Assembly Sessions: ఆగస్టులో అసెంబ్లీ సమావేశాలు!
ABN , Publish Date - Jul 15 , 2025 | 05:14 AM
అసెంబ్లీ సమావేశాలను ఆగస్టులో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ సారి శాసనసభ, మండలి సమావేశాలు రెండూ ఒకే చోట, ఒకే ప్రాంగంణంలో జరగనున్నాయి.

ఇకపై అసెంబ్లీ ప్రాంగణంలోనే మండలి కూడా.. పాత భవనానికి ముమ్మరంగా మరమ్మతులు
పునర్నిర్మాణ పనులపై మండలి చైర్మన్ సమీక్ష.. ఆగస్టు 15లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశం
హైదరాబాద్, జూలై 14 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ సమావేశాలను ఆగస్టులో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ సారి శాసనసభ, మండలి సమావేశాలు రెండూ ఒకే చోట, ఒకే ప్రాంగంణంలో జరగనున్నాయి. శాసనసభ ప్రాంగణంలోనే ఉన్న పాత భవనాన్ని మండలి సమావేశాలకు వినియోగించేలా మరమ్మతులు చేస్తున్నారు. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖతోపాటు పనులు చేస్తున్న అగాఖాన్ సంస్థ ప్రతినిధులతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. చేపట్టిన పనుల గురించి అడిగి తెలుసుకున్న గుత్తా.. ఆగస్టులో నిర్వహించే సమావేశాలను ఒకే చోట నిర్వహించాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. ఆగస్టు 15లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇదీ అసెంబ్లీ భవనం చర్రిత..
ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ భవనాన్ని 1905లో ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ 40వ పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభించి.. 1913నాటికి పూర్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యాక ఈ భవనాన్ని శాసనసభ సమావేశాలకు వినియోగించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక అసెంబ్లీ సమావేశాలను ఇందులోనే కొనసాగించగా.. మండలి సమావేశాలను దీనికి కొంత దూరంలో ఉన్న జూబ్లీహాల్‌లో నిర్వహిస్తున్నారు. దీంతో సమావేశాల సమయంలో సీఎం, మంత్రులు ప్రత్యేకంగా అక్కడికి కార్లలో వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ హాలులోనే అందుబాటులో ఉన్న పాత భవనానికి మరమ్మతులు చేసి, మండలి సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరమ్మతులకు ఇప్పటికే రూ.40కోట్లను మంజూరు చేసింది. వారసత్వ భవనం కావడంతో ఎక్కడా చెక్కు చెదరకుండా దీనిని పునరుద్ధరిస్తున్నారు. ఇసుక, సిమెంటు స్థానంలో డంగు సున్నం, కరక్కాయ, రాతిపొడితోపాటు నల్లబెలాన్ని వినియోగిస్తున్నారు. 2024 జూన్ 4న అగాఖాన్ సంస్థ పనులు దక్కించుకోగా... 8 నెలల్లో (2025 ఫిబ్రవరి 3లోగా) పూర్తిచేసి అప్పగించాల్సి ఉన్నా సాధ్యపడలేదు. తాజాగా ఆగస్టు 15నాటికి పూర్తిచేయాలని గడువు విధించారు.
ఇవి కూడా చదవండి
నీరు తేవడమంటే.. గ్లాస్‌లో సోడా పోసినట్లు కాదు '
తిరుపతి రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం.. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చెలరేగిన మంటలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి