Irrigation Projects: జలాశయాల నిర్వహణలో అలసత్వం!
ABN , Publish Date - Jul 28 , 2025 | 03:49 AM
రాష్ట్రవ్యాప్తంగా పలు సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ లోపభూయిష్ఠంగా మారింది. నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల వంటి ప్రధాన ప్రాజెక్టులకూ అవసరమైన మరమ్మతులు సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారు.

అరకొర పనులతో మమ అనిపిస్తున్న వైనం
ప్రాజెక్టుల నిర్వహణ లోపభూయిష్ఠం
కీలక ప్రాజెక్టుల విషయంలోనూ నిర్లక్ష్యం
సకాలంలో మరమ్మతులు చేయని యంత్రాంగం
సాగర్ స్పిల్‌వేకు ఈ ఏడాది మరమ్మతులు లేనట్లే
జూరాల ప్రాజెక్టులో తెగిన గేట్ల రోప్‌లు
శ్రీశైలం గేట్లను ఐదేళ్లలో మార్చాలన్న నిపుణులు ‘డిండి, శాలిగౌరారం’ నిర్వహణా అంతంతే
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): రాష్ట్రవ్యాప్తంగా పలు సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ లోపభూయిష్ఠంగా మారింది. నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల వంటి ప్రధాన ప్రాజెక్టులకూ అవసరమైన మరమ్మతులు సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారు. కొన్నిసార్లు రూ.కోట్లు వెచ్చించి మరమ్మతులు చేసినా.. ఉపయోగం లేకుండా పోతోంది. మరికొన్ని సార్లు అరకొర పనులతో మమ అనిపించేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు 66 క్రస్టు గేట్లు ఉండగా.. 2022లో రూ.11 కోట్లతో గేట్ల మరమ్మతుల కోసం టెండర్లు పిలిచారు. 2023లో కొంతమేరకు పనులు చేశారు. అవి వేగంగా పూర్తి కాకపోవడం వల్ల ఇటీవల 8 గేట్లకు సంబంధించిన రోప్‌లు తెగిపోయాయి. ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా శ్రీశైలం ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను మార్చాల్సిందేనని నిపుణుడు కన్నయ్య నాయుడు స్పష్టం చేశారు. లేదంటే శ్రీశైలానికీ తుంగభద్ర పరిస్థితే ఉత్పన్నమవుతుందని హెచ్చరించారు. గత ఏడాది తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఐదేళ్లలో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను మార్చకపోతే తుంగభద్ర లాంటి పరిస్థితే ఉత్పన్నమయ్యే ముప్పు ఉందని కన్నయ్యనాయుడు హెచ్చరించడం గమనార్హం. ఇక కృష్ణా నదిపై మరో ప్రధాన ప్రాజెక్టు అయిన నాగార్జున సాగర్ స్పిల్‌వేకు కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడం లేదు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రాజెక్టుల స్థితిగతులపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.. తెలుగు రాష్ట్రాల్లో 22 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు లక్షలాది గ్రామాలకు తాగునీరు అందిస్తున్న ప్రాజెక్టు నాగార్జునసాగర్. దీని స్పిల్‌వే మరమ్మతులు ఈ ఏడాది లేనట్లే.
1967లో నిర్మాణం పూర్తయిన ఈ ప్రాజెక్టు స్పిల్‌వేకు ఇప్పటి వరకు నాలుగుసార్లు మరమ్మతులు చేశారు. చివరిసారిగా 2023లో రూ.20 కోట్లతో మరమ్మతులు చేశారు. కానీ, 2024లో స్పిల్‌వేపై మళ్లీ భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సాగర్ స్పిల్‌వేకు ఆధునిక పరిజ్ఞానంతో శాశ్వత మరమ్మతులు చేపట్టాలని తలపెట్టారు. స్పిల్‌వే వద్ద కదిలే క్రేన్‌ను ఏర్పాటు చేస్తే మరమ్మతులు చేయడం సులభమవుతుందని, ఆ దిశగా చర్యలు తీసుకుంటామని ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన సమీక్షలో తెలిపారు. కానీ, ఇప్పటికీ ఆ పనులు ప్రారంభమవలేదు. గత నెలలో ఢిల్లీకి చెందిన నిపుణుల బృందం ఓ ప్రైవేట్ కంపెనీ ప్రతినిధులతో కలిసి సాగర్ స్పిల్‌వేను పరిశీలించి వెళ్లింది. నిధులు కేటాయించగానే తొలుత ఒక గేటు స్పిల్‌వేకు మరమ్మతులు చేసి, ఈ ఏడాది వరదల్ని తట్టుకుంటే మిగిలిన అన్ని స్పిల్‌వేలకూ అదే పరిజ్ఞానంతో మరమ్మతులు చేస్తామని తెలిపారు. ఆ దిశగా ఇంకా ఎలాంటి అడుగులూ పడలేదు. ప్రస్తుతం సాగర్‌కు వరద మొదలైంది. అంటే ఈ ఏడాది స్పిల్‌వే మరమ్మతులు లేనట్లే. అయితే, క్రస్ట్ గేట్లకు సర్వీసింగ్ పూర్తి చేశారు. ఏటా జూన్‌లో క్రస్ట్ గేట్లకు రబ్బరు సీళ్లను సరిచేయడం, గేట్లను ఎత్తడానికి ఉపయోగించే రోప్‌లకు గ్రీజింగ్ చేయడం, మోటార్ల సర్వీసింగ్ వంటి పనులు చేపడతారు. ఈ పనులను గత నెల 20 కల్లా పూర్తి చేసినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
శాలిగౌరారం ప్రాజెక్టుపై పట్టింపే లేదు
నల్లగొండ జిల్లాలో 6 వేల ఎకరాలకు సాగునీరు, 50 గ్రామాల్లో భూగర్భజలాల పెంపునకు దోహదపడే శాలిగౌరారం ప్రాజెక్టు నిర్వహణపై అధికారులు కనీసం దృష్టి సారించడం లేదు. ఈ ప్రాజెక్టు షట్టర్లు శిథిలమై దశాబ్దం గడిచిపోయినా వాటిని మార్చే ప్రతిపాదనలకు మోక్షం కలగడం లేదు. ఈ ప్రాజెక్టు ప్రధాన కుడికాల్వ తూముకు నాలుగు షట్టర్లు ఉండగా, ఒకటి మాత్రమే పనిచేస్తోంది. మిగిలిన మూడు శిథిలమవడంతో నీరు వృథాగా పోతోంది. ప్రధాన ఎడమకాల్వ తూముకు ఉన్న రెండు షట్టర్లలో ఒక్కటే పనిచేస్తోంది. ఇక్కడా నీరు వృథాగా పోతోంది.
డిండి ప్రాజెక్టుపై చిన్నచూపు
నల్లగొండ జిల్లాలో ప్రాచీన ప్రాజెక్టయిన డిండి నిర్వహణపై అధికారులు శీతకన్నేశారు. 2.4 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్‌కు మూడు షట్టర్లు ఉండగా, మధ్య షట్టర్ నుంచి నిరంతరాయంగా నీరు లీకవుతోంది. దానికి ఎలాంటి మరమ్మతులూ చేయలేదు. స్పిల్‌వే ముందు భాగంలో ఉన్న కంప చెట్లను తొలగించలేదు. కనీస నిర్వహణ లేకపోవడంతో నీటి లీకేజీలు ఎక్కువగా ఉంటున్నాయి.
జూరాల రోప్‌లు తెగిపాయె..!
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జూరాల, కోయిల్ సాగర్, రామన్‌పాడు, సరళా సాగర్ జలాశయాలు ఉన్నాయి. జూరాలకు 66 క్రస్టు గేట్లు ఉండగా.. ఈ ఏడాది 8 గేట్లకు సంబంధించిన రోప్స్ తెగిపోయాయి. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ రచ్చకు దారితీసింది. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రాజెక్టును పరిశీలించి, త్వరగా మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నిర్వహణ నిధులు సరిగా విడుదల కాలేదని, ఇప్పుడు అన్ని మరమ్మతులు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
కోయిల్‌సాగర్ రిజర్వాయర్ గేట్లకు రబ్బర్ సీళ్లు సరిగా లేవు. గ్రీజింగ్ కూడా సరిగా చేయడం లేదు. మొత్తం 13 గేట్లలో రెండు గేట్లు సరిగా పని చేయడం లేదు. డ్యాం లైటింగ్, విద్యుత్తు సరఫరా బాగానే ఉంది. గేట్లు ఎత్తిన సమయంలో తప్ప పర్యవేక్షణ ఉండడం లేదు. ఏటా నిర్వహణకు రూ.3 లక్షలు కేటాయిస్తే, మొత్తం ఖర్చు చేస్తున్నారు.
రామన్‌పాడు ప్రాజెక్టు గేట్ల రబ్బర్ సీల్స్ సరి చేయలేదు. రోపులకు గ్రీజింగ్ కూడా చేయలేదు. రెండు వైపులా ఉండే స్లూయిజ్ గేట్లకు సర్వీసింగ్ లేక లీకేజీలు అవుతున్నాయి. మరమ్మతులకు రూ.4 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారు.
దిగువ మానేరు పరిస్థితి ఇదీ..
కరీంనగర్ సమీపంలోని దిగువ మానేరు జలాశయాని (ఎల్‌ఎండీ)కి 20 గేట్లు ఉన్నాయి. ప్రస్తుతం గ్రీజింగ్ చేశారు. మోటర్లకు సర్వీసింగ్ చేస్తున్నారు. 2022లో 10 గేట్లకు వైర్ రోప్‌లు కొత్తవి వేశారు. మరో 10 గేట్లకు రోప్‌లు మార్చేందుకు రూ.4 కోట్లు అవసరమని అధికారులు అంచనాలు పంపించారు. ఎల్‌ఎండీకి రివర్స్ స్లూయిజ్ గేటు కుడివైపు మాత్రమే ఉంది. డ్యాం డెడ్ స్టోరేజీకి చేరుకుంటే కానీ వాటిని సర్వీసింగ్ చేసేందుకు వీలుండదు.
మిడ్‌మానేరు ప్రాజెక్టు గేట్లకు రబ్బర్ సీళ్లు సరిగానే ఉన్నాయి. ఎప్పటికప్పుడు గ్రీజింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు స్పిల్‌వేలో ఎలాంటి గుంతలు పడలేదు. ఇల్లంతకుంట మండలం అనంతగిరి సమీపంలో 3.5 టీఎంసీల సామర్థ్యంతో అన్నపూర్ణ రిజర్వాయర్ ఉంది. ఈ ప్రాజెక్టు నిర్వణహ బాధ్యతలను 15 ఏళ్ల పాటు మేఘా కంపెనీకి అప్పగించారు.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 20.175 టీఎంసీలు. ఏటా వార్షిక మరమ్మతులు చేపడుతున్నారు. ఎల్లంపల్లి బ్యారేజీకి 62 రేడియల్ గేట్లను అమర్చారు. ఏటా గేట్ల మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రభుత్వం రూ.38.50 లక్షలు విడుదల చేసింది. నెల రోజులుగా గ్రీజింగ్, ఆయిల్ టాపప్, ఫ్లడ్ అప్ గేట్లు, గ్యాలరీలను శుభ్రం చేయడం, జనరేటర్ నిర్వహణ పనులు కొనసాగుతున్నాయి. మధ్యమధ్యలో వరదలను బట్టి కూడా పనులు జరుగుతాయని నీటి పారుదల శాఖాధికారి తెలిపారు.
మంజీరా ప్రాజెక్టు ఓకే..
మంజీరా ప్రాజెక్టు వద్ద నీటి విడుదల సమయానికి క్రస్ట్ గేట్లకు రబ్బర్ సీళ్లు సరిచేస్తున్నారు. రోప్‌లకు గ్రీజింగ్ కూడా చేస్తున్నారు. మోటార్లను సర్వీసింగ్ చేశారు. స్పిల్‌వేపై గుంతలేమీ లేవు. రెండు వైపులా ఉండే స్లూయిజ్ గేట్లకు సర్వీసింగ్ చేస్తున్నారు. డ్యామ్ పైన విద్యుద్దీపాలు బాగానే ఉన్నాయి. డ్యామ్‌పై విద్యుత్తు సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేవు. జనరేటర్ కూడా ఉంది. మంజీరాకు రూ.8.5 లక్షలు కేటాయిస్తుండగా మొత్తం ఖర్చు చేస్తున్నారు.
పాలేరులో పనులు జరుగుతున్నాయ్..
