Share News

Social Media Business: 30 సెకన్ల మాయాబజార్‌

ABN , Publish Date - Apr 21 , 2025 | 03:21 AM

సోషల్‌ మీడియా ద్వారా వ్యాపారం చేసే గృహిణులు, చిన్న వ్యాపారస్తులు ఒక్క వీడియో హిట్‌తో కాసుల మోతలు గడిస్తుంటారు. అయితే, చిన్న తప్పులు కూడా భారీ నష్టాలకు, ట్రోలింగ్‌కు కారణమవుతున్నాయి

Social Media Business: 30 సెకన్ల మాయాబజార్‌

  • రీల్స్‌, షార్ట్స్‌తో సోషల్‌ మీడియా ద్వారా వ్యాపారం.. జోరుగా బిజినెస్‌

  • ఆన్‌లైన్‌ వ్యాపారుల్లో గృహిణులే అధికం.. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత

  • ఒక్క వీడియో హిట్‌ అయినా కాసుల మోతే.. కాస్త తేడా జరిగితే సర్వం పాయే!

అలేఖ్య చిట్టి పికిల్స్‌.. ఈ మధ్య సోషల్‌ మీడియాలో దుమారం రేపిన వ్యాపారం ఇది. పెద్ద ఎత్తున పచ్చళ్ల వ్యాపారం చేసి ఎంతో ప్రాచుర్యం పొందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. తాము చేసిన ఒకేఒక్క తప్పు బయటపడడంతో ఊహించనంతగా నష్టపోయారు. నెలల తరబడి శ్రమించి అభివృద్ధి చేసుకున్న వ్యాపారాన్ని పూర్తిగా కోల్పోవడమేకాక.. విపరీతమైన సోషల్‌ మీడియా ట్రోలింగ్‌కు గురై నానా అవస్థలు పడ్డారు. ఈ అక్కాచెల్లెళ్ల ఉదంతం వారికే కాదు.. అపరిమిత అవకాశాలు ఉన్న సోషల్‌ మీడియాను నమ్ముకుని వ్యాపారాలు చేసే వారందరికీ ఓ గుణపాఠం. చిన్న తప్పు చేసినా సరే.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఒక్కసారి కొనుగోలుదారుల నమ్మకం కోల్పోయినా, తప్పుడు అభిప్రాయం ఏర్పడినా.. అంతే సంగతి. ట్రోలర్లకు, మీమర్లకు మేత అయిపోయినట్టే..!!

కప్పుడు ఊళ్లలో ఏదైనా హోల్‌సేల్‌ వ్యాపారం చేసే దుకాణదారులను గొప్పగా చూసేవారు. చిన్నచిన్న దుకాణాలు నడిపే రిటైర్‌ వ్యాపారులకు వారి పరిధిలో కొంత గుర్తింపు ఉండేది. కానీ ఆన్‌లైన్‌ విప్లవంతో వ్యాపారం చేసే పద్ధతి మారిపోయింది. పొద్దున్నే దుకాణం తలుపులు తీసి కొనుగోలుదారుల కోసం ఎదురుచూసే రోజులు పోయి.. 30 సెకండ్ల నిడివి ఉన్న వీడియోల(రీల్‌ లేదా షార్ట్‌)తో సోషల్‌ మీడియా వేదికగా కొనుగోలుదారులను ఆకర్షించే పద్ధతి మొదలైంది. యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పెట్టడం.. తాము అమ్మే అగ్గిపెట్ట్టో, మరచెంబో.. వస్తువేదైనా కానీ.. అదో అద్భుతమని ఎలివేషన్‌ ఇచ్చి అమ్ముకోవడం ట్రెండ్‌గా మారింది. సోషల్‌ మీడియాకు అవధులు లేకపోవడంతో.. వ్యాపార అవకాశాలు కూడా విస్తృతం అయ్యాయి. అంటే, ఎక్కడో శ్రీకాకుళంలో ఓ వ్యాపారి ఆన్‌లైన్‌లో వెట్టిన వీడియోను చూసి అక్కడెక్కడో అమెరికాలో ఉన్న వారు కూడా కొనేస్తున్నారు.


ఆన్‌లైన్‌లో నగదు అందుకోగానే వ్యాపారి.. వినియోగదారుడికి వస్తువును కొరియర్‌ చేస్తున్నాడు. ఇలా, ఇంట్లో కూర్చోని.. ఉన్న ఊరు, పొరుగురు, పక్కరాష్ట్రాలతోపాటు విదేశాల్లో వ్యాపారం చేసే వాళ్లు ఇటీవల ఎక్కువైపోయారు. పెద్దపెద్ద హోల్‌సేల్‌ వ్యాపారులతోపాటు చిన్నచిన్న వ్యాపారులు, పెద్దసంఖ్యలో గృహిణులు ఈ ఆన్‌లైన్‌ జజార్‌లోకి వచ్చి వ్యాపారవేత్తలు అయిపోతున్నారు.

30 సెకండ్ల మ్యాజిక్‌..!!

సోషల్‌ మీడియాను నమ్ముకుని వ్యాపారం చేసే వాళ్లు విక్రయించని వస్తువు లేదు. చీరలు, దుస్తులు, సౌందర్య ఉత్పత్తులు, గృహోపకరణాలు, సీజనల్‌ పండ్లు, సేంద్రియ ఉత్పత్తులు, ఎలకా్ట్రనిక్‌ వస్తువులు అమ్మే వాళ్లు అధికంగా ఉంటున్నారు. 30 నుంచి 45 సెకండ్ల నిడివి ఉన్న ఇన్‌స్టా, షార్ట్స్‌ వీడియోలతో తమ వద్ద ఉన్న సరుకులకు ప్రచారం చేస్తున్నారు. వీడియోల రూపకల్పనలో చాలా మంది తమ ప్రత్యేకతను చాటుకుని వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. ఈ దుకాణం మాది కాదు మనది అంటూ ఓ చీరల వ్యాపారి వీడియోలు చేసి మహిళలను ఆకర్షిస్తూ తన వ్యాపారాన్ని విస్తరించుకుపోతున్నారు. ఆ వ్యాపారిని అనుసరిస్తూ మరికొందరు వీడియోలు చేస్తూ వ్యాపారాన్ని పెంచుకునేందుకు పోటీ పడుతున్నారు. చీరలు అమ్మే మరో మహిళ అయితే.. గెట్‌ రెడీ అంటూ ఏదో అద్భుతాన్ని చూపిస్తున్నట్టు చీరలు చూపెట్టడం, ఆర్డర్లు అందించడం నా వల్ల కావడం లేదు బాబోయ్‌ అని మొత్తుకుంటూ వీడియోలు చేస్తూ ఆకర్షిస్తున్నారు. నేరుగా తమ వద్దకు వచ్చి కొనుగోళ్లు చేసిన వినియోగదారులతో మాట్లాడించి రివ్యూలు తీసుకుని ఆ వీడియోలతోనూ వ్యాపారాన్ని ప్రమోట్‌ చేసుకుంటున్నారు. ఇలా వీడియోలు చేయలేని వారు ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లో వేల సంఖ్యలో ఫాలోయర్లు ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్లతో వీడియోలు చేయించుకుని తమ వ్యాపారాలను ప్రమోట్‌ చేయించుకుంటున్నారు.


ఒక్కటి హిట్‌ అయితే చాలు..

సోషల్‌ మీడియా వేదికగా వ్యాపారం చేసే వాళ్లు చేసిన వీడియోల్లో ఒక్కటి హిట్‌ అయితే చాలు.. ఆ వ్యాపారం మూడు లైక్‌లు, ఆరు రీపోస్టులతో కళకళలాడుతుంది. వీడియోలు ట్రెండింగ్‌లో ఉన్నంతకాలం ఆర్డర్లు, సరుకు కోసం విచారణకు లెక్కకు మించి కాల్స్‌, మెసేజ్‌లు వస్తుంటాయి. వీటిని మేనేజ్‌ చేసేందుకు కొందరు ప్రత్యేకంగా సిబ్బందిని కూడా నియమించుకుంటున్నారు. ఇక, వ్యాపారుల బ్యాంకు ఖాతాలో నగదు జమలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఇలా వ్యాపారం చేసే వాళ్లు ప్రీపెయిడ్‌ లావాదేవీలే అధికంగా చేస్తుంటారు. వినియోగదారుడు తమకు డబ్బు పంపితే దానిని నిర్ధారించుకున్న తర్వాతే సరుకును పంపిస్తారు.

సోషలైజింగ్‌ ముదిరి..

