Siddipet: కొండపాకలో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు
ABN , Publish Date - Feb 23 , 2025 | 05:02 AM
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లిలో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు దేవయ్యపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఖమ్మంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో దేవయ్య బయాలజీ టీచర్.

బయాలజీ ప్రాక్టికల్స్ పేరుతో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ టీచర్ దేవయ్య
కొండపాక, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లిలో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు దేవయ్యపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఖమ్మంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో దేవయ్య బయాలజీ టీచర్. అతడు ప్రాక్టికల్స్ పేరుతో కొంతమంది విద్యార్థులను సైన్స్ ల్యాబ్‌లోకి తీసుకెళ్లి వారితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దేవయ్య వేధింపులు భరించలేక విద్యార్థినులు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. ఈ విషయమై కొందరు తల్లిదండ్రులు శుక్రవారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఆ ప్రధానోపాధ్యాయుడు శనివారం జిల్లా విద్యాశాఖ అధికారికి సమాచారం ఇచ్చారు. మరోవైపు, శనివారం విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయులను నిలదీశారు. సమాచారం అందుకున్న త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్ పాఠశాలకు చేరుకొని ప్రాథమిక విచారణ చేశారు. మహిళా పోలీ్‌సస్టేషన్ సీఐ దుర్గా.. విద్యార్థినులతో ప్రత్యేకంగా మాట్లాడి సమాచారాన్ని సేకరించారు. అనంతరం సీఐ విద్యాసాగర్ మాట్లాడుతూ విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దేవయ్యపై పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే, విషయం బయటపడటంతో దేవయ్య మూడు రోజుల నుంచి సెలవులో ఉన్నాడు. కాగా, దేవయ్యను సస్పెండ్ చేసినట్లు డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.