రక్తదానంతో ఆ పిల్లల్ని బతికించరూ!
ABN , Publish Date - Jan 05 , 2025 | 04:31 AM
తలసీమియా చిన్నారులు రక్తం దొరక్క గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒకసారి రక్తం ఇస్తే తప్ప ఆ చిన్నారుల మనగడ ముందుకు సాగదు. అయితే దాతలు పెద్దగా ముందుకు రాకపోవడంతో రక్తానికి ఇప్పుడు తీవ్ర కొరత ఏర్పడింది.

తలసీమియా బాధితులకు రక్తం కొరత
దాతలు ముందుకు రావాలని సికిల్‌సెల్ సొసైటీ విజ్ఞప్తి
హైదరాబాద్ సిటీ, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): తలసీమియా చిన్నారులు రక్తం దొరక్క గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒకసారి రక్తం ఇస్తే తప్ప ఆ చిన్నారుల మనగడ ముందుకు సాగదు. అయితే దాతలు పెద్దగా ముందుకు రాకపోవడంతో రక్తానికి ఇప్పుడు తీవ్ర కొరత ఏర్పడింది. ప్రతి నెల 2500 నుంచి 3000 యూనిట్ల రక్తం అవసరమవుతుండగా ప్రస్తుతం కేవలం 1000 నుంచి 1200 యూనిట్ల వరకే రక్తం లభిస్తోందని రాజేంద్రనగర్‌లోని సికిల్‌సెల్ సొసైటీ నిర్వాహకులు పేర్కొంటున్నారు. తలసీమియా అండ్ సికిల్ సెల్ సొసైటీలో ప్రస్తుతం 4200 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇందులో ప్రతిరోజు 60 నుంచి 70 మంది వరకు పిల్లలకు రక్తం ఇస్తుండాలి. కానీ ప్రస్తుతం 20 నుంచి 30 మంది చిన్నారులకు మాత్రమే రక్తం లభిస్తోంది.
14 ఏళ్ల లోపు పిల్లలకైతే ఒక యూనిట్, 15 ఏళ్లుపైబడిన వారికైతే రెండు యూనిట్ల రక్తం అవసరమవుతుంది. కొంత మందికి రెండు వారాలకు ఒకటి నుంచి రెండు యూనిట్ల రక్తం ఇస్తే కానీ వారి మనగడ కష్టం. ఇలా ఏడాదికి కనీసం 12 నుంచి 24 సార్లు రక్తం ఎక్కించాల్సిందే. రక్తం కొరత ఏర్పడటంతో తెలిసిన వారిని ఒప్పించి మరీ రక్తదానం చేయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తలసీమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ నిర్వాహకులు చెబుతున్నారు. రక్తదానానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తలసీమియా బాధితులకు అండగా నిలవాలని, బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులూ ముందుకొచ్చి బాదితులకు రక్తం అందించాల్సిగా కోరుతున్నారు.
ఆ పిల్లలకు రక్తం అత్యవసరం
తలసీమియా సికిల్ సెల్ సొసైటీ బ్లడ్ బ్యాంక్‌లో రక్తం కొరత తీవ్రంగా ఉంది. దీంతో తలసీమియా బాధితులకు అత్యవసరంగా రక్తదానం అవసరమైంది. అన్ని బ్లడ్ గ్రూప్ దాతలు ముందుకొచ్చి బాధితులను ఆదుకోవాలి. దాతల సాయం కోసం ప్రతి చిన్నారి ఎదురుచూస్తున్నారు. రక్తదాన శిబిరాలు నిర్వహించి బాధితులకు అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. కాలేజీల విద్యార్థులు, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులు సహకరించాలి. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి దానం చేయాలి. ఆసక్తి గల వారు 9246534913, 8885534913 నంబర్లకు సంప్రందిస్తే అవసరమైన ఏర్పాట్లు చేస్తాం.
-అలీంబేగ్, సంయుక్త కార్యదర్శి, తలసీమియా అండ్ సికెల్‌సెల్ సొసైటీ