Nagar Kurnool: ఆ గిరిజనం మొత్తం అడవిని వీడాల్సిందే..
ABN , Publish Date - Jul 16 , 2025 | 11:15 AM
నాగర్ కర్నూల్ జిల్లా, అమ్రాబాద్ పులుల అభయారణ్యం లోని చెంచుపెంటలు, గ్రామాల తరలింపునకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. స్వచ్ఛంద పునరా వాసం కోరుకుంటున్న 1,088 కుటుంబాలను మైదాన ప్రాంతాలకు తరలించేందుకు ఎన్‌టీసీఏ (నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) ఆమోదం తెలిపింది.

- నల్లమల నుంచి 5 గ్రామాల తరలింపు
- మైదాన ప్రాంతాలకు వెయ్యికి పైగా కుటుంబాలు
- ఆమోదించిన నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ
- మెరుగైన వసతులు కల్పిస్తామంటున్న అటవీ శాఖ
- పునరావాసానికి 90 శాతం గ్రామస్థుల అంగీకారం
దోమలపెంట(జోగులాంబ గద్వాల): నాగర్ కర్నూల్(Nagar Kurnool) జిల్లా, అమ్రాబాద్ పులుల అభయారణ్యం లోని చెంచుపెంటలు, గ్రామాల తరలింపునకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. స్వచ్ఛంద పునరా వాసం కోరుకుంటున్న 1,088 కుటుంబాలను మైదాన ప్రాంతాలకు తరలించేందుకు ఎన్‌టీసీఏ (నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) ఆమోదం తెలిపింది. ప్రభుత్వ పరంగా, అటవీశాఖ నుంచి అందే ప్రయోజ నాలు, లాభ నష్టాలపై ఒక అంచనాకు వచ్చాకే వారు మైదాన ప్రాంతాలకు తరలివెళ్లేందుకు ముందుకు వచ్చారు. ఆయా కుటుంబాలకు కొల్లాపూర్ నియోజక వర్గంలోని పెద్దకొత్తపల్లి మండలం, బాచారం గ్రామం లో మెరుగైన వసతులతో 250 గజాల స్థలంలో రెం డు పడకల ఇల్లు, సాగుయోగ్యమైన 5 ఎకరాల భూ మిని ఇచ్చేందుకు అటవీశాఖ అంగీకరించింది. దీంతో చెంచు పెంటలు, గ్రామాలకు చెందిన ప్రజలు అడవిని వీడేందుకు సిద్ధమయ్యారు.
ఎంవోఈఎఫ్‌సీసీ నివేదిక తర్వాతే..
నల్లమల గ్రామాల తరలింపునకు అవసరమైన 1,501 హెక్టార్ల భూమిని రెవెన్యూ శాఖకు బదలా యించేందుకు, పునరావాసం కోరుకుంటున్న కుటుం బాలకు మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్ర అటవీ శాఖ అమోదం తెలపాల్సి ఉంటుంది. అందు కోసం నిజనిర్ధారణకు మే నెల మొదటి వారంలో బెంగళూరు నుంచి ముగ్గురు సభ్యుల బృందం ఎంవోఈఎఫ్‌సీసీ (మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ ఫారె స్టు క్లైమెట్ చేంజ్) వటువర్లపల్లి, కుడిచింతలబైలు, సార్లపల్లి గ్రామాల్లో పర్యటించింది. స్థానికులతో మాట్లాడి వారి స్థితిగతులను అంచనా వేసింది. పునరావాసం కోసం ఎంపిక చేసిన బాచారం గ్రామ సమీపంలోని అటవీ భూమిని కూడా పరిశీలించి, ఎన్‌టీసీఏకు నివేదిక ఇచ్చింది. దీంతో మూడు గ్రామా లు, రెండు చెంచు పెంటల తరలింపునకు అమోదం లభించినట్లు అటవీశాఖ అధికారులు చెప్తున్నారు.
లబ్ధిదారుల గుర్తింపు పూర్తి
సార్లపల్లి గ్రామ పంచాయతీలో 417 మంది లబ్ధిదారులున్నారు. వారిలో ఆప్షన్-1 160, ఆప్షన్-2 257 మంది ఉన్నారు. ఆప్షన్-1లో బీసీ, 112, వోసీ, 6, ఎస్‌సీ 32, ఎస్‌టీ 10 కుటుంబాలున్నాయి. ఆప్షన్-2లో బీసీ 127, వోసీ 4, ఎస్‌ఈ 29, ఎస్‌టీ 97 కుటుంబాలున్నాయి. ఫేజ్-2లోని వటువర్లపల్లిలో 671 మంది లబ్ధిదారులను గుర్తించారు. వారిలో ఆప్ష న్-1 311, ఆప్షన్-2 360 కుటుంబాలున్నాయి. ఆప్ష న్-2 కోరుకున్న వారిలో బీసీ 107, వోసీ 9, ఎస్‌సీ 114, ఎస్‌టీలు 81, ఆప్షన్-2లో బీసీలు 110, వోసీ 6, ఎస్‌సీ 141, ఎస్‌టీ 103 కుటుంబాలున్నాయి. మొత్తం గా ఆప్షన్-1 471 కుటుంబాలు, ఆప్షన్-2 617, మొ త్తం 1,088 కుటుంబాలను అధికారులు గుర్తించారు.
సందిగ్ధంలో మరికొందరు..
అటవీశాఖ అధికారులు చెప్తున్నట్లుగా పునరావాస కేంద్రంలో అన్ని వసతులు కల్పిస్తారా? ఇక్కడి నుంచి తరలించాక చేతులు దులుపుకుంటారా? అని కొంద రు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వృద్ధులు సందిగ్ధంలో ఉన్నారు. ముందు వెళ్లే వారికి కల్పించే వసతులు, వారికి ప్రభుత్వం నుంచి అందే సహకారాన్ని పరిశీలించిన తర్వాతే అడవిని వీడాలని వారు భావిస్తున్నారు. పుట్టి, పెరిగిన ప్రాంతాన్ని వీడి, మరో చోటికి తరలిస్తే బతకలేమని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎలివేటెడ్ కారిడార్ రోడ్డు వస్తే..
శ్రీశైలం - హైదరాబాద్ ప్రధాన రహదారి విస్తర ణకు అనుమతించని అటవీశాఖ, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి మాత్రం అంగీకారం తెలిపింది. అందులో భాగంగా అచ్చంపేట మండలంలోని బ్రాహ్మణపల్లి నుంచి శ్రీశైలం వరకు 57 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించాలని, అందుకు అవసరమైన రూ. 7,700 కోట్లను సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో కేంద్రం అంగీకరించినట్లు ఇటీవల కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీ వెల్లడించారు. ఈ కారిడార్ నిర్మాణం పూర్తయితే మన్ననూర్, వటువర్లపల్లి, దోమలపెంట గ్రామాల్లో వ్యాపారాలు నిర్వహించుకునే అవకాశం ఉండదని స్థానికులు భావిస్తున్నారు. దీంతో కొందరు సమీప పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు, ప్లాట్లు కొనుగోలు చేసుకుంటున్నారు.
దేశంలోనే మొదటి సారి...
అమ్రాబాద్ అభయారణ్యం పరిధిలోని గ్రామాలు, చెంచు పెంటలకు చెందిన 1,088 కుటుంబాలను మైదాన ప్రాంతాలకు తరలించడం దేశంలోనే మొదటిసారి అని అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులను కూడా కుటుంబాలుగా పరిగణిస్తున్నారు. యువకులకు ఇష్ట మైన ఆప్షన్‌ను ఎంచుకొనే అవకాశం ఉంటుంది. యువతులకు మాత్రం ఆప్షన్-1 మాత్రమే వర్తింప చేయనున్నారు. ఈ పద్ధతిలో పునరావాసానికి సంబంధించి, ఫెజ్ - 1లో సార్లపల్లి, కుడిచింతలబైలు, తాటిగుండాల, కొల్లంపెంట నుంచి ఆప్షన్-1 కోరుకునేవారికి రూ. 15 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేసి ఇవ్వనున్నారు. ఆప్షన్-2కు అంగీకరించిన వారికి ఐదు ఎకరాల వ్యవసాయ భూమి, 250 చదరపు గజాల స్థలంలో రెండు పడుకల ఇంటిని నిర్మించి ఇవ్వనున్నారు. దీంతో పాటు అన్ని రకాల మౌలిక వసతులతో కాలనీ నిర్మించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
అంతర్జాతీయ కెమిస్ర్టీ ఒలింపియాడ్‌లో నారాయణ విద్యార్థికి పతకం
Read Latest Telangana News and National News