Share News

Health Treatments: ఆరోగ్యశ్రీలో 27% కిడ్నీ చికిత్సలే!

ABN , Publish Date - Jul 26 , 2025 | 03:38 AM

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద అందించే వైద్య చికిత్సల్లో మూత్రపిండాలకు సంబంధించిన కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. మొత్తం కేసుల్లో 27 శాతం ఇవే ఉన్నాయి! ఆ తర్వాత స్థానంలో క్యాన్సర్‌ కేసులు ఉన్నాయి.

Health Treatments: ఆరోగ్యశ్రీలో 27%  కిడ్నీ చికిత్సలే!

  • తర్వాత స్థానాల్లో క్యాన్సర్‌, పాలీట్రామా

  • ఏడాదిన్నరలో 10.70 లక్షల చికిత్సలు.. ఐదు విభాగాల్లోనే 6.55 లక్షల కేసులు

  • ఆరోగ్యశ్రీలో 461కి పెరిగిన ప్రైవేటు ఆస్పత్రులు.. ఎంప్యానెల్‌ కోసం పోటీ పడుతున్న వైనం

భారీగా పెరగడానికి కారణాలివే..

బీఆర్‌ఎస్‌ హయాంలో ఆరోగ్యశ్రీ కింద నెలకు సగటున 25 వేల వైద్య చికిత్సలు అందించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సంఖ్య దాదాపు 60 వేలకు పెరిగింది. అందుకు కారణాలు.. వైద్య పరిమితిని రూ.10 లక్షలకు పెంచారు. ప్రైవేటు ఎంప్యానెల్‌ ఆస్పత్రుల సంఖ్య 374 నుంచి 461కి పెరిగింది. ఆరోగ్యశ్రీ కింద చికిత్సల సంఖ్య 898 నుంచి 1835కిపెరిగింది. 1375 చికిత్సల ధరలను 20-25ు మేర పెంచారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ప్రతినెలా క్రమం తప్పకుండా సగటున రూ.50-60 కోట్ల బిల్లులు చెల్లిస్తున్నారు. దీంతో గతంలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేసిన ప్రైవేటు ఆస్పత్రులు సైతం మళ్లీ తిరిగి ఆ సేవలను కొనసాగిస్తున్నాయి.

హైదరాబాద్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద అందించే వైద్య చికిత్సల్లో మూత్రపిండాలకు సంబంధించిన కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. మొత్తం కేసుల్లో 27 శాతం ఇవే ఉన్నాయి! ఆ తర్వాత స్థానంలో క్యాన్సర్‌ కేసులు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కింద అందించే వైద్య చికిత్సల్లో 52 శాతం కేసులు కిడ్నీ, క్యాన్సర్‌, పాలీట్రామాకు సంబంధించినవే ఉంటున్నాయి. కిడ్నీ 27 శాతం, క్యాన్సర్‌ 17, పాలీట్రామా 8 శాతం ఉన్నాయి. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద కేవలం 18 నెలల్లోనే రికార్డు స్థాయిలో 10,70,206 లక్షల చికిత్సలు జరిగాయి. ఇందులో అత్యధికంగా హైదరాబాద్‌లో 1.25 లక్షలు, రంగారెడ్డిలో 68 వేలు, నల్లగొండలో 59 వేలు, మేడ్చల్‌లో 52 వేల చికిత్సలు జరిగాయి. ఆరోగ్యశ్రీ ట్రస్టు తాజాగా సర్కారుకు అందించిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. కేవలం 5 విభాగాల్లోనే 65 శాతం చికిత్సలు అందించినట్లు తెలిపింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో 1042 సర్కారీ దవాఖానాలు ఉండగా.. ప్రైవేటు ఆస్పత్రుల సంఖ్య 461కి పెరిగింది. అంతేగాక చికిత్సల రేట్లను కూడా పెంచారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యసేవలు పొందే వారి సంఖ్య భారీగా పెరిగిందని వైద్యవర్గాలు వెల్లడించాయి. ఆరోగ్యశ్రీ కింద ఏడాదిన్నర కాలంలో 10.70 లక్షల చికిత్సలను అందించారు.


ఇందులో ఐదు విభాగాల్లోనే 6.55 లక్షల చికిత్సలు జరిగినట్లు వైద్యవర్గాలు పేర్కొన్నాయి. మూత్రపిండాల విభాగంలో 2.13 లక్షలు, క్యాన్సర్‌లో 1.90 లక్షలు, పాలీట్రామాలో 88 వేలు, యూరినరీ సర్జరీల్లో 81, జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో 81 వేల కేసులకు చికిత్సలందించారు. మిగిలిన అన్ని విభాగాల్లో కలిపి 4.60 లక్షల చికిత్సలు అందించినట్లు తెలిపాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2023 డిసెంబరు వరకు ఆరోగ్యశ్రీ కింద మొత్తం 30.17 లక్షల వైద్య చికిత్సలు అందించారు. ఇందులో ఒక్క ప్రైవేటులోనే 19.06 లక్షలు కాగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 11.10లక్షల చికిత్సలు అందించారు. పదేళ్లలో ఏడాదికి సగటున 3 లక్షల కేసులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు అందించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాగా, గతంలో ఎంతో పలుకుబడి ఉంటే తప్ప ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీలో ఎంప్యానెల్‌ అయ్యేవికావు. మూడు నాలుగేళ్లకోసారి ఎంప్యానెల్‌ అయ్యేందుకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు కోరేవారు. దీంతో పరిమిత సంఖ్యలోనే ప్రైవేటు ఆస్పత్రులు అనుసంధానమయ్యాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మండల, నియోజకవర్గ స్థాయి ఆస్పత్రులకు సైతం ఎంప్యానెల్‌ అయ్యేందుకు అవకాశం కల్పించింది. నిబంధనల్లో మార్పులు చేశారు. 15 అంచెలను 10కి కుదించారు. దరఖాస్తు చేసిన కొద్దిరోజుల్లోనే తనిఖీలు పూర్తి చేసి ఎంప్యానెల్‌ జాబితాలో చేర్చారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులు ఎంప్యానెల్‌ కోసం పోటీపడుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

నా జోలికొస్తే అడ్డంగా నరికేస్తా..

బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చిందని బతికుండగానే..

For Telangana News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 03:38 AM