Universal Srishti Fertility Center: సంతాన సాఫల్యం ముసుగులో శిశు విక్రయం!
ABN , Publish Date - Jul 28 , 2025 | 04:09 AM
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్’ కేసులో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది! సరగసీ (అద్దె గర్భం) లేదు.. దాతల నుంచి వీర్యం సేకరించీ కాదు..

సరగసీ పద్ధతిలో సంతానమంటూ పిల్లల్లేని జంటల నుంచి 35లక్షలు వసూలు
వేరే పిల్లాణ్ని కొని.. వీరికి అమ్మిన వైనం
బిడ్డను అమ్ముకున్న జంటకు 80-90వేలే!
సృష్టి ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలి నిర్వాకాలను వెల్లడించిన డీసీపీ రష్మి
నమ్రత, ఆమె కొడుకు సహా 8మంది అరెస్టు
‘సృష్టి ఫర్టిలిటీ’పై తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 10కి పైగా కేసులు
హైదరాబాద్‌సిటీ/అడ్డగుట్ట, జూలై 27 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్’ కేసులో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది! సరగసీ (అద్దె గర్భం) లేదు.. దాతల నుంచి వీర్యం సేకరించీ కాదు.. ఆ సెంటర్ నిర్వాహకులు శిశువిక్రయాలకు పాల్పడుతున్నారని పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. పిల్లల్లేని దంపతులకు సరగసీ విధానంలో సంతాన భాగ్యం కల్పిస్తానంటూ నమ్మబలికిన ‘సృష్టి’ నిర్వాహకురాలు నమ్రత (64).. వారి నుంచి వీర్యం, అండం సేకరించి హడావుడి చేసి, చివరకు వేరెవరికో పుట్టిన బిడ్డను కొని, వారికి అమ్మినట్టు తేలింది. మోసపోయిన ఆ దంపతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నమ్రత, ఆమె అక్రమాలకు సహకరిస్తున్న ఆమె కుమారుడు సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్‌లోని నార్త్‌జోన్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ రష్మిక పెరుమాళ్.. విలేకరులకు ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. వేరే రాష్ట్రానికి చెందిన దంపతులు కొన్నాళ్లుగా సికింద్రాబాద్‌లో నివాసం ఉంటున్నారు. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవడంతో.. గత ఏడాది ఆగస్టులో ఆన్‌లైన్‌లో చూసి వారిద్దరూ సికింద్రాబాద్‌లో ఉన్న యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌కు వెళ్లి అక్కడ డాక్టర్ నమ్రతను కలిశారు. వారికి రూ.66 వేల విలువైన పరీక్షలు చేయించిన ఆమె.. ఐవీఎఫ్ ద్వారా పిల్లలు పుట్టరని, సరగసీ (అంటే వీరిద్దరి వీర్యం, అండం కలయికతో ఏర్పడిన పిండాన్ని వేరే మహిళ గర్భంలో ఉంచి.. ప్రసవానంతరం పుట్టిన బిడ్డను వీరికి అప్పగించే ప్రక్రియ) ద్వారా అయితే సంతాన భాగ్యం కలుగుతుందని వారిని నమ్మించింది.
అయితే అందుకు రూ.30లక్షలు అవుతుందని వారికి తెలిపింది. అందుకు అంగీకరించిన ఈ దంపతులు.. పుట్టిన బిడ్డకు డీఎన్‌ఏ పరీక్ష చేసి, తమ బిడ్డేనని నిరూపించి తమకు అప్పగించాలని షరతు పెట్టారు. దానికి ఆమె సరేనని రూ.15 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకుంది. ఒప్పందం మేరకు ఈ దంపతులు నిరుడు సెప్టెంబరులో విశాఖపట్నానికి వెళ్లి, అక్కడున్న సృష్టి ఫెర్టిలిటీ బ్రాంచ్‌లో వీర్యం, అండం ఇచ్చివచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌వారు ఆ దంపతులకు ఫోన్ చేసి.. ‘‘అద్దెగర్భానికి ఒక మహిళ ఒప్పుకొంది. పిండాన్ని ఆమె గర్భంలో ప్రవేశపెట్టడం కూడా పూర్తయింది’’ అని చెప్పారు. దశలవారీగా వారివద్ద ముందు మాట్లాడుకున్న డబ్బు వసూలు చేశారు. ఈ ఏడాది జూన్‌లో ఫోన్ చేసి.. ‘సిజేరియన్ ద్వారా ప్రసవం అయింది. మీరొచ్చి మీ బిడ్డను తీసుకోండి’ అని చెప్పారు. వీరు విశాఖకు వెళ్లగా.. ఆపరేషన్ ఖర్చుల పేరుతో మరికొంత డబ్బు వారి వద్ద వసూలు చేసి ఒక బాబును అప్పగించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోపు వారి నుంచి దాదాపు రూ.35 లక్షలు వసూలు చేశారు. ఇంతా చేస్తే.. ఆ బాబు పోలికలు తమతో సరిపోలకపోవడంతో ఆ దంపతులకుఅనుమానం వచ్చి డీఎన్‌ఏ పరీక్ష చేయించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆమె పట్టించుకోకపోవడంతో వారే ఢిల్లీలో డీఎన్‌ఏ పరీక్ష చేయించుకున్నారు. శిశువు వారి బిడ్డ కాదని అక్కడ తేలిపోయింది. దీనిపై వారు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌కు ఎన్నిసార్లు ఫోన్‌చేసినా సమాధానం ఇవ్వకపోగా..చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ నమ్రత కుమారుడు జయంత్‌కృష్ణ బెదిరించాడు. దీంతో ఆ దంపతులు పోలీసులను ఆశ్రయించారు.
