Osmania Hospital: 17 ఏళ్ల యువకుడికి కాలేయ మార్పిడి
ABN , Publish Date - Apr 18 , 2025 | 04:22 AM
చిన్నప్పటి నుంచి అరుదైన కాలేయ వ్యాధితోపాటు ఊపిరితిత్తులు, ఇతర సమస్యలతో బాధపడుతున్న యువకుడికి ఉస్మానియా వైద్యులు 18 గంటలపాటు శ్రమించి పునర్జన్మ ప్రసాదించారు.

18 గంటలపాటు శ్రమించిన ఉస్మానియా వైద్యులు
సగం కాలేయం దానం చేసిన కన్నతల్లి
అఫ్జల్‌గంజ్/మంగళ్‌హాట్, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): చిన్నప్పటి నుంచి అరుదైన కాలేయ వ్యాధితోపాటు ఊపిరితిత్తులు, ఇతర సమస్యలతో బాధపడుతున్న యువకుడికి ఉస్మానియా వైద్యులు 18 గంటలపాటు శ్రమించి పునర్జన్మ ప్రసాదించారు. ఉస్మానియా గ్యాస్ర్టో ఎంటరాలజీ విభాగం వైద్యులు యువకుడి తల్లి నుంచి 60ు సేకరించిన కాలేయాన్ని బాలుడికి అమర్చి కాపాడారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో అయితే ఈ తరహా శస్త్రచికిత్సకు సుమారు రూ.కోటి వరకు ఖర్చు అవుతుందని, అలాంటిది ముఖ్యమంత్రి సహాయనిధి సహకారంతో విజయవంతంగా నిర్వహించామని ఉస్మానియా వైద్యులు తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్యాస్ర్టోఎంటరాలజీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ మధుసూదన్, సూపరింటెండెంట్ రాకేశ్ సహాయ్‌తో కలిసి వివరాలను వెల్లడించారు.
మచిలీపట్నానికి చెందిన యువకుడు నెలరోజుల క్రితం తమను సంప్రదించాడని, అడ్మిట్ చేసుకుని జనరల్ సర్జరీ, నెఫ్రాలజీ, యురాలజీ, అనస్తీషియా విభాగాల సలహాలు తీసుకున్నట్లు వెల్లడించారు. యువకుడి తల్లి నుంచి కాలేయాన్ని సేకరించి అమర్చామన్నారు. 18 గంటలపాటు శ్రమించినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం తల్లీ కుమారుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కోసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం తల్లీకుమారులను శాలువా, పూలమాలలతో సత్కరించారు.