NTPC: కార్మికుడి కుటుంబానికి 1.34 కోట్ల పరిహారం
ABN , Publish Date - Jun 27 , 2025 | 03:35 AM
విధి నిర్వహణలో గుండెపోటుతో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి ఎన్‌టీపీసీ యాజమాన్యం రూ. 1.34 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించింది.

అందజేసిన ఎన్టీపీసీ.. 14 ఏళ్ల నాటి సమస్యకు పరిష్కారం
చిక్కడపల్లి, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో గుండెపోటుతో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి ఎన్‌టీపీసీ యాజమాన్యం రూ. 1.34 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించింది. కార్మికశాఖ కమిషనరేట్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ (ఏసీఎల్)-3 ప్రభావతి ఇందుకు సంబంధించిన చెక్కును ఉద్యోగి భార్య రేవతికి అందజేశారు. చాట్రగడ్డ ప్రభాకరరావు 1982 నుంచి ఎన్‌టీపీసీలో మెకానికల్ మెయింటెనెన్స్ విభాగంలో టెక్నీషియన్‌గా పనిచేస్తూ 2010లో గుండెపోటుతో చనిపోయారు. డ్యూటీలో ఉండగా చనిపోయినా నష్టపరిహారం ఇవ్వకపోవడంతో ఆయన భార్య రేవతి 2012లో కరీంనగర్ కార్మికశాఖలో కేసు వేశారు.
వాదోపవాదాలు తర్వాత 2024లో అప్పటి ఏసీఎల్ జాసన్ రేవతికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఆమెకు రూ.47,66,100 నష్టపరిహారం చెల్లించాలని, దానిపై 2010 మార్చి 6 నుంచి ఏడాదికి 12 శాతం వడ్డీ ఇవ్వాలని ఆదేశించారు. అసలు, వడ్డీ కలిపి రూ. 1,34,78,269లను ఏసీఎల్-3 ఖాతాలో ఈనెల 15న ఎన్‌టీపీసీ డిపాజిట్ చేసింది. దానినే చెక్కు రూపంలో అందజేశారని కేసు వాదించిన న్యాయవాది ఇంద్రసేన్‌రెడ్డి తెలిపారు.