MLC Kavitha Tweet Storm: కర్మ హిట్స్ బ్యాక్.. ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్..
ABN , Publish Date - Nov 14 , 2025 | 05:31 PM
ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్ చేశారు. కర్మ హిట్స్ బ్యాక్ అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ఎవరిని ఉద్దేశిస్తూ కవిత ఈ ట్వీట్ చేశారన్నది తెలియాల్సి ఉంది.
హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో వివాదాస్పద ట్వీట్ చేశారు. ఎక్స్ వేదికగా 'Karma hits back !!!' (కర్మ అనుభవించాల్సిందే) అంటూ సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుతం కవిత చేసిన ట్వీట్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్సీ కవిత ఎవరినీ ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారు?, ఆ ట్వీట్ వెనక ఆంతర్యం ఏంటి?, బీఆర్ఎస్ ఓటమిని ఉద్దేశిస్తూ ఆమె ఈ ట్వీట్ చేశారా? అనే చర్చ జరుగుతోంది. ఇటీవల మీడియా ముందుకు వచ్చి మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ సంతోష్ కుమార్ పై కవిత సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన కవిత.. జాగృతి జనం బాట కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అటు అధికార పార్టీతో పాటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను టార్గెట్ చేస్తూ కవిత విమర్శల దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు కవిత త్వరలో సొంత పార్టీ పెడతారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా జరిగిన ఉపఎన్నికలో తమ పార్టీ సిట్టింగ్ స్థానమైన జూబ్లీహిల్స్ గద్దెను బీఆర్ఎస్ కోల్పోయింది. దాదాపు 24 వేల ఓట్ల మెజారిటీ ఇచ్చి జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థికి పట్టం కట్టారు.
కలిసిరాని ఉపఎన్నికలు!
బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా చెప్పబడే హైదరాబాద్.. మెల్లిగా తన దిశను మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ లో అనివార్యం అయిన ఉపఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి కలిసిరావడం లేదనే చర్చ ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తోంది. గత ఏడాది బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉపఎన్నిక వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే ఆ ఉపఎన్నికలో బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీగణేష్ విజయం సాధించారు. తాజాగా మాగంటి గోపినాథ్ మృతితో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వస్తే.. ఈ ఉపఎన్నికలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు. తెలంగాణలో జరిగిన రెండు ఉపఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా.. రెండు సిట్టింగ్ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది.
ఇవి కూడా చదవండి..
ఎన్డీయే విజయోత్సాహం.. పార్టీ ప్రధానకార్యాలయానికి మోదీ
బిహార్‌లో గెలుపు మాదే.. ఇక బెంగాల్‌లోనూ..: కేంద్ర మంత్రి