అసలు విషయం వెలుగులోకి..
మోసపోయిన దంపతుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. ఆ శిశువు అసోంకు చెందిన ఒక జంట బిడ్డ అని తేలింది. హైదరాబాద్‌లో ఉంటున్న ఆ జంటను విమానంలో విశాఖకు తరలించి అక్కడే ఉంచి, పిల్లాడు పుట్టగానే వారికి రూ.80-90 వేలు చేతిలో పెట్టి, ఆ శిశువునే సికింద్రాబాద్ దంపతులకు అమ్మేసినట్టు వెల్లడైంది. డాక్టర్ నమ్రతకు తమ బిడ్డను విక్రయించిన ఆ జంటను కూడా త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ తెలిపారు. ఇలా గర్భం దాల్చి, తమ కడుపులో ఉన్న బిడ్డలను పెంచడానికి ఇష్టపడని మహిళలను, పుట్టిన బిడ్డలను అమ్మేయడానికి సిద్ధంగా ఉండేవారిని గుర్తించి.. వారి దగ్గరి నుంచి పిల్లలను కొనుగోలు చేసి.. ఆ శిశువులను... సంతాన సాఫల్యం కోసం వచ్చే దంపతులకు అమ్ముతున్న విషయం దర్యాప్తులో తమ దృష్టికి వచ్చిందని.. ఈ కేసులో బాధితులు అలాంటి ఒక జంట అని ఆమె వివరించారు. ఇలాంటి కేసులు ఇంకా ఎన్ని ఉన్నాయో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్‌లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌తోపాటు.. విశాఖలో ఉన్న వారి బ్రాంచ్‌పైన కూడా రెయిడ్ చేసి, ఈ కేసుకు సంబంధించిన పతాల్రు కూడా అక్కడ స్వాధీనం చేసుకున్నట్టు ఆమె తెలిపారు. ఈ కేసులో నమ్రత, ఆమె కుమారుడు జయంత్‌కృష్ణ సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్టు వివరించారు. డాక్టర్ నమ్రత బారిన పడి మోసపోయినవారు వచ్చి నిలదీస్తే.. ‘‘చట్టపరమైన చర్యలు తీసుకుంటామం’’టూ జయంత్‌కృష్ణ బెదిరించేవాడని.. డీసీపీ తెలిపారు.
అంతేకాదు.. ఈ ఫెర్టిలిటీ సెంటర్‌కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ అతడే చూసుకుంటున్నట్టు చెప్పారు. మూడో నిందితురాలు కల్యాణిని.. విశాఖ క్లినిక్‌లో అరెస్ట్ చేసినట్టు చెప్పారు. వీరితోపాటు.. ఈ కేసుతో సంబంధం ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ చెన్నారావు, గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న అనస్తీషియా డాక్టర్ సదానందం, అసోంకు చెందిన ధనశ్రీ సంతోషి, మహ్మద్ ఆలీ ఆదిక్, నస్రీన్ బేగంను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను జడ్జి ఎదుట ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. మరో ఇద్దరు నిందితులు, చిన్నారిని విక్రయించిన ఇద్దరు దంపతులు పరారీలో ఉన్నారని డీసీపీ తెలిపారు. డాక్టర్ నమ్రత రిజిస్ట్రేషన్ రద్దయినా.. ఆమె రెండు తెలుగురాష్ట్రాల్లో సంతాన సాఫల్య కేంద్రాలను నడుపుతున్నారని, అన్ని అనుమతులూ ఉన్న క్లినిక్‌లలో, నిపుణులు మాత్రమే నిర్వహించాల్సిన సంతాన సాఫల్య ప్రక్రియలనూ వీరు అక్రమంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 10కి పైగా కేసులు నమోదయ్యాయని.. ఆ కేసులపైనా దర్యాప్తు కొనసాగిస్తామని ఆమె వెల్లడించారు. కాగా..గతంలోనే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ను లైసెన్స్‌ను రద్దు చేశామని, అయినా అక్రమంగా నిర్వహిస్తున్నారని డీహెచ్‌ఎంహెచ్ వెంకట్ తెలిపారు. ప్రస్తుతం బాబును అమీర్‌పేట్‌లోని శిశువిహార్‌కు తరలించామని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
గాజాపై దాడులకు విరామం.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం
కంబోడియా, థాయ్‌లాండ్ తక్షణం చర్చలు చేపట్టేందుకు రెడీ.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి