Drug Trafficking: డ్రగ్స్ దందాలో.. పోలీసుల పిల్లలు
ABN , Publish Date - Jul 16 , 2025 | 03:45 AM
డ్రగ్స్ విక్రయాలు, కొనుగోళ్లలో సెలబ్రిటీలతోపాటు.. పోలీసు అధికారుల పిల్లల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి.

ఇంటెలిజెన్స్ ఎస్పీ కుమారుడు రాహుల్ తేజ, సైబరాబాద్ ఏఆర్ డీసీపీ కొడుకు మోహన్‌లను అరెస్టు చేసిన ఈగల్
డ్రగ్స్ వ్యవహారంలో మల్నాడు కిచెన్ సూర్యతోపాటు ఇప్పటి వరకు పది మంది అరెస్టు
సూర్య కాల్ లిస్టులో సెలబ్రిటీలు, రాజకీయ నేతల పిల్లలు?
హైదరాబాద్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్ విక్రయాలు, కొనుగోళ్లలో సెలబ్రిటీలతోపాటు.. పోలీసు అధికారుల పిల్లల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. 24 గంటల్లోనే డ్రగ్స్ డీల్స్‌కు సంబంధించి ఇద్దరు పోలీసు అధికారుల పుత్ర రత్నాలను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ వింగ్- ఈగల్ బృందాలు అరెస్టు చేశాయి. ఇలా అరెస్టయిన వారిలో.. మల్నాడు కిచెన్ యజమాని సూర్యతో కలిసి డ్రగ్స్ దందాలో క్రియాశీలంగా ఉన్న ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ వేణుగోపాల్‌రావు కుమారుడు రాహుల్ తేజ, సైబరాబాద్ ఏఆర్ డీసీపీ సంజీవ్ కుమారుడు మోహన్ ఉన్నారు. నిజానికి రాహుల్ తేజపై గత ఏడాది నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో డ్రగ్స్ కేసు నమోదైంది. ఈ కేసులో తేజ ఏ3గా ఉన్నారు. తేజ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ప్రధాన నిందితులు వాంగ్మూలం ఇచ్చినప్పటికీ.. నిజామాబాద్ పోలీసులు తేజ జోలికి వెళ్లలేదు.
సూర్యతో తేజకు వ్యాపార భాగస్వామ్యం ఉందని, సూర్య కాల్ లిస్టులో డ్రగ్స్ డీల్‌లో భాగస్వామ్యులైన పలువురి నంబర్లు బయటపడటంతో ఒక్కొక్కరినీ ఈగల్ బృందాలు విచారిస్తున్న క్రమంలో తేజ సంగతి వెలుగులోకి వచ్చింది. తన బ్యాచ్‌లో పోలీసు అధికారుల సంతానం కూడా ఉండటంతో సూర్య మూడేళ్లుగా డ్రగ్స్ దందా యథేచ్ఛగా నడిపించాడని, కొందరు రాజకీయ నాయకుల పుత్రరత్నాలు, మరికొంత మంది సెలబ్రిటీలు సూర్య కాల్ లిస్టులో ఉన్నట్లు ఈగల్ గుర్తించింది. ఈ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య పదికి చేరింది. సూర్యతోపాటు హర్ష, యశ్వంత్, జశ్వంత్, నవదీప్, పవన్, రాహుల్, ఫుడ్ బ్లాగర్ సూర్య, తేజ, మోహన్‌లను ఈగల్ బృందాలు అరెస్టు చేశాయి. సూర్య తరచుగా డ్రగ్స్ తీసుకోవడానికి అనుమతించిన 9 పబ్‌లపై ఇప్పటికే సైబరాబాద్ ఈగల్ టీం కేసులు నమోదు చేసి, నోటీసులు జారీచేసింది. సూర్యను వారం రోజులు కస్టడీకి తీసుకున్న సైబరాబాద్ ఈగల్ బృందాలు.. అతని ఆర్థిక లావాదేవీలు, కొరియర్ చానల్స్, డిజిటల్ ఫుట్ ప్రింట్‌ను గుర్తించే దిశలో చర్యలు తీసుకుంటున్నాయి. ఈ కేసుకు సంబంధించి సూర్య పూర్తిగా నోరు విప్పితే పబ్‌ల లోగుట్టు, రహస్య గదుల్లో పార్టీలు జరిగే తీరు.. అందులో పాల్గొన్న పెద్దల పుత్రరత్నాల పేర్లు బయటపడే అవకాశాలున్నాయి.