Share News

Phone Tapping: సొంత వాళ్ల ఫోన్ల ట్యాపింగ్‌!

ABN , Publish Date - Jul 24 , 2025 | 01:48 AM

గత ప్రభుత్వంలో సొంత ఫ్యామిలీ ఫోన్లను కూడా ట్యాపింగ్‌ చేయించుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా వినాల్సినంత ఖర్మ ఏం పట్టిందని ప్రశ్నించారు.

Phone Tapping: సొంత వాళ్ల ఫోన్ల ట్యాపింగ్‌!

  • దాని కన్నా ఆత్మహత్య చేసుకోవడం మేలు

  • ఇంతచేసి సాధించిందేంటి? ఉద్యోగమే ఊడింది కదా?

  • మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి

  • రేపు క్యాబినెట్‌ భేటీ.. బీసీల 42% రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌,

  • స్థానిక ఎన్నికలపై చర్చించే అవకాశం

న్యూఢిల్లీ, జూలై 23 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వంలో సొంత ఫ్యామిలీ ఫోన్లను కూడా ట్యాపింగ్‌ చేయించుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా వినాల్సినంత ఖర్మ ఏం పట్టిందని ప్రశ్నించారు. దాని కన్నా ఆత్మహత్య చేసుకోవడం మేలు అని అన్నారు. బుధవారం ఢిల్లీలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో మీడియా సమావేశం తర్వాత పాత్రికేయులతో కొద్దిసేపు సీఎం ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘ఫోన్‌ ట్యాపింగ్‌పై విచారణ సాగుతోంది. విచారణకు నన్ను పిలవలేదు కాబట్టి.. ఫోన్‌ ట్యాపింగ్‌ లిస్టులో నా నంబర్‌ లేదని అనుకుంటున్నా. ఒకవేళ నన్ను పిలిస్తే విచారణకు తప్పకుండా వెళతా. మా ఫోన్లు ఏమైనా ట్యాప్‌ చేశారా? అంటూ ఎంతోమంది సినిమా వాళ్లు ఆందోళనతో అడుగుతున్నారు. ఏం చేసినా చివరికి ఏం సాధించిండు. ఉద్యోగం ఊడింది కదా? ఇవన్నీ ఎందుకు? ప్రశాంతంగా మన పని మనం చేస్తే సరిపోదా?’’ అని రేవంత్‌ వ్యాఖ్యానించారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై తన వల్లే దర్యాప్తు ప్రారంభమైందనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఫిర్యాదుతో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు వెలుగులోకి వచ్చిందని తెలిపారు. అంతే తప్ప.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసేమీ కాదన్నారు. ప్రవీణ్‌కుమార్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే.. దీనిపై రాష్ట్ర డీజీపీని ఈసీ వివరణ కోరిందని చెప్పారు. ఆ తర్వాత ప్రభుత్వం మారగానే ఎస్‌ఐబీలో కొన్ని పరికరాలు కనిపించడం లేదంటూ కేసు నమోదైందని, ఆ తీగను లాగితే చివరకు ఈ కేసు బయటకు వచ్చిందని అన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ చట్టబద్ధమేనని, అయితే దానిని నిబంధనలకు లోబడి, అన్ని అనుమతులు తీసుకుని చేయాలని పేర్కొన్నారు.


బహిరంగ టెండర్‌లోనే బీజేపీ నేతకు పనులు

బీజేపీ ఎంపీకి టెండర్‌ ఇవ్వడంపై వస్తున్న ఆరోపణలను సీఎం రేవంత్‌ కొట్టిపారేశారు. టెండర్‌ వేసిన వ్యక్తి సమర్థత, నిబంధనల ప్రకారమే టెండర్‌ కేటాయింపు ఉంటుందని, అందులో రహస్యమేమీ లేదని అన్నారు. అంతా ఓపెన్‌ టెండర్‌ ప్రక్రియ ద్వారా బహిరంగంగానే జరిగిందని, ఎల్‌అండ్‌టీ సంస్థ కూడా ఇందులో పోటీకి వచ్చిందని తెలిపారు. కంచ గచ్చిబౌలి భూములను ప్రభుత్వం తాకట్టు పెట్టలేదని సీఎం స్పష్టం చేశారు. కేవలం బాండ్లు మాత్రమే ఇచ్చామన్నారు. కంచ గచ్చిబౌలిలో 3,500 ఎకరాలకు సంబంధించి ఒకే సర్వే నంబర్‌ ఉందని, అది ప్రభుత్వ భూమి అని స్పష్టంగా ఉందని వెల్లడించారు. ఓ ప్రైవేట్‌ కంపెనీకి లీజుకు ఇస్తే.. సుధీర్ఘకాలం న్యాయస్థానాల్లో పోరాడిన తర్వాత అది ప్రభుత్వ భూమిగా తేలిందని పేర్కొన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు దీనిపై స్పష్టమైన తీర్పులు ఇచ్చాయని గుర్తు చేశారు. ఏపీ మంత్రి లోకేశ్‌ను కలిస్తే తప్పేంటని కేటీఆర్‌ ప్రశ్నిస్తున్నారని, తప్పు అని తానూ అనలేదని రేవంత్‌ తెలిపారు. తాను చంద్రబాబును పగటిపూట కలిస్తేనే తప్పు అన్నప్పుడు.. కేటీఆర్‌ రాత్రిపూట లోకేశ్‌ను ఎందుకు కలిశారని మాత్రమే అడిగానని చెప్పారు. ఆర్డినెన్స్‌పై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. అందుకు పతిపక్ష నేత రావాలి కదా? అని రేవంత్‌ వ్యాఖ్యానించారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో సమావేశం జరిగినప్పుడు ప్రతిపక్ష నేతను పిలిచినా రాలేదని గుర్తు చేశారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై స్పీకర్‌ను సుప్రీంకోర్టు అడ్వైజ్‌ మాత్రమే చేయొచ్చని, ఆర్డర్‌ ఇవ్వలేదని అభిప్రాయపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్

రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 24 , 2025 | 01:48 AM