Fee Hike: ఇంజినీరింగ్ ఫీజు పెంపు పిటిషన్లు చీఫ్ జస్టిస్ బెంచ్‌కు బదిలీ
ABN , Publish Date - Jul 15 , 2025 | 05:44 AM
ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపు అంశంపై దాఖలైన పిటిషన్యలను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఏకసభ్య ధర్మాసనం ఆదేశించింది.

హైదరాబాద్, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపు అంశంపై దాఖలైన పిటిషన్యలను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఏకసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఇంతకుముందు ఫీజుల పెంపుపై రెండు ఏకసభ్య ధర్మాసనాలు పరస్పర విరుద్ధ ఉత్తర్వులు ఇచ్చాయి. ఫీజు తక్షణ పెంపునకు ఒక ధర్మాసనం అనుమతి ఇచ్చింది. మరొకటి మాత్రం సత్వర ఉపశమనానికి నిరాకరించింది. ఆరు వారాల్లో ఫీజులను నిర్ణయించాలని తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టిఎఎ్‌ఫఆర్ సి)ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ కాలేజీల ఫీజు పెంపు పిటిషన్లపై తాను విచారణ చేపట్టడం సమంజసం కాదని జస్టిస్ బీ విజయ్ సేన్‌రెడ్డి తెలిపారు.
ఫీజు పెంపు పిటషన్లను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ఉంచాలని ఆదేశించారు. అవంతి ఇంజనీరింగ్ కాలేజీ తదితర కాలేజీలు ఈ పిటిషన్‌లు దాఖలు చేశాయి. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఫీజు పెంపునకు అనుమతిస్తూ సీబీఐటీకి ఇదే కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, దీనిపై రివ్యూ పిటిషన్ వేస్తామని తెలిపారు. మరో న్యాయమూర్తి వద్ద పలు కాలేజీలు పిటిషన్లు దాఖలు చేయగా, తక్షణ పెంపును నిరాకరిస్తూ సమగ్ర ఉత్తర్వులు జారీ చేశారని వెల్లడించారు. అందువల్ల తాజాగా దాఖలైన పిటిషన్లపై తాను వాదనలు వినడం సరికాదని జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి తెలిపారు.