Share News

Adilabad: రత్నాపూర్‌ నీటి సమస్యపై సీఎంవో ఆరా

ABN , Publish Date - Apr 12 , 2025 | 04:45 AM

ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం రత్నాపూర్‌ గ్రామంలో నెలకొన్న శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘కన్నీటి కష్టాలు’ అన్న శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందన వచ్చింది.

Adilabad: రత్నాపూర్‌ నీటి సమస్యపై సీఎంవో ఆరా

  • గ్రామానికి జిల్లా అధికారులు.. నిరంతర నీటి సరఫరాకు హామీ

  • ‘ఆంధ్రజ్యోతి’కి గ్రామస్తుల కృతజ్ఞతలు

తలమడుగు, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం రత్నాపూర్‌ గ్రామంలో నెలకొన్న శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘కన్నీటి కష్టాలు’ అన్న శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందన వచ్చింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ ఉన్నతాధికారులు స్పందించారు. ఆదిలాబాద్‌ జిల్లా అధికారులకు సీఎం క్యాంప్‌ ఆఫీసు ఉన్నత అదికారులు ఫోన్‌ చేసి రత్నాపూర్‌ గ్రామంలో నెలకొన్న నీటి సమస్యపై ఆరా తీశారు. తక్షణం ఆ గ్రామంలో నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో జిల్లా నీటిపారుదల శాఖ ఈఈ చంద్రమోహన్‌, డీఈ దేవయ్య, ఏఈ ఈ. సాయిరాం తదితరులు రత్నాపూర్‌ గ్రామాన్ని సందర్శించారు.


ఈ సందర్భంగా రత్నాపూర్‌ వాసులు మాట్లాడుతూ తమ గ్రామానికి మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు సక్రమంగా అందించాలని కోరారు. గ్రామస్తుల అభిప్రాయాలను విన్న తర్వాత అధికారులు స్పందిస్తూ.. వీలైనంత త్వరగా రత్నాపూర్‌ గ్రామానికి నిరంతరం నీటి సరఫరాకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అలాగే ఇంకా ఇతర సమస్యలేమైనా ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. కాగా, తమ గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేసిన ‘ఆంధ్రజ్యోతి’కి రత్నాపూర్‌ గ్రామస్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Apr 12 , 2025 | 04:45 AM