Share News

Heart Failure: పెరుగుతున్న గుండె వైఫల్య మరణాలు

ABN , Publish Date - Jul 15 , 2025 | 04:23 AM

ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 5 లక్షల మంది.. గుండె వైఫల్యం (హార్ట్‌ ఫెయిల్యూర్‌) కారణంగా చనిపోతున్నారని.. మన దేశంలోనూ ఈ మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని స్టార్‌ ఆస్పత్రి ఎండీ, సీనియర్‌ కార్డియాలజిస్టు డాక్టర్‌ మన్నం గోపీచంద్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Heart Failure: పెరుగుతున్న గుండె వైఫల్య మరణాలు

  • ఏటా ఆ సమస్యతో ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మంది మృతి

  • మనదేశంలో 50-60 ఏళ్లవారిలోనే గుండెసంబంధిత జబ్బులు

  • స్టార్‌ ఆస్పత్రి ఎండీ డా. గోపీచంద్‌ మన్నం

  • నానక్‌రామ్‌ గూడలో ‘స్టార్‌ హార్ట్‌ ఫెయిల్యూర్‌ క్లినిక్‌’ ప్రారంభం

హైదరాబాద్‌ సిటీ/రాయిదుర్గం, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 5 లక్షల మంది.. గుండె వైఫల్యం (హార్ట్‌ ఫెయిల్యూర్‌) కారణంగా చనిపోతున్నారని.. మన దేశంలోనూ ఈ మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని స్టార్‌ ఆస్పత్రి ఎండీ, సీనియర్‌ కార్డియాలజిస్టు డాక్టర్‌ మన్నం గోపీచంద్‌ ఆందోళన వ్యక్తం చేశారు. నానాక్‌రాంగూడలోని స్టార్‌ ఆస్పత్రిలో సోమవారం ‘స్టార్‌ హార్ట్‌ ఫెయిల్యూర్‌ క్లినిక్‌’ను ప్రారంభించిన ఆయ ్భంగా మాట్లాడిన ఆయన.. పాశ్చాత్య దేశాల్లో గుండె సంబందిత వ్యాధులు 70 ఏళ్ల వయస్సులో కనిపిస్తే మన దేశంలో 50 నుంచి 60 ఏళ్ల మధ్య కనిపిస్తున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. గుండె వైఫల్యం చెందిన వారికి చికిత్సలు, మందులు అందుబాటులో ఉన్నాయని.. బాధితులకు ఎలాంటి చికిత్స అవసరమో గుర్తించి చేయడం ద్వారా నాణ్యమైన, మెరుగైన జీవితాన్ని అందించడానికి అవకాశముందని తెలిపారు.


మున్ముందు.. ప్రజలకు హృద్రోగాలపై అవగాహన కల్పించి, శాస్త్రీయ చికిత్సను అందించడానికి ‘స్టార్‌ హార్ట్‌ ఫెయిల్యూర్‌ క్లినిక్‌’ను ఉపయోగిస్తామని వెల్లడించారు. కొవిడ్‌ టీకాల వల్ల గుండె జబ్బులు పెరిగాయని చెప్పడానికి ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు. అయితే, కొవిడ్‌ నేపథ్యంలో ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన పెరిగి పరీక్షలు చేయించుకున్నారని.. ఎక్కువ మంది పరీక్షలు చేయించుకోవడంతో గుండె సమస్యలున్న వారి సంఖ్య పెరిగిందని వివరించారు. ఇక.. భారతదేశంలో పని చేసే వయసు గల వారిలో గుండె వైఫల్యం కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయని అడ్వాన్స్‌ హార్ట్‌ ఫెయిల్యూర్‌ ట్రాన్‌ప్లాంట్‌ కార్డియలజిస్టు డాక్టర్‌.సురేష్‌ ఎర్ర పేర్కొన్నారు. .తెలంగాణలో 2022లో హృద్రోగ మరణాలు 282 నమోదయ్యాయని.. చనిపోయినవారిలో 30-50 సంవత్సరాల వయసు గల పురుషులూ ఉన్నారని ఆయన తెలిపారు.

Updated Date - Jul 15 , 2025 | 04:23 AM