Sports Development: క్రీడల అభివృద్ధికి.. 9 ఒప్పందాలు
ABN , Publish Date - Aug 03 , 2025 | 05:04 AM
రాష్ట్రంలో క్రీడా రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం తొమ్మిది కీలక అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకుంది. వివిధ క్రీడల్లో ప్రత్యేక శిక్షణతోపాటు క్రీడాకారులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేందుకు వీలుగా చర్యలు చేపట్టనుంది.

రాష్ట్రంలో ఫిఫా సాకర్ అకాడమీ ఏర్పాటు.. షూటింగ్‌లో అత్యాధునిక శిక్షణ
క్రీడాకారుల ప్రదర్శన విశ్లేషణ, గాయాల పాలవకుండా ప్రత్యేక వ్యవస్థ
గురుకుల విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ
‘స్పోర్ట్స్ కాన్‌క్లేవ్’లో ఒప్పందాలు
క్రీడల్లో ప్రపంచంతో పోటీ పడతాం
క్రీడల్లో రాజకీయ జోక్యం తగ్గించేందుకు స్పోర్ట్స్ హబ్ బోర్డు: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): రాష్ట్రంలో క్రీడా రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం తొమ్మిది కీలక అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకుంది. వివిధ క్రీడల్లో ప్రత్యేక శిక్షణతోపాటు క్రీడాకారులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేందుకు వీలుగా చర్యలు చేపట్టనుంది. గురుకులాల్లోని విద్యార్థులను జల్లెడపట్టి ప్రతిభావంతులను ఎంపిక చేసి ప్రత్యేకంగా శిక్షణ అందించనుంది. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగిన స్పోర్ట్స్ కాన్‌క్లేవ్‌లో రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది ఎంవోయూలు కుదుర్చుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడా పాలసీని సీఎం రేవంత్‌రెడ్డి అధికారికంగా ఆవిష్కరించి ప్రసంగించారు. ప్రపంచ క్రీడా రంగంతో పోటీపడేలా ఈ పాలసీని రూపొందించామనితెలిపారు. ఈ పాలసీ కాగితాలపై మాత్రమే కనిపించేది కాదని, తెలంగాణకు బంగారు రేఖగా మారుతుందని చెప్పారు. ప్రపంచ క్రీడా రంగంలో ప్రభావం చూపాలంటే.. దేశ క్రీడా వ్యవస్థలో సమూల మార్పులు రావాలని ఆయన చెప్పారు. ఆ మార్పు తెలంగాణ నుంచే మొదలవనుందన్నారు. రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధి కోసం ముందుకొచ్చే సంస్థలకు ప్రభుత్వ అనుమతుల కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తామని తెలిపారు. యంగ్ ఇండియా యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీల ఏర్పాటుకు సహకరించేందుకు క్రీడా రంగ ప్రముఖులు, కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని కోరారు.
స్పోర్ట్స్ గవర్నింగ్ బోర్డు ఏర్పాటు..
క్రీడల్లో రాజకీయ జోక్యం తగ్గించేందుకు, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం పెంచేందుకు స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ బోర్డును ఏర్పాటు చేసినట్టు సీఎం రేవంత్ తెలిపారు. దీనికి సంజీవ్ గోయెంకా చైర్‌పర్సన్‌గా, కొణిదెల ఉపాసన కో-చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. ప్రముఖ క్రీడాకారులు కపిల్‌దేవ్, బైచుంగ్ భూటియా, పుల్లెల గోపీచంద్, గగన్ నారంగ్, అభినవ్ బింద్రా, హైదరాబాద్ సన్‌రైజర్స్ క్రికెట్ జట్టు యజమాని కావ్యమారన్ తదితరులు ఈ బోర్డులో సభ్యులుగా, మార్గదర్శకులుగా ఉంటారని వివరించారు. కాగా, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్వహణ కోసం కొరియా క్రీడా విశ్వవిద్యాలయంతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో గత పదేళ్లలో క్రీడా మైదానాలు సన్‌బర్న్ ఈవెంట్లు, ఇతర వేడుకలకు ఫంక్షన్ హాళ్లుగా మారిపోయాయని విమర్శించారు. సరైన క్రీడా పాలసీ లేకనే యువత పెడదారి పడుతోందన్నారు. ఈ కాన్‌క్లేవ్‌లో రాష్ట్ర క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ క్రీడా సలహాదారు జితేందర్‌రెడ్డి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, క్రీడా ప్రముఖులు అభినవ్ బింద్రా, అనిల్ కుంబ్లే, గగన్ నారంగ్, అంజూ బాబీ జార్జ్, రవికాంత్‌రెడ్డి, నయీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
తొమ్మిది ఒప్పందాలు ఇవే
హైదరాబాద్‌లో ఫిఫా సాకర్ అకాడమీ ఏర్పాటు కోసం జాతీయ ఫుట్‌బాల్ సంఘంతో ఒప్పందం.
