Supreme Court Orders: 3 నెలల్లోగా తేల్చండి
ABN , Publish Date - Aug 01 , 2025 | 04:14 AM
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సాధ్యమైనంత త్వరగా లేదా మూడు

10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై నిర్ణయం తీసుకోండి
ఫిరాయింపులతో ప్రజాస్వామ్యానికి నష్టం
స్పీకర్ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుంటోందా?
ఈ విషయాన్ని పార్లమెంటు సమీక్షించాలి
న్యాయసమీక్షకు లోబడే స్పీకర్ నిర్ణయాధికారం
అనర్హత పిటిషన్లు సమర్పించి ఏడు నెలలైనా.. స్పీకర్ నోటీసులివ్వకపోవటం ఏమిటి?
హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పులో జోక్యం డివిజన్ బెంచ్ తప్పిదం: సుప్రీంకోర్టు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో వెలువడిన తీర్పు
హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు కొట్టివేత
సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకోవాలన్న బీఆర్‌ఎస్ అభ్యర్థనను తోసిపుచ్చిన బెంచ్
ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌దేనని వెల్లడి
న్యూఢిల్లీ, జూలై 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సాధ్యమైనంత త్వరగా లేదా మూడు నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనర్హత పిటిషన్‌లో పేర్కొన్న ఎమ్మెల్యేలు ఎవరూ విచారణను ఆలస్యం చేయడానికి అనుమతించకూడదని, ఎవరైనా ఆ దిశగా ప్రయత్నిస్తే తీవ్రంగా పరిగణించాలని స్పీకర్‌కు సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీ్‌హలతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పును వెలువరించింది. రాజకీయ ఫిరాయింపులు అనేవి జాతీయస్థాయిలో చర్చనీయాంశం అవుతున్నాయని, వాటిని నిలువరించకపోతే ప్రజాస్వామ్యానికే అవి నష్టం తేగలవని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని తాము స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయలేకపోతే, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ఉద్దేశాలే దెబ్బతింటాయని అభిప్రాయపడింది. ‘ఆపరేషన్ సక్సెస్.. పేషంట్ డెడ్’ అనే పరిస్థితికి స్పీకర్ అనుమతించేందుకు తాము వీలు కల్పించినట్టు అవుతుందని పేర్కొంది.
స్పీకర్‌ను తప్పుబట్టిన ధర్మాసనం
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకోవాలని బీఆర్‌ఎస్ నేతలు చేసిన అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఆ అధికారం స్పీకర్‌కే ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు సుభాష్ దేశాయ్ తదితరుల కేసులకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్ ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది. అయితే, అనర్హత అంశాన్ని తేల్చే ముఖ్యమైన బాధ్యతను స్పీకర్‌కు లేదా చైర్మన్‌కు అప్పగించటం వల్ల.. రాజకీయ ఫిరాయింపులను సమర్థవంతంగా అరికట్టగలుగుతున్నామా? లేదా? అన్న అంశాన్ని పరిశీలించాల్సింది పార్లమెంటేనని తెలిపింది. ప్రజాస్వామ్య పునాదులు బలంగా ఉండాలంటే, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలంటే. ప్రస్తుత ఫిరాయింపుల నిరోధక వ్యవస్థ సరిపోతుందా? లేదా? అనే విషయాన్ని తేల్చాల్సింది కూడా పార్లమెంటేనని ధర్మాసనం స్పష్టం చేసింది. అనర్హత పిటిషన్లు సమర్పించి దాదాపు ఏడు నెలలు గడిచినా నోటీసులు జారీ చేయకపోవడం, కోర్టులో కేసు దాఖలు చేసిన తర్వాతే నోటీసులు జారీ చేయడంపై స్పీకర్‌ను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అనర్హత పిటిషన్లపై తేల్చే అత్యంత ముఖ్యమైన బాధ్యత స్పీకర్‌ది అయినప్పుడు.. ఆ హోదాలో ఉన్నవారు ఎంతవేగంగా చర్యలు తీసుకున్నారనేది ప్రధానమని పేర్కొంది. ఈ ఏడాది జనవరి 15న సుప్రీంకోర్టు ముందు కేసు దాఖలైన తర్వాతే జనవరి 16న స్పీకర్ కొందరు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారని, అదేవిధంగా ఫిబ్రవరి 3న కేసు మరోసారి విచారణకు వచ్చినప్పుడు ఫిబ్రవరి 4న మరికొందరు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. జనవరి 31న ఈ కేసుపై విచారణ ప్రారంభమైనప్పుడు.. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్‌కు ఎంత సమయం అవసరమో తెలుసుకోవాల్సిందిగా తాము సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీకి సూచించామని ధర్మాసనం గుర్తు చేసింది. పలుమార్లు కేశం మేఘచంద్ర సింగ్ కేసును ప్రస్తావించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. మూడు నెలల్లోపు అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని మణిపూర్ అసెంబ్లీ స్పీకర్‌కు ఆదేశాలిస్తూ అప్పటి న్యాయమూర్తి రోహింటన్ ఫాలీ నారిమన్ తీర్పు ఇచ్చారని పేర్కొంది.
