Polygenic Risk Score Obesity: ఊబకాయాన్ని పసిగట్టే జన్యు పరీక్ష
ABN , Publish Date - Jul 23 , 2025 | 05:00 AM
పెద్దయ్యాక ఊబకాయం వచ్చే ముప్పు ఉన్నదీ లేనిదీ గుర్తించే పాలీజెనిక్ రిస్క్ స్కోర్..

పెద్దయ్యాక స్థూలకాయం బారిన పడే ప్రమాదం ఉన్నదీ లేనిదీ చిన్నప్పుడే చెప్పే పాలీజెనిక్ రిస్క్ స్కోర్
జీవనశైలి మార్పులతో ఆ ముప్పును తప్పించుకునే వీలు
మన భారతీయుల జన్యువులపై సీసీఎంబీ పరిశోధనలు
హైదరాబాద్ సిటీ, జూలై 22: పెద్దయ్యాక ఊబకాయం వచ్చే ముప్పు ఉన్నదీ లేనిదీ గుర్తించే ‘పాలీజెనిక్ రిస్క్ స్కోర్ (పీఆర్‌ఎస్)’ అనే జన్యుపరీక్షను అభివృద్ధి చేసే క్రతువులో.. మన హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) పరిశోధకులు పాలుపంచుకున్నారు. జన్యుపరంగా ఒక వ్యక్తి ఊబకాయం బారిన పడే ప్రమాదం ఉంటే.. చిన్నవయసులోనే ఆ ముప్పును ఈ పరీక్ష ద్వారా గుర్తించి, వారు ఆ సమస్య నుంచి తప్పించుకునే విధంగా జీవనశైలి మార్పులతో కూడిన వ్యూహాలు రూపొందించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అంతర్జాతీయ ఒబేసిటీ ఫెడరేషన్ అంచనాల ప్రకారం 2035 నాటికి ప్రపంచంలో సగానికి పైగా వ్యక్తులు అధిక బరువు సమస్యతో బాధపడనున్నారు. వారిని ఊబకాయం బారిన పడకుండా అడ్డుకోగలిగితే? అనే ఆలోచనతో.. అంతర్జాతీయంగా 500కు పైగా సంస్థలకు చెందిన 600 మందికి పైగా పరిశోఽధకులు.. జెయింట్ కన్సార్షియం, కన్స్యూమర్ డీఎన్‌ఏ టెస్టింగ్ సంస్ధ 23 అండ్ మీ సహా పలు సంస్ధల నుంచి 50 లక్షల మందికిపైగా జన్యు పరమైన వివరాలను సేకరించి తమ పరిశోధనలను కొనసాగించారు. ఈ క్రమంలోనే మన సీసీఎంబీ పరిశోధకులు భారతీయుల జన్యు సమాచారంపై పరిశోధనలు చేశారు. ఆ సమాచారం మొత్తాన్నీ క్రోడీకరించి పీఆర్‌ఎస్ టెస్ట్‌ను అభివృద్ధి చేశారు. గతంలో ఉన్న పరీక్షలన్నిటికంటే ఇది ప్రభావవంతమైన పరీక్ష అని యూనివర్సిటీ ఆఫ్ కోపెన్‌హాగన్‌లో ఎన్‌ఎన్‌ఎ్‌ఫ సెంటర్ ఫర్ బేసిక్ మెటబాలిక్ రిసెర్చ్‌కు (సీబీఎంఆర్) చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ స్మిత్ తెలిపారు.
యూరోపియన్లతో పోలిస్తే మనం భిన్నం...
యూరోపియన్ దేశాలతో పోలిస్తే.. భారతీయులకు సంబంధించి నాన్ కమ్యూనికబల్ (మధుమేహం, అధికరక్తపోటు వంటి అసాంక్రమిక) వ్యాధులపరంగా జన్యు నిర్మాణం వైవిధ్యంగా ఉంటుందని సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ గిరిరాజ్ రతన్ చందక్ తెలిపారు. మనదేశంతో పాటు దక్షిణాసియా దేశాలలో ఊబకాయం అతి పెద్ద సమస్యగా పరిణమిస్తోందని ఆయన చెప్పారు. యూరోపియన్ దేశాలకు చెందినవారితోతో పోలిస్తే మన దేశంలో ఊబకాయం వైవిధ్యంగా ఉంటుందని.. భారతీయులలో అది ఎక్కువగా పొట్ట కేంద్రంగా ఉంటుందని వివరించారు. తమ అధ్యయనంలో భాగంగా భారతీయుల నమూనాల నుంచి సేకరించిన సమాచారం దక్షిణాసియా ప్రజలకు దగ్గరగా ఉన్నట్లు తెలిపారు.
పూర్తి నివారణ సాధ్యమేనా?
ఓ వ్యక్తి జన్యువుల ఆధారంగా ఊబకాయపు ప్రమాదాన్ని అంచనా వేసి.. పోషకాహారం తీసుకోవడం, కసరత్తులు చేయడం, తగినంత నిద్ర పోవడం వంటి జీవనశైలి మార్పులను చేసుకోవడం ద్వారా ఆ ముప్పును అడ్డుకోవచ్చని సీసీఎంబీ పరిశోధకులు తెలిపారు. కానీ.. అలా తగ్గినవారు.. వ్యాయామాలు మానేసి, ఇష్టం వచ్చినట్టు తింటూ, కంటినిండా నిద్ర పోకపోతే మళ్లీ వేగంగా బరువు పెరిగే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి