Share News

Maoists: ఆపరేషన్‌ కర్రెగుట్టలు!

ABN , Publish Date - Apr 23 , 2025 | 04:52 AM

దశాబ్దాలుగా ఈ గుట్టలు నక్సలైట్లకు కంచుకోటలుగా ఉంటుండగా.. అబూజ్‌మఢ్‌, ఇతర ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్లు పెరగడంతో.. ఉన్న క్యాడరంతా కర్రెగుట్టలపైకి చేరుకున్నట్లు భద్రతాబలగాలు ఉప్పందుకున్నాయి.

Maoists: ఆపరేషన్‌ కర్రెగుట్టలు!

  • మూడు రాష్ట్రాల్లో 280 చ.కి.మీ. మేర నక్సల్స్‌కు కంచుకోటగా గుట్టలు

  • అందులో 50% భద్రాద్రి, ములుగు జిల్లాల్లోనే

  • హిడ్మాతో పాటు 3 వేల మంది నక్సల్స్‌ అక్కడే ఉన్నట్లు అనుమానాలు

  • పెద్ద ఎత్తున చుట్టుముట్టిన బలగాలు

  • నేడో, రేపో భారీ ఎన్‌కౌంటర్‌!

చర్ల/వాజేడు/వెంకటాపురం, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): ‘ఆపరేషన్‌ కగార్‌’ పేరుతో 2026 మార్చికల్లా మావోయిజాన్ని తుడిచిపెట్టాలని సంకల్పించిన కేంద్ర బలగాలు.. మరో భారీ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్‌, మహారాష్ట్ర సరిహద్దుల్లో.. 280 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన కర్రెగుట్టల వైపు బలగాలు వేగంగా కదులుతున్నాయి. దశాబ్దాలుగా ఈ గుట్టలు నక్సలైట్లకు కంచుకోటలుగా ఉంటుండగా.. అబూజ్‌మఢ్‌, ఇతర ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్లు పెరగడంతో.. ఉన్న క్యాడరంతా కర్రెగుట్టలపైకి చేరుకున్నట్లు భద్రతాబలగాలు ఉప్పందుకున్నాయి. దాంతో.. సోమవారం ఉదయం నుంచే సీఆర్‌పీఎ్‌ఫ-కోబ్రాతోపాటు.. బస్తర్‌ రీజియన్‌లోని ఏడు జిల్లాల డీఆర్‌జీ, ఎస్‌టీఎ్‌ఫకు చెందిన సుమారు 4 వేల బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టడం ప్రారంభించాయి. అటు మహారాష్ట్రలోని ఇంద్రావతి నది సమీపంలో సీ-60 బలగాలు కూడా మోహరించినట్లు సమాచారం. 50ు కర్రెగుట్టలు తెలంగాణలోని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా చర్ల, ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు వైపు సుమారు 70 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. దీంతో.. కేంద్ర బలగాలు తెలంగాణ మీదుగా కర్రెగుట్టలకు చేరుకున్నట్లు తెలిసింది. అటు ఛత్తీ్‌సగఢ్‌లోని హిడ్మా స్వస్థలమైన పూవర్తికి 20 కిలోమీటర్ల దూరంలోని పూజారి కాంకేర్‌, ఊసూరు, మద్దేడు నుంచి ఈ గుట్టలు మొదలవుతాయి.


ఎత్తులో పైచేయి ఎవరిది?

‘ఆపరేషన్‌ కర్రెగుట్టలు’ పోలీసు బలగాలకు అంత సులభమేమీ కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. 280 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ గుట్టల్లో చాలా వరకు నిటారుగా.. 30-50 మీటర్ల ఎత్తులో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మందుపాతరల అనుమానాలతో బలగాలు బాంబ్‌స్క్వాడ్‌ సాయంతో ముందుకు సాగుతుండగా.. బుధవారం కడపటి వార్తలందేసరికి.. రోప్‌ సాయంతో గుట్టలను అధిరోహించడం ప్రారంభించినట్లు తెలిసింది. వాస్తవానికి గుట్టల పైన ఉన్న వారిదే పైచేయిగా ఉంటుంది. పైనుంచి పేల్చే తూటాలు కిందివైపు వేగంగా దూసుకొస్తాయి. అదే.. కింద పేల్చే తూటాలు.. పైకి వెళ్లే కొద్దీ వాటి వేగం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే.. హెలికాప్టర్లు, డ్రోన్లు అందుబాటులో ఉండడం బలగాలకు కలిసి వచ్చే అవకాశాలున్నట్లు వివరిస్తున్నారు. కర్రెగుట్టలపై నక్సల్స్‌ బంకర్లలో కాపుకాస్తున్నారని, ప్రతిదాడికి సిద్ధంగా ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వారి వద్ద బీజీఎల్‌ లాంచర్లు, రాకెట్‌ లాంచర్లు ఉన్నట్లు పలు ఘటనలు రుజువు చేశాయి. ఈ నేపథ్యంలో హెలికాప్టర్లు, డ్రోన్లను వారు టార్గెట్‌ చేసుకునే ప్రమాదముందనే వాదనలూ ఉన్నాయి.


చరిత్రలోనే భారీ ఆపరేషన్‌!

మావోయిస్టు పార్టీ గెరిల్లా దళపతి హిడ్మా సహా.. పలువురు కీలక నేతలను కలిపి కర్రెగుట్టలపై ఉన్న స్థావరాల్లో 3 వేల మంది మావోయిస్టులు ఉన్నట్లు బలగాలు భావిస్తున్నాయి. ఎత్తుగా ఉండే ఈ గుట్టలపై.. మావోయిస్టు అగ్రనాయకుల బంకర్లు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే.. ప్రభుత్వం ‘సేవ్‌ కర్రెగుట్టలు’ ప్రచారాన్ని ప్రారంభించగానే.. మావోయిస్టులు ఈ గుట్టల చుట్టూ మందుపాతరలను అమర్చారని తెలుస్తోంది. అందుకే.. సామాన్య పౌరులెవరూ కర్రెగుట్టల వైపు రావొద్దంటూ నక్సల్స్‌ కరపత్రాలు ఇటీవల కలకలం రేపాయి. వాజేడు, వెంకటాపురం మండలాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ మందుపాతరల కారణంగా మృతిచెందగా, పలువురు మంది గిరిజనులు గాయపడ్డారు. భారీ సంఖ్యలో మావోయిస్టులు ఉండడం.. 4 వేల మందితో బలగాలు ముందుకు సాగుతుండడంతో.. కర్రెగుట్టలపై ఏమైనా జరగొచ్చని, చరిత్రలోనే భారీ ఆపరేషన్‌గా నిలవొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Falaknuma Crime News: వివాహమైన మూడు రోజులకే రౌడీషీటర్ దారుణ హత్య.. ఏం జరిగిందంటే

CM Revanth Praised Women: సన్నబియ్యంతో సహపంక్తి భోజనం.. మహిళకు సీఎం అభినందనలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 23 , 2025 | 04:52 AM