Sigachi industry: మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఇస్తాం
ABN , Publish Date - Jul 03 , 2025 | 04:40 AM
సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 40 మంది మరణించారని, 33 మంది గాయాలపాలయ్యారని.. మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం అందిస్తామని సిగాచి పరిశ్రమ డైరెక్టర్ చిదంబరనాథ్ తెలిపారు.

నేనెక్కడికీ పారిపోలేదు.. 40 మంది మృతి చెందారు..
90 రోజులు పరిశ్రమ మూసేస్తున్నాం:సిగాచి డైరెక్టర్
బాధితులందరికీ న్యాయం చేస్తాం: సీఈఓ అమిత్ రాజ్
పటాన్‌చెరు రూరల్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 40 మంది మరణించారని, 33 మంది గాయాలపాలయ్యారని.. మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం అందిస్తామని సిగాచి పరిశ్రమ డైరెక్టర్ చిదంబరనాథ్ తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత తొలిసారిగా ఆయన బయటికి వచ్చారు. పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో మృతదేహాలను పరిశీలించారు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. తాను ఎక్కడికి వెళ్లిపోలేదని, అధికారులకు అందుబాటులో ఉన్నానని తెలిపారు. తర్వాత పరిశ్రమ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ యూనిట్‌లో 90 రోజుల పాటు అన్నిరకాల ఉత్పత్తులను నిలిపివేస్తున్నట్టు వివరించారు. రియాక్టర్ పేలుడు కారణంగా ప్రమాదం జరగలేదని, పూర్తిస్థాయి విచారణ జరుగుతోందని తెలిపారు. పాశమైలారం సిగాచి పరిశ్రమలో పరికరాలు కాలం చెల్లినవని అనడంలో అర్థం లేదని.. మిషనరీ కొత్తదేనని, భవనం పాతదని సిగాచి ఎండీ, సీఈఓ అమిత్‌రాజ్ సిన్హా పేర్కొన్నారు. ప్రమాదం దురదృష్టకరమని చెప్పారు. బాధితులందరికీ న్యాయం చేస్తామని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, క్షతగాత్రులకు వైద్య ఖర్చులన్నీ భరిస్తామని చెప్పారు. ఈ ఘటనతో సిగాచి కంపెనీ షేరు విలువ మూడు రోజుల్లో రూ.56 నుంచి రూ.42కు (25శాతం) పడిపోయింది.
ఇంటర్వ్యూకు వచ్చి, గల్లంతై.. ఆ అమ్మాయి ఎవరు?
సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగిన రోజున ఇంటర్వ్యూకు వచ్చిన ఓ యువతి ఆచూకీ తెలియకుండా పోయినట్టు సమాచారం. ఉదయాన్నే ఇంటర్వ్యూకి వచ్చిన ఆ యువతి.. హెచ్‌ఆర్ చాంబర్‌కు వెళ్లిన సమయంలోనే భారీ పేలుడుతో భవనం కుప్పకూలిందని కార్మికులు చెబుతున్నారు. ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారన్న వివరాలు తెలియలేదు. భవనం శిథిలాలను తొలగిస్తేగానీ దీనిపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.
ఇవి కూడా చదవండి
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి గుడ్ న్యూస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి