భూ వివాదంతోనే రాజలింగమూర్తి హత్య!
ABN , Publish Date - Feb 22 , 2025 | 04:05 AM
సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య పథకం ప్రకారమే జరిగిందని, భూపాలపల్లి పట్టణంలో ఓ భూవివాదమే హత్యకు దారి తీసిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.

వివాదం అంతా భూపాలపల్లిలోని 319 సర్వే నంబరులోని భూమి చుట్టూనే
భార్య సరళ చేసిన ఫిర్యాదులో ఇదే ప్రధానాంశం
నిందితుల్లోని ఇద్దరికి ఈ భూమితోనే సంబంధం
8మంది అదుపులో!.. పలు వివాదాలపై అంతా ఒక్కటై చంపారా?
భూపాలపల్లి, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య పథకం ప్రకారమే జరిగిందని, భూపాలపల్లి పట్టణంలో ఓ భూవివాదమే హత్యకు దారి తీసిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. హత్య వెనుక రాజకీయ కోణం ఏమైనా ఉందా? అనే అనుమానాలు వ్యక్తమైనా పట్టణంలోని 319 సర్వే నంబరులోని భూమిపై నెలకొన్న వివాదం చుట్టూనే ప్రధానంగా పోలీసుల దర్యాప్తు సాగుతోంది. బుధవారం హత్య జరిగిన వెంటనే ముగ్గురు నిందితులను, శుక్రవారం మరో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులలోకి తీసుకున్నారు. నిందితుల్లో ఇద్దరికి 319 సర్వే నంబరులోని వివాదాస్పద భూమితో సంబంధాలు ఉండటం.. మృతుడి భార్య సరళ కూడా 319 సర్వే నంబరు భూ వివాదాన్నే ఫిర్యాదులో ప్రధానంగా ప్రస్తావించడం ఇక్కడ గమనార్హం. నిందితుల్లో ఒకరైన రేణికుంట్ల సంజీవ్ అనే వ్యక్తి స్థానిక బీఆర్‌ఎస్ నేత ఒకరికి అత్యంత సన్నిహితుడని పోలీసులు గుర్తించారు.
రాజలింగమూర్తి హత్య జరిగాక సదరు నేతతో నిందితులు మాట్లాడినట్లు ప్రచారం జరుగుతుండటంతో ఘటనలో రాజకీయ కోణం ఏమైనా ఉందా? అసలు ఆ నేత ఎవరు? హత్య ఘటనకు ముందు, తర్వాత నిందితులు ఎవరెవరితో మాట్లాడారు? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. హత్యలో పాల్గొన్న మిగతా ముగ్గురు నిందితులతోనూ రాజలింగమూర్తికి భూ వివాదాలున్నట్లు.. అంతా ఒక్కటై ఆయన్ను హత్యచేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఐదుగురు నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు హత్య ఘటనకు సంబంధించి మరో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, ఆటో, ద్విచక్ర వాహనాలను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ హత్య కేసుకు సంబంధించి పోలీసులు శనివారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.