TGSRTC Union: ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు ఆర్టీసీ ద్వారా చేపట్టాలి
ABN , Publish Date - Jul 16 , 2025 | 05:34 AM
హైదరాబాద్‌కు కేంద్రం ప్రకటించిన 2000 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేయాలని టీజీఎస్..

ఆర్టీసీ బస్ బాడీ బిల్డింగ్ యూనిట్లను ప్రోత్సహించాలి
టీజీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్
హైదరాబాద్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌కు కేంద్రం ప్రకటించిన 2000 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేయాలని టీజీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. పర్యావరణ హితమంటూ పెట్రోల్, డీజిల్ బస్సులకు బదులుగా కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులను ప్రోత్సహించడాన్ని యూనియన్ తప్పుబట్టింది. ఆర్టీసీ బస్సుల వల్ల జరిగే కాలుష్యం 0.09 శాతం మాత్రమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.బాబు, ఈదురు వెంకన్న మంగళవారం ఓ ప్రకటన చేశారు. పర్యావరణహితమంటూ కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇచ్చి బస్సులను తయారు చేయిస్తూ ప్రజారవాణా వ్యవస్థను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని యూనియన్ ఆరోపించింది. కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్న సబ్సిడీలనే ఆర్టీసీలోకి బస్ బాడీ బిల్డింగ్ యూనిట్లకు ఇచ్చి ఎలక్ట్రిక్ బస్సులు తయారీకి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. టీజీఎస్ ఆర్టీసీలో 600 ఎలక్ట్రిక్ బస్సలు అద్దెకు వాడుతున్నారని, దాని వల్ల కొన్ని డిపోలు, గ్యారేజీలు ప్రైవేటుపరం అయ్యాయని యూనియన్ వాపోయింది. డిపోల నుంచి వందలమంది సిబ్బందిని బలవంతంగా బయటికి పంపించారని తెలిపింది.