Share News

IAS Officers: మే మొదటి వారంలో కలెక్టర్ల బదిలీలు?

ABN , Publish Date - Apr 15 , 2025 | 04:21 AM

రాష్ట్రంలో మే నెల మొదటి వారంలో కలెక్టర్ల బదిలీలు జరగనున్నాయి. ఈమేరకు ప్రభుత్వం బదిలీలపై కసరత్తు మొదలు పెట్టింది. ఈసారి కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల(స్థానిక సంస్థలు)ను పెద్దసంఖ్యలో బదిలీ చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది.

IAS Officers: మే మొదటి వారంలో కలెక్టర్ల బదిలీలు?
IAS Officers Transfers

  • ఈసారి పెద్దసంఖ్యలో ఉండే అవకాశం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో మే నెల మొదటి వారంలో కలెక్టర్ల బదిలీలు జరగనున్నాయి. ఈమేరకు ప్రభుత్వం బదిలీలపై కసరత్తు మొదలు పెట్టింది. ఈసారి కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల(స్థానిక సంస్థలు)ను పెద్దసంఖ్యలో బదిలీ చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. 2024 సంవత్సరం జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 20 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఇందులో కొంతమంది అదనపు కలెక్టర్లు, ఇతర సీనియర్‌ అధికారులు మినహా ఎక్కువ మంది కలెక్టర్లే ఉన్నారు. ఆ తర్వాత అంత పెద్దసంఖ్యలో కలెక్టర్‌ స్థాయి అధికారులను బదిలీ చేయలేదు. అయితే.. ఇంకా కొన్ని జిల్లాల్లో రెండేళ్లకు మించి కలెక్టర్లు పని చేస్తున్నారు. సాధారణంగా ఒకే జిల్లాలో రెండు... మహా అయితే మూడేళ్ల పాటు కలెక్టర్‌గా కొనసాగుతుంటారు.


ఇలా రెండు, మూడేళ్లుగా ఒకే చోట పని చేస్తున్న కలెక్టర్లను బదిలీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. కొంతమంది జిల్లా కలెక్టర్లపై ఆరోపణలు కూడా ఉన్నాయి. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లాలంటూ పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. కానీ కొంతమంది కలెక్టర్లు జిల్లా కేంద్రాలను వీడడం లేదని, పైగా.. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యంగా ఉంటున్నారంటూ స్థానిక ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. ఇలాంటి ఫిర్యాదులున్నవారికి బదిలీలు తప్పవని అంటున్నారు. మే నెల మొదటి వారంలో ఈ బదిలీలు జరగనున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది.

Updated Date - Apr 15 , 2025 | 09:43 AM