస్పత్రి బ్లడ్‌ బ్యాంకులో దొంగతనం జరిగినా నిర్లక్ష్యం

  • ప్రైవేటు మందుల షాపు నిర్మాణ వివాదం నేపథ్యంలో సస్పెన్షన్‌

  • అవినీతి ఆరోపణలతో పేట్లబుర్జు సూపరింటెండెంట్‌, సూర్యాపేట

  • డీఎంహెచ్‌వో కూడా తొలగింపు

  • వైద్యారోగ్య శాఖలో ఒకేరోజు ముగ్గురు అధికారులపై చర్యలు

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, మే 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో ఒకే రోజు ముగ్గురు కీలక అధికారులపై వేటు పడింది. హైదరాబాద్‌ నిలోఫర్‌ ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవికుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఆయన స్థానంలో ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ విజయ్‌కుమార్‌ను నియమించింది. పేట్లబుర్జు ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రజనిరెడ్డిని తొలగించి.. డాక్టర్‌ జయకు ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించింది. అలాగే సూర్యాపేట డీఎంహెచ్‌వో డాక్టర్‌ కోటాచలంను విధుల నుంచి తప్పించి.. ఎల్బీనగర్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ పి. చంద్రశేఖర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.


తీవ్రమైన అవినీతి ఆరోపణలతోనే..

శుక్రవారం ప్రభుత్వం చర్యలు చేపట్టిన ముగ్గురు అధికారులపై కూడా అవినీతి, అక్రమాల ఆరోపణలు ఉన్నాయి. నిలోఫర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రవికుమార్‌.. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్‌) కింద వచ్చిన నిధులను దుర్వినియోగం చేశారని.. బ్లడ్‌బ్యాంకులో నుంచి ఆస్పత్రి సిబ్బంది రక్తం బ్యాగులు దొంగతనం చేసినట్టు తేలినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలున్నాయి. వీటితోపాటు పలు ఇతర ఆరోపణలపై ఆయనకు చార్జ్‌మెమో కూడా జారీ అయింది. గతంలో ఫుడ్‌ పాయిజన్‌ అయిన విద్యార్థులను నిలోఫర్‌కు తీసుకువస్తే... వెంటనే చికిత్స అందించకుండా, వారికి 14 ఏళ్లపై వయసు ఉందని, ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇటీవల ఆస్పత్రి పార్క్‌ ప్రాంతంలో ఓ ప్రైవేటు మెడికల్‌ షాపు నిర్మాణం కోసం అనుమతులు ఇవ్వడం వివాదాస్పదమైంది. సీఎం ఆఫీసు, వైద్య మంత్రి, జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకే నిర్మాణం చేపట్టామంటూ ఆయన మీడియాతో మాట్లాడటంతో.. సర్కారు సీరియస్‌ అయింది. ఇక సూర్యాపేట జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కోటాచలం.. కొవిడ్‌ సమయంలో జాతీయ ఆరోగ్య మిషన్‌, రాష్ట్ర ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలున్నాయి. సూర్యాపేట జిల్లాలో పెద్ద సంఖ్యలో ప్రైవేటు ఆస్పత్రులకు... నిబంధనలకు విరుద్ధంగా, వైద్యుల రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ కూడా లేకుండానే అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై జిల్లా వైద్యులు కొందరు ఫిర్యాదు చేయడంతో.. మంత్రి దామోదర రాజనర్సింహ విచారణకు ఆదేశించారు. ఆ నివేదిక ప్రభుత్వానికి అందింది. కోటాచలంపై వేటు పడింది. మరోవైపు పేట్లబుర్జు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రజనిరెడ్డి అవినీతికి పాల్పడ్డారంటూ ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది.


ఇంతకు ముందూ ముగ్గురు!

అవినీతి, అక్రమాల ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యంతో కొన్నిరోజుల కిందే ముగ్గురు వైద్యారోగ్య శాఖ అధికారులపై ప్రభుత్వం చర్యలు చేపట్టడం గమనార్హం. జగిత్యాల బోధనాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాములుపై పలు రకాల ఆరోపణలు రావడం, ఆస్పత్రిలో సరిగ్గా ఉండటం లేదన్న ఫిర్యాదులతో చర్యలు చేపట్టింది. నిజామాబాద్‌ బోధనాస్పత్రి సూపరింటెండెంట్‌గా ఉన్న డాక్టర్‌ ప్రతిమారాజ్‌ను కూడా సర్కారు ఉన్నపళంగా తొలగించింది. ఆస్పత్రి ప్రాంగణంలో పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం, రోగులను పట్టించుకోకపోవడంతో ఆమెపై వేటు పడింది. పలు రకాల ఆరోపణలతో వనపర్తి వైద్య కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సునందినిని సర్కారు తప్పించింది.


ఇవి కూడా చదవండి

Genelia D Souza: డ్రైవర్ తొందరపాటు.. జెనీలియాకు తప్పిన పెను ప్రమాదం

Viral Video: ఇండియన్ ఆక్వామ్యాన్.. ఉప్పొంగుతున్న మ్యాన్‌ హోల్‌లోంచి..

Updated Date - May 24 , 2025 | 03:44 AM