RRR: ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి రూ.8 వేల కోట్లు
ABN , Publish Date - Jul 04 , 2025 | 04:37 AM
రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ప్రాజెక్టు అంశంలో కీలక ముందడుగు పడింది. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ఎట్టకేలకు కేంద్రానికి చేరింది.

భూసేకరణకు అదనపు నిధులు అవసరం.. కేంద్రం చెంతకు చేరిన డీపీఆర్
ప్రాజెక్టు సాంకేతిక కమిటీ వద్ద నివేదిక.. ఆ తర్వాత మరో కమిటీ ముందుకు
ఆ రెండింటి ఆమోదం పొందితే కేంద్ర క్యాబినెట్ వద్దకు ఫైలు
హైదరాబాద్, జూలై 3 (ఆంధ్రజ్యోతి): రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ప్రాజెక్టు అంశంలో కీలక ముందడుగు పడింది. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ఎట్టకేలకు కేంద్రానికి చేరింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించింది. ఉత్తర భాగంలోని రహదారుల నిర్మాణానికి రూ.8వేల కోట్లు, భూసేకరణ కింద ఇవ్వాల్సిన నష్టపరిహారానికి అదనపు నిధులు అవసరమని డీపీఆర్‌లో పేర్కొన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ డీపీఆర్.. ప్రాజెక్టు అప్రైజల్ టెక్నికల్ స్ర్కూట్నీ కమిటీ చెంతకు చేరింది. ఈ కమిటీ ఆమోదం లభించిన తర్వాత డీపీఆర్.. పబ్లిక్-ప్రైవేటు-పార్టనర్‌షిప్ అప్రైజల్ కమిటీకి వెళ్తుంది. ప్రాజెక్టు నిర్మాణం, వ్యయం, ఆదాయం సహా పలు కీలక అంశాలపై ఈ కమిటీ సమీక్షిస్తుంది. ఈ కమిటీ కూడా ఆమోదిస్తే ఫైలు కేంద్ర క్యాబినెట్ ముందుకు వెళుతుంది. ఇదే చివరి దశ. ఈ రహదారి వల్ల దేశవ్యాప్తంగా ఎంత మేర రవాణా జరుగుతుంది, రాబడి ఎలా ఉంటుంది సహా వివిధ అంశాలపై కేంద్ర మంత్రివర్గం సమగ్రంగా చర్చిస్తుంది. అయితే, ఆయా అంశాలను పరిశీలించాకే ఆర్‌ఆర్‌ఆర్‌ను మంజూరు చేసిన నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్ ఆమోదం త్వరగానే లభిస్తుందని ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మొత్తంగా 2016లో రాష్ట్రానికి మంజూరైన ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టులో ఉత్తరభాగం ఏళ్ల తర్వాత కీలకదశకు చేరుకుందని అఽధికారులు అంటున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం సంగారెడ్డిలో మొదలై చౌటుప్పల్ వరకు 161 కిమీల మేర ఉందన్న విషయం తెలిసిందే.
నిర్మాణ వ్యయం రూ.8వేల కోట్లు..
ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం నిర్మాణానికి దాదాపు రూ.8వేల కోట్లు అవసరమని కేంద్రానికి పంపిన డీపీఆర్‌లో పేర్కొన్నట్టు తెలిసింది. రహదారి నిర్మాణం కోసం సేకరించిన భూములకు చెల్లించాల్సిన పరిహారం దీనికి అదనమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన వాటా కింద పరిహారం చెల్లించనుండగా ఇందుకోసం రూ.5,200 కోట్లు అవసరమని అంచనా. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగాన్ని తొలుత 4 లేన్ల రహదారిగా నిర్మించాలని అనుకున్నారు. కానీ, ట్రాఫిక్ సర్వే గణాంకాల ఆధారంగా ఈ మార్గాన్ని ఆరు లేన్లగా నిర్మించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబర్‌లో పిలిచిన టెండర్ల స్థానంలో కొత్తగా 6 వరుసలతో రహదారి నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించనున్నారు.
నిర్మాణ విధానంలో మార్పులు.!
రహదారిని ఆరు లేన్లకు మార్చడంతో రోడ్డుతో పాటు సర్వీస్ రోడ్లు, కల్వర్టులు, సహా ఇతరత్రా అంశాలన్నింటిపై మరోమారు సమగ్ర నివేదిక రూపొందించారు. అదేవిధంగా టెండర్లు ఆహ్వానించిన సమయంలో పేర్కొన్న ఈపీసీ విధానం కాకుండా బిల్డ్-ఆపరేట్-టోల్ అండ్ ట్రాన్సఫర్ (బీవోటీ) విధానంలో నిర్మిస్తే కేంద్రంపై భారం ఉండదని నివేదికలో పొందుపర్చారు. ఇందుకోసం ఈపీసీ, హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (హ్యామ్), బీవోటీ విధానాలను వివరించారు. కాగా ప్రాజెక్టును కేంద్ర క్యాబినెట్ ఆమోదించగానే నిర్మాణ విధానం, టెండర్ల ఖరారు సహా ఇతర అంశాలు కొలిక్కివస్తాయని, ఈ మొత్తం ప్రక్రియకు 3-4 నెలల సమయం పడుతుందని ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు చెబుతున్నాయి.
కల్వర్టులు, టోల్‌ప్లాజాలు ఇలా..
161 కిమీల మేర ఉండే ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం రోడ్డు మార్గంలో కొన్నిచోట్ల ఇరిగేషన్ శాఖకు సంబంధించిన మైనర్, మేజర్, బాక్స్ కల్వర్టులను నిర్మించాల్సి ఉంది. మొత్తం రోడ్డు విస్తీర్ణంలో 11 ఇంటర్‌ఛేంజ్‌లు, కొన్నిచోట్ల టోల్‌ప్లాజాలు రానుండగా, 6 చోట్ల రెస్ట్ ఏరియాలు ఏర్పాటు కానున్నాయి. చిన్న, మధ్య, భారీ తరహా కలిపి మొత్తం 187 అండర్ పాస్‌లు, నాలుగు రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)లు నిర్మించాల్సి వస్తోంది. ఇవికాక 26 మేజర్ బ్రిడ్జిలు, 81 మైనర్ బ్రిడ్జిలు, 400కు పైగా బాక్స్ కల్వర్టులు నిర్మించాలని డీపీఆర్‌లో పేర్కొనట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి
రాయచోటిలో ఉగ్రవాదులు అరెస్ట్.. కీలక అప్ డేట్..
తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారు.. కేసీఆర్, హరీష్‌లపై మహేష్ గౌడ్ ఫైర్
టాలీవుడ్‌లో పైరసీ గుట్టు రట్టు.. ఒకరి అరెస్ట్
Read latest Telangana News And Telugu News