Supreme Court: కంచగచ్చిబౌలిలో ఆ వందెకరాలను పునరుద్ధరిస్తారా.. లేక జైలుకెళ్తారా?
ABN , Publish Date - Apr 17 , 2025 | 03:35 AM
ఇష్టమొచ్చినట్టు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తామంటే ఊరుకునేది లేదు. ఆ వందెకరాలనూ ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి. లేదంటే జైలుకెళ్లేందుకు సీఎస్ సహా అధికారులు సిద్ధంగా ఉండాలి. అక్కడే కొలను దగ్గర ఆరు నెలల్లో తాత్కాలికంగా జైలు నిర్మించి అందరినీ అందులో ఉంచుతాం.

సీఎస్ సహా అధికారులంతా సిద్ధంగా ఉండండి
అక్కడే కొలను వద్ద 6 నెలల్లో తాత్కాలిక జైలు నిర్మించి అందులో ఉంచుతాం
ఆ భూముల్లో బుల్‌డోజర్లు తొలగించారా?.. చెట్ల నరికివేతకు అనుమతి ఉందా?
అభివృద్ధి, పర్యావరణం మధ్య సమతౌల్యం అవసరం
చెట్ల కొట్టివేతతో జంతువులపై కుక్కల దాడి వీడియో చూసి ఆందోళన చెందాం
అవసరమైతే 2400 ఎకరాల్లో ఒక్క చెట్టూ కొట్టకుండా ఆదేశాలిస్తాం: సుప్రీం
పనులన్నీ ఆపేశాం.. ఆ భూములన్నీ సర్కారుకు చెందినవే.. రాష్ట్ర ప్రభుత్వ వాదన
సీఈసీ నివేదిక అధ్యయనానికి సమయం ఇవ్వాలని విజ్ఞప్తి
యథాతథ స్థితి కొనసాగింపు.. మే 15కు విచారణ వాయిదా వేసిన ధర్మాసనం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ‘‘కంచగచ్చిబౌలిలోని వందెకరాలను పునరుద్ధరిస్తారా? లేక జైలుకెళతారా?’’ అని ప్రశ్నించింది. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని హెచ్చరించింది. కంచ గచ్చిబౌలిలో చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారా? లేదా? అనే ప్రశ్నకు సూటిగా జవాబివ్వాలని నిలదీసింది. ‘‘మీరు పెద్దఎత్తున చెట్లను కొట్టివేస్తే.. ఆవాసం కోసం జంతువులు పరుగులు తీశాయి. వాటిని వీధికుక్కలు తరిమాయి. దీనికి సంబంధించిన వీడియోలు చూసి మాకెంతో ఆందోళన కలిగింది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. అభివృద్ధికి, పర్యావరణానికి మధ్య సమతౌల్యం అవసరం. ఇష్టమొచ్చినట్టు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తామంటే ఊరుకునేది లేదు. ఆ వందెకరాలనూ ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి. లేదంటే జైలుకెళ్లేందుకు సీఎస్ సహా అధికారులు సిద్ధంగా ఉండాలి. అక్కడే కొలను దగ్గర ఆరు నెలల్లో తాత్కాలికంగా జైలు నిర్మించి అందరినీ అందులో ఉంచుతాం.’’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడింది. హైదరాబాద్ కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిలో రాష్ట్ర ప్రభుత్వం చెట్లు కొట్టేసే అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీంతో ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ అంశంపై సుప్రీం ఆదేశాల మేరకు.. 263 పేజీలతో కూడిన సుదీర్ఘ అఫిడవిట్‌ను తెలంగాణ ప్రభుత్వం సమర్పించింది. సుమోటో కేసుతోపాటే బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ సైతం దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మాసి్‌హలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అమికస్ క్యూరీలు పరమేశ్వర్, గోపాల్ శంకర్ నారాయణ్, తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, మేనక గురుస్వామి, బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు, పి.మోహిత్ రావు, భారత ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా, ఇంప్లీడ్ పిటిషన్ ద్వారా సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి హాజరయ్యారు.
నిబంధన ప్రకారమే..
కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానికి చెందినవేనని, అక్కడ అటవీ భూమి లేదని తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. అన్ని అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు, ఇతర పొదల్ని తొలగించామని తెలిపారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించామని గుర్తుచేశారు. ఇంతలో అమికస్ క్యూరీ పరమేశ్వర్ జోక్యం చేసుకుని.. తెలంగాణలో వాల్టా చట్టం ఉందని, దాన్ని సైతం విస్మరించారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి జస్టిస్ గవాయి.. అనుమతులు తీసుకోకపోతే సీఎస్ సహా సంబంధిత అధికారులు అందరినీ జైళ్లకు పంపించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయితే, ఆ భూమి కోసం 2004 నుంచి ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తోందని అభిషేక్ మను సింఘ్వి తన వాదనలను కొనసాగించారు. 2024లో అది తెలంగాణ ప్రభుత్వానికే చెందుతుందని న్యాయస్థానం స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఇన్నేళ్లుగా ఆ భూమిపై ఎవరు మాట్లాడలేదని, కానీ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ)కి భూమిని కేటాయించిన తర్వాతే ఆ భూమి అటవీ శాఖదనే వాదన పుట్టుకొచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం ఎంతో సదుద్దేశంతో అక్కడ పనులు ప్రారంభించిందని, కానీ కొందరు కావాలనే అసత్య ప్రచారాలతో అందరినీ తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. దీనికి జస్టిస్ గవాయి.. చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారో లేదో చెప్పాలని, అంతేతప్ప వందెకరాల్లో చెట్లను తొలగించడాన్ని సమర్థించుకోవద్దని హెచ్చరించారు.
ఒక్క చెట్టూ..
పర్యావరణ పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని విచారణ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘చెట్ల నరికివేత తీవ్రమైన అంశం. పర్యావరణ పరిరక్షణకు వ్యతిరేకంగా చెట్లను నరికివేశారు. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పండి. వారాంతపు సెలవుల్లో మూడు రోజుల్లో అంత హడావుడిగా చెట్లు కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? డజన్ల కొద్దీ బుల్‌డోజర్లతో అడవిని వంద ఎకరాల్లో అత్యవసరంగా తొలగించాల్సిన అత్యవసమేంటో చెప్పండి? సరిహద్దుకు సులభమైన అనుసంధానం కల్పించే, దళాల కదలికను తెలిపే చార్‌ధామ్ రోడ్ల వంటి ముఖ్యమైన ప్రాజెక్టుల కోసం కూడా కేంద్ర ప్రభుత్వం ఈ కోర్టులో సంవత్సరాల తరబడి పోరాడాల్సి వచ్చింది. మహారాష్ట్రలో సచివాలయ నిర్మాణం కేసు రెండు దశాబ్దాలుగా సుప్రీంకోర్టులో ఉంది’’ అని పేర్కొంది. ముంబై, చెన్నై, హైదరాబాద్ వంటి మహా నగరాల్లోని అటవీ భూములను కాపాడుకోపోతే ఎలా? అని ధర్మాసనం ప్రశ్నించింది. తమకు ప్రభుత్వాల గురించి ఆందోళన లేదని.. కేవలం మూడు రోజుల్లో 100 ఎకరాలను నాశనం చేయడానికి డజన్ల కొద్దీ బుల్‌డోజర్లను మోహరించడం గురించి మాత్రమే తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నామని పేర్కొంది. ‘‘అవసరమనుకుంటే.. వందెకరాలే కాదు, అక్కడ 2,400 ఎకరాల్లో ఒక్క చెట్టు కూడా కొట్టొద్దని ఆదేశాలివ్వాల్సి వస్తుంది...’’ అని ధర్మాసనం హెచ్చరించింది.
సంబంధం లేదు...
కంచ గచ్చిబౌలిలో చెట్ల నరికివేత గత సుప్రీం తీర్పునకు విరుద్ధమని.. కానీ, తెలంగాణ సర్కారు స్వీయ ధ్రువీకరణ చేసుకుని చెట్లను తొలగించినట్టు కనిపిస్తోందని అమికస్ క్యూరీ పరమేశ్వర్ అభిప్రాయపడ్డారు. ఆ భూములను తాకట్టు పెట్టి ప్రభుత్వం రూ.10 వేల కోట్లు అప్పుగా తీసుకున్నట్టు కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) నివేదిక చెబుతోందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఆ అంశం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్‌లో ఎక్కడా కనిపించలేదన్నారు. మంత్రుల ఆదేశాల ప్రకారం సీఎస్ అనుమతితోనే అక్కడ చెట్ల నరికివేత జరిగిందని స్పష్టం చేశారు. అయితే.. అధికారులు, మంత్రుల వివరణలు, ఆదేశాలను తాము పరిగణనలోకి తీసుకోబోమని, అక్కడ 1996 సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నడుకుచున్నారా? లేదా? అనేదే తమకు ముఖ్యమని ధర్మాసనం తెలిపింది. ఆ భూములను మార్టిగేజ్ చేశారా? అమ్ముకున్నారా? అనేది తమకు అనవసరమని స్పష్టం చేసింది. చెట్లు కొట్టివేసే ముందు అనుమతి తీసుకున్నారా? లేదా? అనేది మాత్రమే తమకు ముఖ్యమని స్పష్టం చేసింది. కాగా.. ఆ సమయంలో సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డి ధర్మాసనం దృష్టిని కొన్ని ఫొటోలను తీసుకెళ్లారు. వందెకరాల్లో విధ్వంసం జరిగిందని, అక్కడ వన్యప్రాణులు, పక్షులు ఎలా ఇబ్బంది పడ్డాయనే వాటిని వివరించారు. జంతువులను సురక్షించడం, నీటి సరఫరాను పునరుద్ధరించడం వంటి వాటి గురించి ఆయన ప్రస్తావించారు. దీంతో వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని జస్టిస్ బీఆర్ గవాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. దీనికి సంబంధించి ఏ చర్యలు తీసుకున్నారో తదుపరి విచారణ తేదీన తమకు వివరించాలని స్పష్టం చేశారు.
అభివృద్ధి పేరుతో..
ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అభిషేక్ మను సింఘ్వి.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వేల ఎకరాల భూమి ఉందని, అందులో 400 ఎకరాల భూవివాదం 2004 నుంచి కొనసాగుతోందని మరోసారి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఇరవై ఏళ్లలో ఆ పరిసర ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి గురించి వివరించేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వ నిర్ణయంతో అక్కడ ఎంతోమందికి జీవనోపాధి, ఉద్యోగాలు లభిస్తాయని స్పష్టం చేశారు. ఆ భూములపై ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అయితే.. అభివృద్ధి, ఉద్యోగాల కల్పన పేరుతో పర్యావరణాన్ని విధ్వంసం చేస్తామంటే, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామంటే చూస్తూ ఊరుకోబోమని జస్టిస్ గవాయి మరోసారి హెచ్చరించారు. మూడు రోజుల్లోనే వందెకరాలను విధ్వంసం చేశారన్న ఆయన.. అందుకు ఎన్ని బుల్‌డోజర్లు వాడారు, ఇప్పటికైనా బుల్‌డోజర్లను అక్కడి నుంచి తొలగించారా? లేదా? అనే విషయాన్ని సీఎస్ చెప్పాలన్నారు. దీనికి సింఘ్వీ.. సుప్రీంకోర్టు ఆదేశించిన వెంటనే అక్కడ పనులన్నీ ఆపేసినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహిళ అని.. ఆమె కేవలం సమన్వయ అధికారి మాత్రమేనని, నెలరోజుల్లో పదవీ విరమణ చేయబోతున్నారని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి జస్టిస్ గవాయి.. ‘‘సీఎ్‌సను కాపాడాలనుకుంటే వంద ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి. పునరుద్ధరణ ప్రణాళికతో ముందుకు రండి. ఎలా చేస్తారో, అందుకు ఎంతకాలం పడుతుందో, జంతు జాలాన్ని ఎలా సంరక్షిస్తారో చెప్పండి. పర్యావరణ, వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెబుతూ అఫిడవిట్ దాఖలు చేయండి’’ అని ఆదేశించారు. అయితే, సీఈసీ నివేదికపై సమగ్ర వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని.. అందుకు తమకు కొంత సమయం కావాలని సింఘ్వి ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. నాలుగు వారాల సమయం ఇచ్చి, తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది. అప్పటి వరకూ కంచ గచ్చిబౌలి భూములపై యథాతధ స్థితి కొనసాగుతుందని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి:
IAS Smita Sabharwal: ఐఏఎస్ స్మితా సబర్వాల్‍కు నోటీసులు.. విషయం ఏంటంటే..
Poisoning In School: విద్యార్థులపై విష ప్రయోగం.. సంచలనం రేపుతున్న ఘటన..
Chandanotsavam 2025: సింహాచలానికి సీఎం చంద్రబాబు వచ్చేది ఆ రోజే: మంత్రి ఆనం..