Share News

Engineering Branch Change: బీటెక్‌ సెకండియర్‌లో బ్రాంచ్‌ మార్పు!

ABN , Publish Date - Jul 21 , 2025 | 04:21 AM

ఇంజనీరింగ్‌లో మొదట చేరిన బ్రాంచ్‌ చదవడం కష్టంగా ఉంది.. కొనసాగాలన్న ఆసక్తి లేదు.. వేరే బ్రాంచ్‌కి మారే అవకాశమివ్వండి..

Engineering Branch Change: బీటెక్‌ సెకండియర్‌లో బ్రాంచ్‌ మార్పు!

  • అవకాశం కల్పించే యోచనలో ఉన్నత విద్యామండలి

హైదరాబాద్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ‘ఇంజనీరింగ్‌లో మొదట చేరిన బ్రాంచ్‌ చదవడం కష్టంగా ఉంది.. కొనసాగాలన్న ఆసక్తి లేదు.. వేరే బ్రాంచ్‌కి మారే అవకాశమివ్వండి’... ఒకటి, రెండు సెమిస్టర్లు పూర్తయి అత్యధిక పేపర్లు ఫెయిలయ్యాక విద్యార్థులు తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయానికి వచ్చి చేస్తున్న విజ్ఞప్తి ఇది. గత ఏడాదికాలంలో వెయ్యి మందికి పైగా విద్యార్థులు ఇలాంటి దరఖాస్తులు చేశారు. ఇంజనీరింగ్‌ కాలేజీలో ఒకసారి చేరాక ఇంటర్నల్‌ స్లైడింగ్‌, స్పాట్‌ కౌన్సెలింగ్‌ ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యాక ఇతర కోర్సుల్లో చేరడం సాధ్యం కాదు. ప్రారంభంలో ఆసక్తిగా చేరిన విద్యార్థులు తర్వాత కొనసాగేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇష్టంలేని కోర్సు చదవలేక, అందులో ఉత్తీర్ణత సాధించలేక చదువుకు దూరమవుతున్నారు. ఇలా అనాసక్తితో బీటెక్‌ మధ్యలోనే మానేసిన వారు, నాలుగేళ్లు ఎలాగోలా నెట్టుకొచ్చినా తర్వాత బీటెక్‌ పట్టా పొందనివారి సంఖ్య ఏటా పెరుగుతోంది. గత రెండేళ్లలో దాదాపు 9 వేల మంది విద్యార్థులు చదువు మధ్యలోనే ఆపేసినట్టు అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థి ఆసక్తికి అనుగుణంగా ద్వితీయ సంవత్సరంలోనూ బ్రాంచ్‌ మారే అవకాశం ఇవ్వాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఈ దిశగా నిపుణుల సూచనలతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం అనుమతిస్తే ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేసే అవకాశాలున్నాయి.


ఇంటర్నల్‌ స్లైడింగ్‌తో కోర్‌ కోర్సులకు నష్టం..

ఇంజనీరింగ్‌ విద్య విద్యార్థుల ఆసక్తులకనుగుణంగా ఉండాలన్న లక్ష్యం తో కొత్త సంస్కరణలు అమలుచేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండ లి భావిస్తోంది. ఇంజనీరింగ్‌లో ప్రవేశాలు పొందిన వారిలో అనేక మంది మధ్యలోనే చదువు ఆపేస్తుండగా.. మరికొందరు నాలుగేళ్ల తర్వాత కూడా తప్పిన సబ్జెక్టులు ఉత్తీర్ణులు కాలేక ఇంజనీరింగ్‌కు దూరమవుతున్నారు. దీనికి పరిష్కారంగా ద్వితీయ సంవత్సరంలోనూ బ్రాంచ్‌ మారే అవకాశమివ్వాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. మొదటి సంవత్సరం ప్రవేశాల్లో రెండో విడత కౌన్సెలింగ్‌ పూర్తయ్యాక ఇంటర్నర్‌ స్లైడింగ్‌లో ఒకే కాలేజీ పరిధిలో వేరే బ్రాంచ్‌కి మారే అవకాశం ఉంటుంది. ఈ విధానంలో అనేక మంది ఆసక్తితో కోర్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌లో ప్రవేశం పొందిన తర్వాత.. ఇంటర్నల్‌ స్లైడింగ్‌లో అవకాశం ఉంటే సీఎ్‌సఈకి వెళ్లిపోతున్నారు. గత ఏడాది ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌లో దాదాపు 5,500 మంది ఇంటర్నల్‌ స్లైడింగ్‌ అవకాశాన్ని వినియోగించుకున్నారు. వీరంతా కోర్‌ కోర్సులైన ఈసీఈ, ఈఈఈ, సివిల్‌, మెకానికల్‌ వదిలి సీఎ్‌సఈ, అనుబంధ బ్రాంచ్‌లను ఎంచుకున్నారు. రెండు విడతల కౌన్సెలింగ్‌ పూర్తయ్యాక మెకానికల్‌ ఇంజనీరింగ్‌లోని మొత్తం 4,456 సీట్లలో 3,983 (89.38ు) సీట్లు భర్తీకాగా.. ఇంటర్నల్‌ స్లైడింగ్‌ తర్వాత ఇందులోని అనేకమంది సీఎ్‌సఈకి వెళ్లడంతో చివరగా మెకానికల్‌లో రాష్ట్రవ్యాప్తంగా 2,086 (46.81ు) సీట్లు మిగిలిపోయాయి. అలాగే ట్రిపుల్‌ఈలో మొత్తం 6,303 సీట్లుండగా.. 2,326, ఈసీఈలో మొత్తం 15,634లో 1,401 సీట్లు మిగిలిపోయాయి. మిగిలిన సీట్లన్నీ భర్తీ చేయాలన్న లక్ష్యంగా ఇంటర్నల్‌ స్లైడింగ్‌ చేస్తున్నా.. కోర్‌ బ్రాంచ్‌లకు తీరని నష్టం జరుగుతోంది. రెండో సంవత్సరంలో విద్యార్థులకూ ఇంకో అవకాశం ఇస్తే కోర్‌ బ్రాంచ్‌ల్లోనూ సీట్లు భర్తీ అయ్యే అవకాశం ఉంటుందని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది.


అన్ని బ్రాంచ్‌లకు సమ ప్రాధాన్యత లక్ష్యం

ఇంజనీరింగ్‌ అంటే కేవలం సీఎ్‌సఈ మాత్రమే కాదు. బీటెక్‌లో వివిధ బ్రాంచ్‌ల్లో మొత్తం 47 కోర్సులున్నాయి. సీఎ్‌సఈ చదివితేనే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని అనేక మంది భావిస్తున్నా.. అది వాస్త వం కాదు. రాష్ట్రంలో అనేక రంగాలకు చెందిన భారీ పరిశ్రమలు వస్తున్నాయి. ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌, ఏరోస్పేస్‌, ఆటోమొబైల్‌.. ఇలా అనేక రంగాల్లో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలకు సీఎస్‌ఈ అవసరమైనట్టుగానే.. ఐటీయేతర కంపెనీల్లో మానవ వనరుల కు కోర్‌ ఇంజనీరింగ్‌ పట్టభద్రులు అవసరం. అందుకే ద్వితీయ సంవత్సరంలోనూ ఇంటర్నల్‌ స్లైడింగ్‌ అవకాశం ఇచ్చి కోర్‌ ఇంజనీరింగ్‌ను మరిం త బలోపేతం చేయాలని భావిస్తున్నాం.

- ఆచార్య బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌


ఈ వార్తలు కూడా చదవండి..

త్వరలో యాదగిరి ఆధ్యాత్మిక మాసపత్రిక, టీవీ చానల్‌

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 21 , 2025 | 04:21 AM