Share News

Opal Suchata: సుందరి నీ వంటి..

ABN , Publish Date - Jun 01 , 2025 | 03:22 AM

థాయ్‌లాండ్‌కు చెందిన సుచాత షుంగ్‌సిరి మిస్‌ వరల్డ్‌ 2025 కిరీటాన్ని సొంతం చేసుకోగా.. ఆఫ్రికాలోని ఇథియోపియాకు చెందిన హస్సెట్‌ దెరెజ్‌ రన్నర్‌పగా నిలిచారు.

Opal Suchata: సుందరి నీ వంటి..

టాప్‌-4లోని అందగత్తెలు నలుగురూ నలుగురే

  • బాలల విద్య, మహిళల సాధికారతకు సుచాత కృషి.. బాలికల జీవితాల్లో మార్పే ఇథియోపియా సుందరి కల

  • సౌందర్యమంటే ఆలోచనలు, ఆచరణ అనే మాజా క్లాజ్డా.. చిన్న ద్వీపాల గొప్పతనం చాటాలనే తపనతో ఆర్లీ

హైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): థాయ్‌లాండ్‌కు చెందిన సుచాత షుంగ్‌సిరి మిస్‌ వరల్డ్‌ 2025 కిరీటాన్ని సొంతం చేసుకోగా.. ఆఫ్రికాలోని ఇథియోపియాకు చెందిన హస్సెట్‌ దెరెజ్‌ రన్నర్‌పగా నిలిచారు. ఐరోపాలోని పోలాండ్‌కు చెందిన మాజా క్లాజ్డా రెండో రన్నర్‌పగా, ఉత్తర అమెరికా ఖండానికి చెందిన ఆర్లీ జోకిమ్‌ మూడో రన్నర్‌పగా నిలిచారు. ఈ విజేతల నేపథ్యాలివి..


5 అడుగుల 11 అంగుళాల అందం ఓపల్‌

మిస్‌ వరల్డ్‌ సుచాత షుంగ్‌సిరి ముద్దు పేరు ‘ఓపల్‌’. థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో 2003లో జన్మించిన సుచాత.. ఎత్తు 5 అడుగుల 11 అంగుళాలు. తనే ఎత్తే తన ప్రత్యేకత అని ఓపల్‌ అంటుంటారు. చిన్నతనం నుంచే డ్యాన్స్‌, మ్యూజిక్‌, మోడలింగ్‌పై ఆమెకు ఆసక్తి ఎక్కువ. ఓపల్‌కు థాయ్‌తోపాటు ఆంగ్లంలో మంచి ప్రావీణ్యం ఉంది. అద్భుతమైన కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఆమె సొంతం. ప్రతిభ, పట్టుదల, సమాజానికి సేవ చేయాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమని చెప్పే సుచాతకు సామాజిక సేవపై ఆసక్తి ఎక్కువ. బాలల విద్య, మహిళల సాధికారత కోసం ప్రధానంగా కృషి చేస్తుంటారు. మోడలింగ్‌ రంగంలోకి ప్రవేశించి, అంతర్జాతీయ సంబంధాలపై అధ్యయనం చేస్తున్నారు. వాయిస్‌ ఫర్‌ చేంజ్‌ సిల్వర్‌ అవార్డును గెలుచుకుని ప్రపంచానికి తన సామాజిక స్పృహ చాటారు. 2024లో మిస్‌ యూనివర్స్‌ థాయ్‌లాండ్‌ టైటిల్‌ గెలిచిన సుచాత.. ఆ తర్వా త మిస్‌ వరల్డ్‌ థాయ్‌లాండ్‌ 2025గా ఎంపికయ్యారు. ఓపల్‌మిస్‌ వరల్డ్‌ థాయ్‌లాండ్‌గా గెలిచి, మల్టీమీడియా ఛాలెంజ్‌లో విజయం సాధించి టాప్‌ 40లో స్థానం పొందారు. మిస్‌ వరల్డ్‌ వేదికపై థాయ్‌ సంప్రదాయాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రదర్శించారు. పోటీలోని టాలెంట్‌ సెగ్మెంట్‌, బ్యూటీ విత్‌ పర్పస్‌ ప్రాజెక్టు ద్వారా ఆమె న్యాయ నిర్ణేతల మనసు గెలుచుకున్నారు.


హస్సెట్‌ దెరెజ్‌ - ఇథియోపియా

మిస్‌ వరల్డ్‌ 2025లో రన్నర్‌పగా నిలిచిన హస్సెట్‌ దెరెజ్‌ ఇథియోపియాకు చెందిన మోడల్‌, సామాజిక కార్యకర్త. తమ దేశ సంప్రదాయాలను గర్వంగా ప్రపంచానికి చూపించడంలో ఆమె అదరగొట్టారు. బాల్యంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ, చదువుపై ఆసక్తి, సేవ మార్గంలో నిబద్థతతో ఎదిగారు. మహిళల హక్కులు, బాలికల విద్య, వాతావరణ పరిరక్షణ వంటి అంశాల్లో సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మిస్‌ వరల్డ్‌ వేదికపై ఆమె చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. తన బ్లూ హోప్‌- క్లీనింగ్‌ వాటర్‌ ప్రాజెక్ట్‌ ఆమె విజయంలో కీలకపాత్ర పోషించింది. ఆమెకు టాప్‌-4లో స్థానం దక్కేలా చేసింది.


మాజా క్లాజ్డా - పోలాండ్‌

పోలాండ్‌లోని లెంచ్నా అనే చిన్న పట్టణానికి చెందిన మాజా క్లాజ్డా.. మిస్‌ వరల్డ్‌ పోలాండ్‌ 2025 టైటిల్‌ను గెలుచుకొని అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించారు. చిన్నతనం నుంచే మోడలింగ్‌, డ్యాన్స్‌, సామాజిక సేవపై ఆమె కు ఆసక్తి. కమ్యూనికేషన్‌ అండ్‌ మీడియా స్టడీ్‌సలో డిగ్రీ పొందిన మాజా.. వృద్థుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహించే సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ‘మిస్‌ పొలోనియా’ పోటీ ద్వారా మిస్‌ వరల్డ్‌ 2025కు ఎంపికయ్యారు. తన అందం, మేధస్సు, తమ సంస్కృతిని మిస్‌ వరల్డ్‌ వేదికపై చూపడం ద్వారా ఆమె టాప్‌-4లో చోటు దక్కించుకున్నారు.సౌందర్యమనేది ఒక రూపం కాదని, అది మన ఆలోచనలు, మన ఆచరణ అనే భావనతో ఆమె ఈ పోటీల్లో పాల్గొన్నారు.


ఆర్లీ జోకిమ్‌- మార్టినిక్‌ (ఉత్తర అమెరికా)

ఉత్తర అమెరికాలోని మార్టినిక్‌ అనే చిన్న ద్వీపదేశానికి చెందిన ఆర్లీ జోకిమ్‌కు చిన్నతనం నుంచే డ్యాన్స్‌, సంగీతం, సమాజ సేవ అంటే ఇష్టం. తమ దేశంలోని విశ్వవిద్యాలయంలో పబ్లిక్‌ హెల్త్‌ విభాగంలో చదువుతున ఆర్లీ.. మిస్‌ వరల్డ్‌ పోటీకి ఎంపికయ్యాక తన బ్యూటీ విత్‌ పర్పస్‌ ప్రాజెక్ట్‌ (దీవులోని గ్రామాల్లో యువతకు వృత్తిపరమైన శిక్షణ) ద్వారా ఎంతోమందికి ప్రేరణగా మారారు. తన దేశ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడం, చిన్నద్వీపాల గొప్పతనాన్ని ప్రపంచానికి చూపాలన్న తపనతోనే ఆమె మిస్‌ వరల్డ్‌ పోటీలకు వచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..

Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..

TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..

Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 01 , 2025 | 03:22 AM