Share News

Baby Trafficking: ఇతర రాష్ట్రాల్లోనూ.. ‘సృష్టి’ దందా!

ABN , Publish Date - Jul 29 , 2025 | 04:47 AM

సరగసీ పేరిట శిశువిక్రయానికి పాల్పడిన సృష్టి ఫర్టిలిటీ సెంటర్‌ కేసు దర్యాప్తును గోపాలపురం పోలీసులు ముమ్మరం చేశారు. ఈ సెంటర్‌ను నిర్వహిస్తున్న డాక్టర్‌ నమ్రత..

Baby Trafficking: ఇతర రాష్ట్రాల్లోనూ.. ‘సృష్టి’ దందా!

  • నగరంతో పాటు పలు రాష్ట్రాల్లో నమ్రతకు ఏజెంట్లు.. అబార్షన్‌ కోసం వెళ్లేవారికి డబ్బు ఆశ చూపించి వల

హైదరాబాద్‌ సిటీ, అడ్డగుట్ట, జూలై 28 (ఆంధ్రజ్యోతి): సరగసీ పేరిట శిశువిక్రయానికి పాల్పడిన సృష్టి ఫర్టిలిటీ సెంటర్‌ కేసు దర్యాప్తును గోపాలపురం పోలీసులు ముమ్మరం చేశారు. ఈ సెంటర్‌ను నిర్వహిస్తున్న డాక్టర్‌ నమ్రత.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో, కోల్‌కతా తదితర ప్రాంతాల్లో మరిన్ని సంతాన సాఫల్య కేంద్రాలను నడుపుతున్నట్టు వారు దర్యాప్తులో గుర్తించారు. అన్ని ప్రాంతాల్లోనూ ఆమె తన ఏజెంట్లను నియమించుకున్నట్లు తెలిసింది. ఇక్కడ చేసినట్టుగానే.. ఆయా రాష్ట్రాల్లో కూడా ఆమె తన అక్రమ దందాను కొనసాగిస్తున్నట్టు వెల్లడైంది. తాజా కేసు విషయానికి వస్తే.. ఆమె పథకం ప్రకారమే అసోంకు చెందిన దంపతుల నుంచి బిడ్డను కొనుగోలు చేసి రాజస్థాన్‌కు చెందిన దంపతులకు విక్రయించినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అసోం నుంచి బతుకుదెరువు కోసం వచ్చి కూలిపనులు చేసుకుంటున్న దంపతులు.. పుట్టబోయే బిడ్డ తమకు వద్దనుకుని అబార్షన్‌కు సిద్ధమయ్యారు. తమకు తెలిసిన అసోం వ్యక్తిని సంప్రదించి విషయం చెప్పారు. అప్పుడా వ్యక్తి.. ‘‘ఎలాగూ పిల్లలు వద్దనుకున్నారు. అబార్షన్‌ చేయించుకుంటే ఖర్చవుతుంది.


నేను చెప్పినట్లు చేస్తే మీకు డబ్బు రావడంతోపాటు.. గర్భస్రావం చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. మీ బిడ్డను వేరొకరికి ఇచ్చేస్తే సరిపోతుంది’’ అని చెప్పి ఒప్పించాడు. వారిని నమ్రత వద్దకు తీసుకెళ్లాడు. వారితో మాట్లాడిన నమ్రత ఆ దంపతులకు రూ. 90 వేలు ఇస్తానని ఆశపెట్టింది. దీంతో వారు అంగీకరించారు. అలా వారికి పుట్టిన మగబిడ్డను రాజస్థాన్‌ దంపతులకు అంటగట్టిన నమ్రత.. ఆ బిడ్డ సరగసీ ద్వారా పుట్టినట్టు వారికి చెప్పి, వారి నుంచి 35 లక్షలు దోచేసింది. ఈ కేసులో అరెస్టయిన వారిలో ధనశ్రీ సంతోషి, మహ్మద్‌ ఆలీ, నస్రీంబేగం.. అసోంవాసులే. ఇలా.. ఇష్టం లేకనో, స్థోమత లేదనో అబార్షన్‌కు వెళ్లే దంపతులను గుర్తించి, వారికి తన ఏజెంట్ల ద్వారా వల వేసి, డబ్బు ఆశ చూపి వారిని ఒప్పించి.. వారికి పుట్టే చిన్నారులను నమ్రత తన అక్రమ దందాకు ఉపయోగిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. నాలుగైదేళ్ల క్రితం హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పరిధిలో ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయని.. ఇదే కోవలో ఇద్దరు చిన్నారులను విక్రయించారని.. పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో.. ‘సృష్టి’ నిర్వాహకులకు ఇతర రాష్ట్రాల్లోని శిశువుల అక్రమ రవాణా మాఫియాతో లింకులు ఉండొచ్చని అనుమానిస్తున్నారు.