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయ నీటి సామర్థ్యం 2.50 టీఎంసీలు. గత ఏడాది వచ్చిన వరదలతో ఎడమ కాలవ 132 కి.మీ. వద్ద యూటీ కూలింది. ప్రస్తుతం యూటీ పనులు జరుగుతున్నాయి. లైనింగ్ పనులు ప్రారంభం కాలేదు. ఎడమ కాలువకు నాయకన్‌గూడెం వద్ద అవుట్‌ఫాల్ గేటు ఒకటే పనిచేస్తోంది. మరో గేటు పనిచేయట్లేదు. పాలేరు వద్ద ఇన్‌ఫాల్ గేటు రబ్బర్లు అరిగి నీరు లీకవుతోంది. మినీ హైడల్ ప్రాజెక్టుకు మరమ్మతులు జరుగుతున్నాయి. ఏడాది కాలంగా సుమారు 15 మంది సిబ్బందికి పనిలేకున్నా వేతనాలు ఇస్తున్నారు. కాలువపై జంగిల్ క్లియరెన్సు చేయాల్సి ఉండగా కాంట్రాక్టర్ ముందుకు రాలేదు. పాలేరు పాత కాలువ పూడిక తీయకపోవడంతో చివరి భూములకు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
తాలిపేరులో ఐరన్ తుప్పు పడుతోంది..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నీటి సామర్థ్యం 0.75 టీఎంసీలు కాగా.. కుడి, ఎడమ కాలువల ద్వారా 24 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ప్రాజెక్టు నిర్మాణంలో వినియోగించిన ఐరన్ తుప్పు పడుతోంది. 1976లో ఈప్రాజెక్టు నిర్మించగా ఇప్పటిదాకా రంగులు కూడా వేయలేదు. ప్రాజెక్టు సబ్‌స్టేషన్ నుంచి ఉన్న విద్యుత్తు స్తంభాలు పడిపోవడంతో సరఫరాను నిలిపేశారు. తాత్కాలికంగా సత్యనారాయణపురం సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్తు సరఫరా జరుగుతోంది. ప్రాజెక్టు కింద 78 లైట్లు ఉండగా 40 మాత్రమే పనిచేస్తున్నాయి. మొత్తం 12 మంది పని చేయాల్సి ఉండగా.. ఆరుగురే ఉన్నారు. వరదలు వచ్చినప్పుడు మాత్రమే అధికారులు, సిబ్బంది ఉంటున్నారు తప్ప ఇతర సందర్భాల్లో ఎవరూ కనిపించడం లేదు. ప్రాజెక్టుకు 25 గేట్లు ఉండగా రెండేళ్ల క్రితం వాటికి సీళ్లు వేశారు. రెండు నెలల క్రితం రోప్‌లకు గ్రీజ్ పెట్టారు. మొత్తం ప్రాజెక్టు సెన్సార్లతో పనిచేస్తుంది. అన్ని గేట్లు పనిచేస్తున్నాయి.
‘కిన్నెరసాని’లో స్వల్పంగా లీకేజీ..
భద్రాద్రి జిల్లా పాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు 13 గేట్లున్నాయి. 7, 8, 9, 10 గేట్లలో రబ్బర్ సీళ్లు అరిగిపోవడంతో స్వల్పంగా నీరు లీకవుతోంది. వరదల సమయంలో లీకేజీ ఎక్కువగా ఉంటోంది. గేట్లు ఎత్తిన సందర్భాల్లో సిల్ప్‌వేపై గుంతలు పడుతుండగా ఏడాదికోసారి మరమ్మతులు చేస్తున్నారు. ప్రాజెక్టు రెండువైపులా ఉండే స్లూయిజ్ గేట్లకు సర్వీసింగ్ చేయలేదు. ప్రాజెక్టు పనులకు జెన్‌కో రూ.1.20 కోట్లు మంజూరు చేసింది. మోటార్లు సర్వీసింగ్ చేశారు. కొత్త సెన్సార్లు పెట్టలేదు.
లంకసాగర్‌కు ఇరువైపులా లీకులు..
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని లంకసాగర్ డ్యామ్‌కు ఇరువైపులా లీకులున్నాయి. ఆనకట్ట బలహీనంగా ఉంది. 5 గేట్ల మరమ్మతులకు రూ.5.40 లక్షలు మంజూరయ్యాయి. ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.24.45 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. నిధులు కేటాయించలేదు.
ఇవి కూడా చదవండి...
గాజాపై దాడులకు విరామం.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం
కంబోడియా, థాయ్‌లాండ్ తక్షణం చర్చలు చేపట్టేందుకు రెడీ.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి