Holi celebrations: సంతోషాల హోలీ
ABN , Publish Date - Mar 15 , 2025 | 04:28 AM
రాష్ట్ర వ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ సంబురాలు చేసుకున్నారు. గురువారం అర్ధరాత్రి కామదహనంతో మొదలైన హోలీ వేడుకలు యువతీయువకుల సందడితో, ఆటపాటలతో ఉత్సాహంగా సాగాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా హోలీ వేడుకలు
రాజ్‌భవన్‌లో చిన్నారుతో కలిసి హోలీ ఆడిన గవర్నర్
హున్సలో ఆంక్షల నడుమ పిడిగుద్దులాట
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
రాష్ట్ర వ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ సంబురాలు చేసుకున్నారు. గురువారం అర్ధరాత్రి కామదహనంతో మొదలైన హోలీ వేడుకలు యువతీయువకుల సందడితో, ఆటపాటలతో ఉత్సాహంగా సాగాయి. రాజ్‌భవన్‌లో నిర్వహించిన హోలీ సంబరాల్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. రాజ్‌భవన్ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. పలువురు చిన్నారులు గవర్నర్‌కు హోలీ శుభాకాంక్షలు చెబుతూ ఆయనకు రంగులు పూశారు. ఇక, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్ యువజనకాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి హోలీ ఆడారు. మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని మంత్రి సీతక్క నివాసంలో జరిగిన వేడుకల్లో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమే్‌షరెడ్డి పాల్గొన్నారు. ఇక, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతంలో హోలీకి ఆనవాయితీ నిర్వహించేగుండ్లు(రాళ్లు) భుజానికి ఎత్తుకుని ప్రదక్షిణ చేసే కార్యక్రమాన్ని ఎప్పట్లాగే నిర్వహించారు. నారాయణఖేడ్ మండలంలోని తుర్కపల్లికి చెందిన సాతిని జ్ఞానేశ్వర్ 105 కిలోల గుండును అవలీలగా ఎత్తుకొని గ్రామ దేవత ఆలయం చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేశాడు. అలాగే, కంగ్టిలో స్వామిదాస్ అనే యువకుడు 100 కిలోల బరువున్న గుండును భుజానికి ఎత్తుకుని గ్రామదేవత ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. కాగా, హోలీ సందర్భంగా నిజామాబాద్ జిల్లా సాలూర మండలం హున్స గ్రామంలో హోలీకి ఆనవాయితీగా నిర్వహించే పిడిగుద్దులాట ఈసారి పోలీసు ఆంక్షల మధ్య జరిగింది. ఎప్పట్లాగే గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద తాడు కట్టిన గ్రామ ప్రజలు రెండు వర్గాలుగా తాడుకి ఇరువైపులా నిలబడి ఒకరిపై మరొకరు పిడిగుద్దులు విసురుకున్నారు. నిజానికి, ఈ పిడిగుద్దులాటకు పోలీసులు తొలుత అనుమతి నిరాకరించారు. వందేళ్ల నాటి సంప్రదాయమని గ్రా మ ప్రజలు చేసుకున్న విజ్ఞప్తుల మేరకు పోలీసులు ఐదు నిమిషాల పాటు పిడిగుద్దులాటకు అనుమతించారు.
హోలీ వేడుకల్లో విషాదాలు.. ముగ్గురి మృతి
హోలీ వేడుకలు పలు చోట్ల విషాదాన్ని మిగిల్చాయి. ఆదిలాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లెడివార్ రిషికుమార్ (16) అనే పదో తరగతి విద్యార్థి మరణించగా, ప్రేమ్‌కుమార్ అనే యువకుడు గాయపడ్డాడు. స్నేహితులతో కలిసి హోలీ ఆడి ద్విచక్రవాహనంపై వస్తుండగా రిషి, ప్రేమ్ ప్రమాదానికి గురయ్యారు. ఇక, హోలీ వేడుకల్లో భాగంగా స్నేహితులతో కలిసి ప్రాణహిత నదిలోకి దిగిన మంచిర్యాల జిల్లా వేమనపల్లికి కంపెల రాజ్‌కుమార్ (21) అనే డిగ్రీ విద్యార్థి నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. అలాగే, మిత్రులతో కలిసి హోలీ చేసుకున్న తర్వాత జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్థి గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్‌లో దిగిన గొల్లపల్లి సాగర్‌గౌడ్(32) నీటి ప్రవాహంలో గల్లంతై ప్రాణాలు కోల్పోయాడు. వెల్దుర్థికి చెందిన సాగర్‌కు భార్య వెన్నెల, కుమారుడు, కూతురు ఉన్నారు.
హ్యాపీ హోలీ అంటూ యాసిడ్ పోశాడు
సైదాబాద్ భూలక్ష్మీ ఆలయంలో ఉద్యోగిపై దాడి
సైదాబాద్, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ముఖానికి మాస్కు ధరించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి.. హ్యాపీ హోలీ అంటూ.. ఓ ఆలయ ఉద్యోగిపై యాసిడ్ పోసి పరారయ్యాడు. హైదరాబాద్‌లోని సైదాబాద్ ప్రాంతంలో ఉన్న పెద్దతోట భూలక్ష్మీ ఆలయంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఆలయ అకౌంటెంట్ నర్సింగ్‌రావు అలియాస్ గోపీ(55) రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఆలయ కౌంటర్ వద్ద విధులు నిర్వహిస్తుండగా ఈ దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ పోసి పరారవ్వగా.. మంటతో నర్సింగ్‌రావు పెద్దగా కేకలు వేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.