Share News

Sithakka: నాతో పెట్టుకుంటే నాశనమైపోతావ్‌

ABN , Publish Date - Jul 09 , 2025 | 05:03 AM

కేటీఆర్‌.. నువ్వు మనిషివైతే, ఆడవాళ్లను గౌరవించేవాడివైతే.. ములుగు జిల్లాలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై నేను తప్పుడు కేసులు..

Sithakka: నాతో పెట్టుకుంటే నాశనమైపోతావ్‌

  • ఆదివాసీ బిడ్డ ఎదుగుదలను ఓర్వలేకపోతున్నవా?

  • కేటీఆర్‌.. మనిషివైతే, ఆడవాళ్లను గౌరవించేవాడివైతే నేను పెట్టిన తప్పుడు కేసులేమిటో నిరూపించు : మంత్రి సీతక్క

ములుగు, కొత్తగూడ, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ‘కేటీఆర్‌.. నువ్వు మనిషివైతే, ఆడవాళ్లను గౌరవించేవాడివైతే.. ములుగు జిల్లాలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై నేను తప్పుడు కేసులు పెట్టించినట్లయితే నిరూపించు’ అని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ, ములుగులో సీతక్క మీడియాతో మాట్లాడారు. ‘కేటీఆర్‌.. ఆదివాసీ ఆడబిడ్డ అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేకపోతున్నావా?. నీకు కుల బలం, ధన బలం అహంకారం ఉంటే.. నాకు ప్రజల ఆశీర్వాదం ఉంది. వారి దీవెనలతోనే ఎమ్మెల్యేనయ్యా. రాహుల్‌ గాంధీ, రేవంత్‌రెడ్డిల సహకారంతో మంత్రిని కూడా అయ్యా. ఇంట్లో ఆడబిడ్డను, బయటి ఆడబిడ్డను ఇబ్బందులకు గురిచేస్తున్నావు. ఇప్పటికే నీ చెల్లి నీపైన దుమ్మెత్తి పోస్తోంది. ఇప్పుడు నాతో పెట్టుకుంటే నాశనమైపోతావ్‌’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ములుగు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ నాయకులపై ఎన్ని కేసులు పెట్టిందో కేటీఆర్‌ నిరూపించాలని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్‌ నాయకులపై ఎన్ని కేసులు పెట్టారో తాను నిరుపిస్తానని సవాల్‌ విసిరారు. తన జీవితం తెలిచిన పుస్తకమని, తానెవరికీ అన్యాయం చేసిన దాఖలాలు లేవని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్‌ఎస్‌ నాయకులు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని విమర్శించారు. 70 ఏళ్ల చరిత్రలో ఒక కోయ జాతి మహిళకు మంత్రిగా అవకాశం వచ్చిందని, దీన్ని తట్టుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. పథకాలు అందడం లేదంటూ ప్రజలు ఆత్మహత్య చేసుకుని చనిపోయేలా బీఆర్‌ఎస్‌ నాయకులే ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. నాడు నాగయ్య, నేడు రమేశ్‌ ఆత్మహత్యలకు బీఆర్‌ఎస్‌ పార్టీయే కారణమని ఆరోపించారు.

Updated Date - Jul 09 , 2025 | 05:03 AM