Seethakka: విద్వేషాలను రెచ్చగొట్టడమే బీజేపీ నైజం
ABN , Publish Date - Apr 22 , 2025 | 03:20 AM
దేశ ప్రజల మధ్య కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టడమే బీజేపీ నైజమని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు.

ఆదివాసీ కాంగ్రెస్ సమ్మేళన్ ముగింపులో మంత్రి సీతక్క
హనుమకొండ సిటీ, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి) : దేశ ప్రజల మధ్య కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టడమే బీజేపీ నైజమని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. గాడ్సే సిద్ధాంతంతోపాలన సాగిస్తోందన్నారు. హనుమకొండ హరిత హోటల్‌లో జరుగుతున్న ‘ఆదివాసీ కాంగ్రెస్ సమ్మేళన్’లో మూడో రోజు సోమవారం ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివాసీ కాంగ్రెస్ సమ్మేళన్ జాతీయ ఉపాధ్యక్షుడు, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. బీజేపీపై విమర్శనాస్త్రాలను సంధించారు. కేంద్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక దేశంలో శాంతియుత పరిస్థితులకు విఘాతం ఏర్పడిందన్నారు.
వివిధ వర్గాల ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతూ భయానక పాలన సాగిస్తోందని విమర్శించారు. నిరుపేదలకు సంక్షేమ పథకాలు, రైతులకు రుణమాఫీ చేయడానికి బీజేపీకి చేతులు రాలేదన్నారు. అంబానీ, అదానీ వంటి బడాబాబులకు మాత్రం రూ.21 లక్షల కోట్ల రుణాలను మోదీ ప్రభుత్వం మాఫీ చేసిందని విమర్శించారు. కాగా బీజేపీ 30 వేల మంది ఆర్‌ఎ్‌సఎస్ కార్యకర్తలను తెలంగాణలో డంప్ చేసిందని సీడబ్ల్యూసీ సభ్యులు కొప్పుల రాజు ఆరోపించారు. కార్యక్రమంలో ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు విక్రాంత్ బునియా తదితరులు పాల్గొన్నారు.