నాన్చుడు వైఖరి సరి కాదు
అనర్హత పిటిషన్లపై నిర్ణయించే బాధ్యతను స్పీకర్‌కు అప్పగించారంటే.. ఆ పిటిషన్లపై నాన్చుడు వైఖరి అవలంభించడమో, విషయాన్ని కోర్టులకో, ఎన్నికల సంఘానికో అప్పగించడం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మూడు దశాబ్దాల క్రితం పదో షెడ్యూల్‌ను ప్రవేశపెట్టినప్పుడు.. అనర్హత పిటిషన్లపై సభాధ్యక్షుడు ఆలస్యం చేయడాన్ని ఏమాత్రం సహించకూడదని అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి ఏకే సేన్ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేసింది. 30 ఏళ్ల తర్వాత వెనుదిరిగి చూస్తే.. అనర్హత పిటిషన్లపై జాప్యాన్ని నివారించే విషయంలో స్పీకర్‌పై ఉంచిన విశ్వాసం నెరవేరిందా? లేదా? అని ప్రశ్నించుకోవాల్సిన అగత్యం ఏర్పడిందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి
ఒక రాజకీయ పార్టీ ప్రజల ముందుకు నిర్దిష్ట కార్యాచరణతో వెళుతుందని, దాని ప్రాతిపదికపైనే ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెడుతుందని, అటువంటప్పుడు ఎన్నికల్లో గెల్చిన అభ్యర్థి ఆ పార్టీని వదిలి పడితే తన సభ్యత్వాన్ని వదులుకుని మళ్లీ ఓటర్ల ముందుకు వెళ్లాలని రాజ్యాంగ బెంచ్ గతంలో ఇచ్చిన తీర్పును కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. 10వ షెడ్యూల్ ప్రకారం స్పీకర్.. న్యాయసమీక్ష పరిధికి అతీతులు కాదని రాజ్యాంగ బెంచ్ స్పష్టం చేసిందని తెలిపింది. ఈ షెడ్యూల్‌లోని పేరా 6(1) ప్రకారం స్పీకర్.. ట్రిబ్యునల్ బాధ్యతలు నెరవేరుస్తారని తెలిపింది. స్పీకర్ అధికారాలు న్యాయపరమైనవని.. అదే సమయంలో ఆయన నిర్ణయాలు న్యాయసమీక్షకు అతీతం కాదని ధర్మాసనం పేర్కొంది.
డివిజన్ బెంచ్ జోక్యం ఎందుకు?
ఈ కేసుపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. అనర్హత పిటిషన్లపై విచారించేందుకు సమయాన్ని నిర్ణయించమని స్పీకర్‌ను కోరారని, పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. అయినప్పటికీ.. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడం ద్వారా డివిజన్ బెంచ్ తప్పిదానికి పాల్పడిందని స్పష్టం చేసింది. ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు లేకపోయినా తెలంగాణ శాసనసభ సెక్రటరీ.. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేయడం సరైంది కాదని తెలిపింది. ఈ మేరకు, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 2024 నవంబరు 22న హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది.
ఇదీ నేపథ్యం...
ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రె్‌సలోకి ఫిరాయించారని.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో జనవరి 15న స్పెషల్ లీవ్ పిటిషన్(సివిల్) దాఖలు చేశారు. ఎమ్మెల్యేలు పరిగి శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టీ ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్ కూడా ఇదే విధంగా పార్టీ ఫిరాయించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింత ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్ తదితరులు కూడా జనవరి 15వ తేదీనే సుప్రీంలో రిట్ పిటిషన్(సివిల్) వేశారు. వీటిపై వాదనలు జరుగుతుండగానే మార్చి 18న బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పెషల్ లీవ్ పిటిషన్(సివిల్) దాఖలు చేశారు. దానం నాగేందర్‌ని ప్రతివాదిగా చేర్చారు. ఈ పిటిషన్లన్నింటినీ కలిపి జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారించి తాజాగా తీర్పు వెలువరించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు సీ ఆర్యమ సుందరం, దామా శేషాద్రి నాయుడు, గండ్ర మోహన్‌రావు, ఏవోఆర్ మోహిత్‌రావు, ప్రతివాదుల తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, అభిషేక్ మను సింఘ్వి, రవిశంకర్ జంధ్యాల, గౌరవ్ అగర్వాల్ వాదనలు వినిపించారు.