రీల్స్‌, షార్ట్స్‌ రూపంలో 30 సెకండ్ల నుంచి 60 సెకండ్ల లోపు నిడివి ఉన్న వీడియోలు చేయడం, ఫాలోయర్లను పెంచుకోవడం ఆ ఆన్‌లైన్‌ వ్యాపారంలో కీలకం. అయితే, వేల సంఖ్యలో ఫాలోయర్లు ఉన్నవారు తమని తాము ఎక్కువగా ఊహించుకోవడం లేనిపోని సమస్యలకు దారి తీస్తోంది. సోషల్‌ మీడియాలో ఉన్న వ్యాపార విస్తృతిని అర్థం చేసుకోలేకపోవడం సమస్యకు కారణం అవుతోంది. తమ సోషల్‌ మీడియా ఖాతాకు ఉన్న ఆదరణను చూసుకుని.. తాము ఏమన్నా చెల్లుతుంది అనే ధోరణితో కొందరు హద్దులు దాటుతున్నారు. వినియోగదారుల నుంచి వచ్చే రివ్యూలకు, సందేహాలకు దురుసుగా బదులివ్వడం వంటివి చేస్తున్నారు. అలాంటి దురుసు వ్యాఖ్యలు బయటపడితే మొదటికే మోసం జరిగి ఆసాంతం నష్టపోతున్నారు. ఇందుకు అలేఖ్య చిట్టి పికిల్స్‌ ఉదంతం ఓ ఉదాహరణ. ఇక, ఎక్కువ మంది ఫాలోయర్లు ఉన్న కొందరు వ్యాపారులైతే సమకాలీన అంశాలపై మాట్లాడుతూ.. సోషల్‌ మీడియాలో సరికొత్త చర్చలకు తెరలేపుతున్నారు. ఈ క్రమంలో వివాదాల్లో ఇరుక్కుని నష్టపోతున్నారు. ఏదేమైనా సోషల్‌ మీడియా వేదికలను నమ్ముకుని వ్యాపారాలు చేసే వాళ్లు స్వీయ నియంత్రణ పాటించడం వారికే మంచిది.

-సెంట్రల్‌ డెస్క్‌


మాయాబజార్‌తో జాగ్రత్త సుమా..!!

ఇంతకంటే మంచి ఆఫర్‌ ఉండదు.. ఇంతకంటే నాణ్యమైన వస్తువు దొరకదు.. మేము తయారు చేసిన తైలం వాడితే రోజుల వ్యవధిలో మీ జుట్టు ఒత్తుగా పెరిగిపోతుంది.. మేము అమ్మే ఆహారం తింటే నెల తిరిగే సరికి సంపూర్ణ ఆరోగ్యవంతులైపోతారు.. ఫలానా ఆకుపసరు కంటిలో వేసుకుంటే మీ కంటి చూపు సమస్య నయమైపోతుంది.. మేము అమ్మే వస్తువులు మరెక్కడా దొరకవు.. ఇలా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రీల్స్‌, షార్ట్స్‌లో చెప్పే మాటలను గుడ్డిగా నమ్మడం, వారు సూచించిన ఉత్పత్తులను కొనుగోలు చేయడం ఏమాత్రం సరికాదు. సైబర్‌ నేరాలు రోజురోజుకి అధికమవుతున్న వేళ ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ల్లోని వీడియోలను చూసి వస్తు కొనుగోళ్లు చేసేవారు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. బహిరంగ మార్కెట్‌లో చాలా ఖరీదు ఉండే వస్తువులను చూపెట్టి చాలా తక్కువ ధరకు ఇస్తామని.. చెప్పేవారి మాటలు నమ్మడం అమాయకత్వమే అవుతుంది. గుర్తు తెలియని వ్యక్తి చెప్పిన మాటలు నమ్మి డబ్బు చెల్లించడం, తర్వాత ఆ వస్తువు రాక మోసపోవడం వంటి ఘటనలు ఇటీవల అధికం అవుతున్నాయి. ఎవరో వ్యాపారి పోస్టు చేసిన వీడియోను.. మరెవరో నకిలీ ఖాతా సృష్టించి పోస్టు చేసి దాని ద్వారా అందినకాడికి డబ్బులు దండుకుంటున్న ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వస్తు కొనుగోళ్లు చేసేటప్పుడు ఉత్పత్తుల నాణ్యత తదితర వివరాలను ముందే సమగ్రంగా తెలుసుకోవాలి. నమ్మకం కుదిరిన తర్వాతే డబ్బు పంపాలి. నకిలీల విషయంలో కొనుగోలుదారులు అప్రమత్తంగా వ్యవహరించాలి.

Updated Date - Apr 21 , 2025 | 03:24 AM