Share News

Oath Ceremony: అధ్యక్షా..!

ABN , Publish Date - Apr 08 , 2025 | 03:49 AM

తెలంగాణ రాష్ట్రంలో కొద్దిరోజుల క్రితం జరిగిన ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌, ఎమ్మెల్యే కోటా శాసనమండలి ఎన్నికల్లో విజయం సాధించిన వారు సోమవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Oath Ceremony: అధ్యక్షా..!

  • నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం.. కాంగ్రెస్‌ నుంచి అద్దంకి దయాకర్‌, విజయశాంతి, శంకర్‌నాయక్‌

  • బీజేపీ ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమురయ్య

  • సీపీఐ నుంచి సత్యం, పీఆర్‌టీయూ శ్రీపాల్‌రెడ్డితో ప్రమాణం

  • చేయించిన చైర్మన్‌ సుఖేందర్‌రెడ్డి

  • హాజరైన కాంగ్రెస్‌, బీజేపీ ముఖ్య నేతలు, మంత్రులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో కొద్దిరోజుల క్రితం జరిగిన ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌, ఎమ్మెల్యే కోటా శాసనమండలి ఎన్నికల్లో విజయం సాధించిన వారు సోమవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. తొలుత బీజేపీ తరఫున ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికైన మల్క కొమురయ్య, పట్టభద్రులు ఎమ్మెల్సీగా ఎన్నికైన చిన్నమైల్‌ అంజిరెడ్డి, పీఆర్‌టీయూ తరఫున గెలుపొందిన పింగిళి శ్రీపాల్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్‌ తరఫున ఎన్నికైన అద్దంకి దయాకర్‌, ఎం.విజయశాంతి, కేతావత్‌ శంకర్‌నాయక్‌తోపాటు సీపీఐకి చెందిన నెల్లికంటి సత్యం ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాష్‌, ప్రభుత్వ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, తెలంగాణ లెజిస్లేచర్‌ సెక్రటరీ నరసింహాచార్యులు, మంత్రులు డి.శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి, ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, రఘువీర్‌రెడ్డి, బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, ఎంపీలు లక్ష్మణ్‌, రఘునందన్‌రావు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, బాలు నాయక్‌, మందుల సామేలు, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గుండు లక్ష్మణ్‌, పుల్గం దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షులు పేరి వెంకట్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


జీతంలో సగం పార్టీకి, ప్రజలకు: దయాకర్‌

పార్టీ కోసం పని చేసిన తనను గుర్తుంచుకొని ఏఐసీసీ, టీపీసీసీ కలిసి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాయని, అందరి ప్రోత్సాహంతో పెద్దల సభకు వెళ్లడం తనకు సంతోషం కలిగిస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య తాను వారధిలా ఉంటానన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని భావిస్తున్నానని, ఎమ్మెల్సీగా ప్రతి నెలా వచ్చే వేతనంలో 25 శాతాన్ని కాంగ్రెస్‌ పార్టీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. భవిష్యత్తులో మరో 25 శాతం వేతనాన్ని ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ సమాజానికి వెచ్చించే యోచనలో ఉన్నానని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ పార్టీ విస్మరించిందని, దీనిపై శాసనమండలిలో ప్రశ్నిస్తానని అన్నారు. విద్యాసంస్థలకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. హెచ్‌సీయూ భూములను అమ్మాలని ప్రభుత్వం చూస్తోందని, వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. విద్యార్థులపై లాఠీచార్జ్‌ చేయడం దుర్మార్గమని, వారిపై పెట్టిన కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల పెండింగ్‌ బిల్లులు, విద్యావ్యవస్థకు సంబంధించిన సమస్యలపై పోరాటం చేస్తానని మరో ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అన్నారు.


ఉపాధ్యాయుల గొంతుకనవుతా: శ్రీపాల్‌రెడ్డి

శాసనమండలిలో విద్యారంగ సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ఉపాధ్యాయుల గొంతుకనవుతానని పీఆర్టీయూ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం సీపీఎ్‌సను రద్దు చేసేలా పోరాడతానని, ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు ఆరోగ్య భద్రత కార్డులు ఇప్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. దీంతోపాటు ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసు నిబంధనలు రూపొందించేందుకు, అన్నిరకాల గురుకుల, మోడల్‌, ఎయిడెడ్‌ పాఠశాలల ఉపాధ్యాయులకు 010 పద్దు కింద వేతనాలు ఇప్పించేందుకు పోరాడతానన్నారు. ఎస్‌ఎ్‌సఏ, కేజీబీవీ, ఆశ్రమ, సింగరేణి పాఠశాలల ఉపాధ్యాయునులకు మినిమమ్‌ టైం స్కేలు ఇప్పించేందుకు, మిగిలిపోయిన పండిట్‌, పీఈటీ, అప్‌గ్రేడేషన్‌ ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇప్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అభయాంజనేయస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్

దొంగల్లా సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళుతున్నారు..

మరో ఆరుగురికి నోటీసులు.. విచారణ...

For More AP News and Telugu News

Updated Date - Apr 08 , 2025 | 03:49 AM