Share News

ఫీజు కట్టాలంటూ ప్రిన్సిపల్‌ నలుగురిలో అడిగారని.. ఇంట్లో ఉరివేసుకొని బాలిక ఆత్మహత్య

ABN , Publish Date - Feb 13 , 2025 | 04:31 AM

ఫీజు ఎప్పుడు కడతారు? అంటూ తనను ప్రిన్సిపల్‌, స్కూల్లో అందరి ముందు నిల్చోబెట్టి అడగడాన్ని ఆ బాలిక తీవ్ర అవమానకరంగా భావించింది. బడికి వెళ్లలేక కొన్నిరోజులుగా ఇంట్లోనే ఉంటున్న ఆ విద్యార్థిని ఆ మనోవేదనతోనే తన గదిలో ఆత్మహత్య చేసుకుంది.

ఫీజు కట్టాలంటూ ప్రిన్సిపల్‌ నలుగురిలో అడిగారని.. ఇంట్లో ఉరివేసుకొని బాలిక ఆత్మహత్య

  • మేడ్చల్‌ జిల్లాలో ఘటన

మేడ్చల్‌ టౌన్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ఫీజు ఎప్పుడు కడతారు? అంటూ తనను ప్రిన్సిపల్‌, స్కూల్లో అందరి ముందు నిల్చోబెట్టి అడగడాన్ని ఆ బాలిక తీవ్ర అవమానకరంగా భావించింది. బడికి వెళ్లలేక కొన్నిరోజులుగా ఇంట్లోనే ఉంటున్న ఆ విద్యార్థిని ఆ మనోవేదనతోనే తన గదిలో ఆత్మహత్య చేసుకుంది. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా మేడ్చల్‌ పట్టణంలో ఈ ఘటన జరిగింది. పదహారేళ్లకే నూరేళ్లు నిండిన బిడ్డ మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదిస్తున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవ్వరివల్లా కావడం లేదు. తమ బిడ్డను పాఠశాల ప్రిన్సిపలే పొట్టనబెట్టుకున్నారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతురాలి తల్లిదండ్రులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన వెంకటేశ్వర రావు, కమల దంపతులకు విక్రమ్‌, అఖిల (16) సంతానం. వెంకటేశ్వర రావు కుటుంబం మేడ్చల్‌లో స్థిరపడింది. విక్రమ్‌, అఖిల దగ్గర్లోని ఓ కార్పొరేట్‌ స్కూల్లో పదో తరగతి చదువుతున్నారు. ఈ పిల్లల స్కూలు ఫీజు కలిపి మొత్తం రూ.90వేలు కాగా, రూ.10వేలు మాత్రమే తల్లిదండ్రులు కట్టారు. పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తుండటంతో పూర్తిస్థాయిలో ఫీజుల వసూలు కోసం ఇటీవల యాజమాన్యం పేరెంట్స్‌ మీటింగ్‌ను పెట్టింది. దీనికి వెంకటేశ్వర్‌ రావు, కమల హాజరవ్వలేదు.


అయితే మీటింగ్‌కు వచ్చిన ఇతర విద్యార్థుల తల్లిదండ్రుల ముందు ఫీజు బకాయిల విషయమై విక్రమ్‌, అఖిలను మహిళా ప్రిన్సిపల్‌ ప్రశ్నించారు. ఆమె తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన విక్రమ్‌, అఖిల.. అప్పటి నుంచి వారం రోజులుగా బడికి వెళ్లడం లేదు. మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్లాలని తల్లిదండ్రులు చెప్పడంతో అఖిల తన గదిలోకి వెళ్లి తలుపులు బిగించుకొని.. లోపల సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. ఎంతసేపటికీ బిడ్డ గదిలోంచి బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు తలుపులు బద్దలు కొట్టి చూడగా అఖిల ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను తొలుత ఓ ప్రైవేటు ఆస్పత్రికి.. అక్కడి నుంచి కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న అఖిల బుధవారం సాయంత్రం మృతి చెందింది. అఖిల ఆత్మహత్యకు పాఠశాల ప్రిన్సిపలే కారణం అని తల్లి కమల ఆరోపించింది. అదేరోజు పాఠశాలకు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీసింది. ఫీజులు చెల్లించకుంటే తల్లిదండ్రులను పిలిపించి ఆడగాలే తప్ప.. అందరి ముందు బాలికను నిల్చోబెట్టి అవమానిస్తారా? అని ఆవేదనతో ప్రశ్నించింది. కాగా, ప్రిన్సిపల్‌ రమాదేవిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ములుగు మన్నెంలో జాతరల సందడి

శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలు రద్దు

మేడారం మినీజాతర.. మొక్కులు చెల్లించకోనున్న భక్తులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 13 , 2025 | 04:31 AM