Share News

Regional Ring Road: 4 హైవేలు.. 6 జిల్లాల మీదుగా!

ABN , Publish Date - May 27 , 2025 | 03:46 AM

రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగం నాలుగు జాతీయ రహదారులు, ఒక రాష్ట్ర రహదారి అనుసంధానంతో నిర్మితం కానుంది. ఈ రహదారి ఆరు జిల్లాల మీదుగా వెళ్లనుంది.

Regional Ring Road: 4 హైవేలు.. 6 జిల్లాల మీదుగా!

  • ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం నిర్మాణం

  • 22 చోట్ల విద్యుత్తు హైటెన్షన్‌ లైన్లు.. 2 చోట్ల అటవీ భూములు

  • రేవంత్‌కు సమగ్ర నివేదిక.. అధికారులకు సీఎం సూచనలు

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగం నాలుగు జాతీయ రహదారులు, ఒక రాష్ట్ర రహదారి అనుసంధానంతో నిర్మితం కానుంది. ఈ రహదారి ఆరు జిల్లాల మీదుగా వెళ్లనుంది. మార్గం మధ్యలో ఉన్న గ్రామాలు, హైటెన్షన్‌ విద్యుత్తు లైన్లు, అటవీ భూములను గుర్తించారు. అందుకు సంబంధించి, సమగ్ర వివరాలతో కూడిన నివేదికను అధికారులు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందించారు. ఆ సమయంలో దక్షిణ భాగంపై సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. ఫ్యూచర్‌ సిటీ, ఎయిర్‌పోర్టు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, బెంగళూరు హైవేలన్నీ అధిక భాగం ఈ మార్గంలోనే ఉండడంతో అలైన్‌మెంట్‌ ఖరారుపై జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించినట్లు తెలిసింది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర, దక్షిణ భాగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఉత్తర భాగం నిర్మాణానికి ఇప్పటికే టెండర్లను ఆహ్వానించినా కేంద్ర క్యాబినెట్‌ ఇంకా ఆమోదం తెలపలేదు. మరోవైపు ఉత్తరభాగంతో పాటే దక్షిణ భాగాన్ని నిర్మించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది. దక్షిణ భాగానికి సంబంధించి సమగ్ర నివేదిక రూపొందిస్తోంది.


ఈ క్రమంలోనే దక్షిణ భాగం ప్రారంభమయ్యే చౌటుప్పల్‌ నుంచి సంగారెడ్డి వరకు ఉన్న భౌగోళిక పరిస్థితులపై అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. దాని ప్రకారం.. దక్షిణ భాగం రోడ్డు చౌటుప్పల్‌ దగ్గర మొదలై ఆమనగల్‌, చేవెళ్ల, వికారాబాద్‌ మీదుగా సంగారెడ్డి వరకు మొత్తం 200 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఎన్‌హెచ్‌ 65, ఎన్‌హెచ్‌-44, ఎన్‌హెచ్‌-163, ఎన్‌హెచ్‌-765తో పాటు ఒక రాష్ట్ర రహదారి (ఎస్‌హెచ్‌)-19తో అనుసంధానం కానుంది. దక్షిణభాగం అలైన్‌మెంట్‌ మధ్యలో 22చోట్ల హైటెన్షన్‌ విద్యుతులైన్లు ఉన్నాయి. ఏయే కిలోమీటరు దగ్గర ఈ లైన్లు ఉన్నాయి? వాటిని మార్చేందుకు ఉన్న మార్గాలు, ప్రత్యామ్నాయ అవకాశాలన్నింటినీ నివేదికలో పేర్కొన్నారు. అదేవిధంగా 38 నుంచి 41వ కి.మీ. వరకు, 158 నుంచి 160 కి.మీ. వరకు.. రెండు చోట్ల అటవీ ప్రాంతం ఉందని తెలిపారు. వీటితో పాటు పలుచోట్ల కాలువలు, చెరువులు, నీటి కుంటలు, బావులు ఉన్నాయంటూ.. వాటి ఫొటోలను పొందుపర్చారు. బాలానగర్‌-రంగారెడ్డిగూడ, గుళ్లగూడ-చిటిగిడ్డ దగ్గర రైల్వే మార్గాలున్నాయంటూ.. సంబంధిత గూగుల్‌ మ్యాపింగ్‌ ఫొటోలను జతచేశారు.


16 గ్రామాలపై ప్రభావం..

దక్షిణ భాగం రహదారి కోసం నిర్వహించిన సర్వేలో దాదాపు 16 గ్రామాలపై ప్రభావం పడుతోందని గుర్తించారు. మలుపులను అభివృద్ధి చేయడం కోసం కొన్నిచోట్ల, మరికొన్ని చోట్ల ఇతరత్రా అవసరాల కోసం వాటిని మార్చాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు కోతులాపురం, నాగవారిగూడెం, కొర్పూరు రెసిడెన్సీ, సూరారం గ్రామాల బయటివైపు ప్రభావం పడుతోంది. ఇక నల్లార్ల తండా, తొమ్మిడిరేకులలో పాక్షికంగా, కంసానపల్లి, బీమారం ఉరేంకి తండా, లాల్‌సింగ్‌ తండా, చించొడ్‌, చక్రాంపల్లి, మందాపూర్‌, గంగారం, సీతారాంకుంట తండా, దొబ్బకుంట తండా, అలియాబాద్‌ గ్రామాల్లో లోపలి వైపు ప్రభావం పడుతున్నట్లు గుర్తించారు.


Also Read:

సైంటిస్టులు అద్భుత ఆవిష్కరణ.. 'సూపర్-విజన్' లెన్స్‌తో చీకట్లోనూ చూసేయచ్చు..

సన్నగా, బలహీనంగా ఉన్నారా? ఫిట్‌నెస్ మంత్ర ఇదే..

For More Health News and Telugu News..

Updated Date - May 27 , 2025 | 03:46 AM