రాష్ట్ర షూటర్లకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ఒలింపియన్ షూటర్ గగన్ నారంగ్‌కు చెందిన ‘గన్ ఫర్ గ్లోరీ (జీఎ్‌ఫజీ) ఫౌండేషన్’తో ఒప్పందం. హెచ్‌సీయూలోని శాట్ షూటింగ్ రేంజ్‌ను ప్రభుత్వం ఆధునికీకరిస్తుంది. శాట్ ప్రతిపాదించిన 20 మంది షూటర్లకు జీఎ్‌ఫజీ అత్యాధునిక శిక్షణ ఇస్తుంది.
రాష్ట్రంలో షూటింగ్ అభివృద్ధి కోసం గగన్ నారంగ్ మెంటార్‌గా వ్యవహరిస్తారు. ప్రతిభావంతులైన షూటర్ల గుర్తింపు, శిక్షణను పర్యవేక్షిస్తారు.
బ్యాడ్మింటన్ మెంటార్‌గా నియమితులైన పుల్లెల గోపీచంద్.. ప్రతిభావంతులైన షట్లర్ల గుర్తింపు, శిక్షణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు.
‘స్పోర్ట్స్ సైన్స్ సెంటర్-అథ్లెట్ డెవల్‌పమెంట్ ప్రోగ్రాం’ కోసం ఒలింపియన్ అభినవ్ బింద్రాకు చెందిన ‘అభినవ్ బింద్రా టార్గెటింగ్ పెర్ఫామెన్స్ (ఏబీటీపీ)’తో ఒప్పందం క్రీడాకారుల ప్రదర్శన విశ్లేషణ, గాయాల బారిన పడకుండా చర్యలు, త్వరగా కోలుకునేందుకు అవసరమైన వ్యవస్థ ఏర్పాటుకు ఏబీటీపీ సహకారం అందిస్తుంది. గురుకులాల్లో క్రీడాకారులకు శిక్షణ, క్రీడా సామగ్రి అందించేందుకు కూడా ఈ సంస్థతో ఒప్పందం జరిగింది.
క్రీడాకారుల్లో ఆత్మ స్థైర్యం, విశ్వాసం పెంపు, ఇంగ్లిష్ భాష, డిజిటల్ అక్షరాస్యతపై పట్టు కల్పించేందుకు ఆస్పైర్ సంస్థతో ఒప్పందం.
‘బాస్కెట్‌బాల్ హైపెర్ఫామెన్స్ కోచింగ్ ప్రోగ్రాం’ నిర్వహణ కోసం స్పోర్ట్‌జ్‌ప్రీ కంపెనీతో ఒప్పందం. ఈ క్రీడలో సబ్ జూనియర్ నుంచి సీనియర్ల వరకు శిక్షణ ఇస్తారు.
అథ్లెటిక్స్, కబడ్డీ, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, వాలీబాల్ క్రీడాంశాల్లో గురుకుల విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు అనిల్ కుంబ్లేకు చెందిన టెన్‌విక్ సంస్థతో ఒప్పందం. సుమారు లక్షా 50 వేల మంది విద్యార్థులను పరీక్షించి, ప్రతిభావంతులను గుర్తిస్తారు.
ఐదుగురు క్రీడాకారులకు చెక్కులు
స్పోర్ట్స్ కాన్‌క్లేవ్ సందర్భంగా ఐదుగురు క్రీడాకారులకు ఆర్థిక సాయం చెక్కులను సీఎం అందజేశారు. హెప్టాథ్లాన్ క్రీడాకారిణి అగసర నందినికి రూ.5 లక్షలు, జిమ్నాస్ట్ నిషిక అగర్వాల్‌కు రూ.3 లక్షలు, షూటర్ ధనుష్ శ్రీకాంత్‌కు రూ.10 లక్షలు, గోల్‌బాల్ క్రీడాకారులు పవన్ కల్యాణ్, సాయితేజకు చెరో రూ.2 లక్షల 40 వేలు అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాంగ్రెస్ మాత్రమే మోదీని కుర్చీ నుంచి దింపగలదు: రేవంత్‌రెడ్డి
ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లను తిరిగి కక్కిస్తాం.. మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్
Read latest Telangana News And Telugu News