తాళం వేశారేంటీ?

కొంతకాలంగా పిల్లల కోసం సృష్టి ఫర్టిలిటీ సెంటర్‌కు వస్తున్న దంపతులు.. తాజా పరిణామాల నేపథ్యంలో గోపాలపురం పోలీసులను ఆశ్రయిస్తున్నట్లు తెలిసింది. ‘‘సార్‌.. సృష్టి ఫర్టిలిటీ సెంటర్‌కు తాళం వేసి ఉంది. చుట్టుపక్కల వారిని అడిగితే డాక్టర్‌ నమ్రతను పోలీసులు అరెస్టు చేశారని చెప్తున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతోంది సార్‌’’ అంటూ పలువురు దంపతులు పోలీసులను ఆశ్రయించి వివరాలు తెలుసుకుంటున్నట్లు సమాచారం. అరెస్టయిన ప్రధాన నిందితురాలు డాక్టర్‌ నమ్రత, ఆమె కుమారుడు సహా.. మొత్తం ఎనిమిది మంది నిందితులనూ మరోసారి విచారించి పూర్తి ఆధారాలను, వారి అక్రమాల చిట్టాను బయటపెట్టడానికి పోలీసులు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ మేరకు న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్‌ దాఖలు చేసినట్లు గోపాలపురం పోలీసులు తెలిపారు.


‘సృష్టి’ శిశు విక్రయ కేసును సుమోటోగా స్వీకరించిన హెచ్చార్సీ

  • గురుకుల పాఠశాలలో ఫుడ్‌ పాయిజనింగ్‌ కేసునూ

  • ఆగస్టు 28 నాటికి నివేదికలు ఇవ్వాలని ఆదేశం

హైదరాబాద్‌, గన్‌పార్క్‌, జూలై 28(ఆంధ్రజ్యోతి): సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ శిశు విక్రయం కేసు.. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉయ్యాలవాడ సమీపంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్‌పాయిజనింగ్‌ కేసులను తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (టీజీహెచ్‌ఆర్‌సీ) సుమోటోగా విచారణకు స్వీకరించింది. టీజీహెచ్‌ఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ రెండు కేసులకూ సంబంధించి ఆగస్టు 28 నాటికి సమగ్ర నివేదికలు సమర్పించాలని.. తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ ప్రధాన కార్యదర్శిని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కమిషన్‌ ఆదేశించింది.


సృష్టి ఫర్టిలిటీ సెంటర్‌ తీరు అనైతికం

  • అక్కడి వైద్యుల ఐఎంఏ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నాం

  • ఐఎంఏ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ నారాయణరావు

ఖమ్మం కలెక్టరేట్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): సంతాన సాఫల్యం, సరగసీ ముసుగులో శిశువిక్రయానికి పాల్పడిన యూనివర్సల్‌ సృష్టి ఫర్టిలిటీ సెంటర్‌ వ్యవస్థాపకురాలు డాక్టర్‌ నమ్రత అనైతిక కార్యకలాపాలను ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర శాఖ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ కంభంపాటి నారాయణరావు తీవ్రంగా ఖండించారు. ఆ ఆస్పత్రిలోని వైద్యులకున్న ఐఎంఏ సభ్యత్వాన్ని తక్షణమే రద్దుచేస్తున్నట్టు ప్రకటించారు. వైద్యమండలి నామినేషన్‌ నుంచి తొలగించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర వైద్య మండలికి కూడా అధికారికంగా సూచించనున్నట్టు తెలిపారు. వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి, పోలీసు శాఖకు ఆయన విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి..

కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు, మోదీకి ఫోన్ కాల్ రాలేదు

22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్

For More National News and Telugu News..

Updated Date - Jul 29 , 2025 | 04:47 AM