Share News

Nandini Gupta: హైదరాబాద్‌.. ప్రేమ నగరం

ABN , Publish Date - Apr 19 , 2025 | 04:44 AM

ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్‌లో.. చదువులకు నిలయమైన కోటా నగరంలో.. రైతు కుటుంబంలో పుట్టి.. 19 ఏళ్ల వయసులో మిస్‌ ఇండియా పోటీలో విజేతగా నిలిచి..

Nandini Gupta: హైదరాబాద్‌.. ప్రేమ నగరం

  • ‘మిస్‌ వరల్డ్‌’తో తెలంగాణ ముందుకు ప్రపంచం

  • చేనేత చీరలు, ఆభరణాలను పరిచయం చేయాలి

  • వచ్చినవారికి మన ఆతిథ్యాన్ని, సంస్కృతిని చూపించాలి

  • ఎక్కడి నుంచి వచ్చామన్నది కాదు.. ఎక్కడికి వెళ్లాలనేది ముఖ్యం

  • ఆ దిశగా మహిళలు ముందుకెళ్లాలి

  • మహేష్‌బాబు అంటే ఇష్టం.. తెలుగులో నటిస్తానేమో!

  • ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో మిస్‌ ఇండియా వరల్డ్‌ నందినీ గుప్తా

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్‌లో.. చదువులకు నిలయమైన కోటా నగరంలో.. రైతు కుటుంబంలో పుట్టి.. 19 ఏళ్ల వయసులో మిస్‌ ఇండియా పోటీలో విజేతగా నిలిచి.. మిస్‌ వరల్డ్‌ 2025 వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అందాల సుందరి.. నందినీ గుప్తా! బాహ్యసౌందర్యం కాదు.. అంతఃసౌందర్యమే అసలైన అందం అని భావించి.. దివ్యాంగులకు అండగా నిలుస్తున్న మనసున్న మనిషి. ‘హైదరాబాద్‌ ప్రేమ నగరం.. ఇక్కడి ప్రజలు నన్నెంతగానో ఆదరించారు’ అంటూ.. ‘ఆంధ్రజ్యోతి’కి ఆమె ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు..

రైతు కుటుంబంలో పుట్టిన మీకు అందాలపోటీలపై ఆసక్తి ఎలా కలిగింది?

నాకు తొమ్మిది, పదేళ్ల వయసులో ఉండగా ఐశ్వర్యరాయ్‌ గురించి తెలిసింది. ఆమె ఎవరు? మిస్‌ వరల్డ్‌గా ఎలా ఎంపికైంది అని అమ్మను అడిగా. ‘దేవదాస్‌’ సినిమాలో ఐశ్వర్యరాయ్‌ అందం చూసి ఆశ్చర్యపోయా. ఆ రోజే నేను కూడా అందాల కిరీటం దక్కించుకోవాలని అనుకున్నా. తర్వాత కాలంలో ముంబై వచ్చి చదువుకుంటూనే నా లక్ష్యం వైపు దృష్టిపెట్టా. తొలుత మిస్‌ రాజస్థాన్‌ పోటీల్లో కిరీటం దక్కించుకున్నా. 2023లో ‘ఫెమినా మిస్‌ ఇండియా’ పోటీల్లో గెలిచి.. ఇప్పుడు తెలంగాణలో జరిగే మిస్‌ వరల్డ్‌ పోటీల్లో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించబోతున్నా.


ఈ ప్రయాణంలో మీకు ఎదురైన అత్యంత సంక్లిష్టమైన సందర్భం ఏంటి? దాన్ని ఎలా అధిగమించారు?

నేను చాలా ఆశావాదిని. కష్టాలవైపు చూడను. ఏదీ కష్టం అనుకోను. ఎప్పుడూ సానుకూలత వైపే ఉంటా. నా రంగం, నా లక్ష్యంపై పూర్తి శ్రద్ధ పెడతా. అదే లోకంగా ఉంటాను. సవాళ్లు ఎదురైతే.. వాటిని ఎంతవరకూ అవకాశాలుగా మార్చుకోవచ్చు అనే ఆలోచిస్తాను.

అందాలపోటీల్లో పాల్గొంటూనే మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. ఇంత బిజీలో అదెలా సాధ్యమైంది?

మా నాన్నకు చదువంటే ఇష్టం. చిన్నప్పటినుంచి చదువుపైనే దృష్టిపెట్టాలని చెప్పేవారు. అందాల పోటీల వైపు వెళ్లేటప్పుడు కూడా ముందు తటపటాయించారు. కానీ ముంబైలో నా కష్టం, నా శ్రమ, నా తపన చూసి.. నా ఆకాంక్షను అర్థం చేసుకున్నారు. మిస్‌ రాజస్థాన్‌గా గెలిచాక ఆయన ఇంకా మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చారు. మరి ఆయన కోరికను కూడా నెరవేర్చాలి కదా! అందుకే చదువు కొనసాగించా. ముంబైలోని లాలా లజపతిరాయ్‌ కళాశాల నుంచి మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశా.


మిస్‌ ఇండియా పోటీల్లో మీరు ఏక్తా(ఐక్యత) అన్న థీమ్‌ తీసుకున్నారు. అదే ఎందుకు తీసుకున్నారు?

మిస్‌ ఇండియా వరల్డ్‌ అయినా ఇంకే అందాల పోటీలైనా కేవలం అందమే కాదు. మనసు, తెలివితేటలు అన్నీ చూస్తారు. మిస్‌ వరల్డ్‌ పోటీల్లో 1972 నుంచి ఒక థీమ్‌ ఉంది. అది.. ‘ఒక లక్ష్యం కోసం అందం’. అంటే పోటీల్లో పాల్గొన్న వారి లక్ష్యం? ఆ దిశగా వారు చేయబోయే కార్యక్రమాల గురించి కూడా అడుగుతారు. ఇందులో భాగంగా మిస్‌ ఇండియా వరల్డ్‌ పోటీల్లో కూడా నా థీమ్‌ ఏంటని అడిగినప్పుడు.. ఏక్తా(ఐక్యత, కలిసి ఉండడం, అంతా ఒక్కటే) అని చెప్పా. దీనివెనక ఒక చిన్న కథ ఉంది. మా మావయ్యకు డౌన్‌ సిండ్రోమ్‌ ఉంది. కానీ, ఆయన ఎప్పుడూ మానసిక స్థైర్యంతో ఉండేవారు. నాకు విద్యతో పాటు సహనం, శ్రమ లాంటివన్నీ ఆయనే నేర్పారు. ఒక్కోసారి హోటల్‌కు వెళ్లినప్పుడు ఇలాంటివారిని వేరే టేబుల్‌పై కూర్చోమనేవారు. నాకు ఏడుపొచ్చేది. అలాంటివారికి స్థైర్యం ఇచ్చి దగ్గరకు తీసుకోవాలి కానీ.. అలా దూరం పెట్టడం సరికాదు. అందుకే నేను ఏక్తా థీమ్‌ తీసుకున్నా. ఇతరుల పట్ల దయ అనేది షరతులతో ఉండకూడదు. మిస్‌ ఇండియా వరల్డ్‌ గెలిచాక ఏక్తా ప్రాజెక్టులో భాగంగా అనేకమంది దివ్యాంగులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నా. వారి పక్కనే ఉండి.. వారు నిలబడేందుకు కావలసిన మానసిక స్థైర్యం ఇవ్వడమే నా లక్ష్యం.


సొంత దేశంలో పోటీలు.. సొంత దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నానన్న ఒత్తిడి ఏమైనా ఉందా?

నేను ఆశావాదిని. దేశ ప్రజలందరి మద్దతూ నాకు ఉంటుందనే సంపూర్ణ విశ్వాసంతో ఈ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నా. మిస్‌ ఇండియా పోటీలో గెలిచాక.. ఈ రెండేళ్లలో ఎంతో పరిణతి చెందా. మిస్‌ వరల్డ్‌ పోటీలకు నన్ను నేను తీర్చిదిద్దుకున్నా. కాబట్టి ఒత్తిడి ఏమీ లేదు.

హైదరాబాద్‌ చూశారు కదా.. ఎలా అనిపించింది?

హైదరాబాద్‌ ఒక ప్రేమ నగరం (ఏ సిటీ ఆఫ్‌ ప్యార్‌, ఇష్క్‌, మొహబ్బత్‌). ఇక్కడి నిర్మాణరీతులు అద్భుతం. చార్మినార్‌, చౌమొహల్లా ప్యాలె్‌సలను సందర్శించా. ఆ కట్టడాలు నా మనసుపై చెరగని ముద్రవేశాయి. ఉత్తరాది నుంచి వచ్చినా ఇక్కడి ప్రజలు నన్ను ఎంతో ఆదరించారు. హైదరాబాద్‌ నా సొంత ఇల్లులా అనిపించింది.


మీ జీవితంలో అత్యంత ఆనందకరమైన సందర్భం ఏది?

మిస్‌ ఇండియా వరల్డ్‌ పోటీలో గెలిచాక మా నాన్న ఏడ్చారు. ఏడుస్తూ నన్ను కౌగిలించుకున్నారు. ఆయన నన్ను హత్తుకోవడం జీవితంలో అదే మొదటిసారి. ఆయన కళ్ల వెంట ఆనందభాష్పాలు వచ్చాయి. ఒక కొడుకు పుడితే బాగుండు అనుకునే సంప్రదాయ కుటుంబంలో పుట్టిన నేను.. నాన్న కళ్లల్లో నీళ్లు తెప్పించేంత సంతోషం ఇవ్వగలిగా. ఆ క్షణం ఎంతో సంతోషకరంగా అనిపించింది.

టీవీలో, వాణిజ్యప్రకటనల్లో కనిపిస్తున్నారు.. సినిమాల్లోకి వస్తారా?

కచ్చితంగా. సినిమాల్లోకి రావడానికి ఆసక్తిగా ఉన్నా. తెలుగులో కూడా రావొచ్చు. మహే్‌షబాబు అంటే ఇష్టం. తెలుగు సినీ పరిశ్రమ కూడా చాలా పెద్దది. చూద్దాం.


భువనేశ్వర్‌లో చేనేత కళాకారుల కోసం ఏర్పాటుచేసిన ఫ్యాషన్‌వీక్‌లో పాల్గొన్నారు. ఇప్పుడు తెలంగాణ చేనేతను అంతర్జాతీయ వేదికమీద ప్రదర్శించేందుకు ఏమైనా చేస్తారా?

తప్పకుండా. తెలంగాణ చేనేత గురించి నాకు తెలుసు. గద్వాల, పోచంపల్లి గురించి విన్నా. తెలంగాణ చేనేత చీరలనే కాదు.. ఇక్కడి ఆభరణాలనూ ప్రపంచం ముందుకు తీసుకెళ్లేందుకు మిస్‌ వరల్డ్‌ పోటీలు ఉపకరిస్తాయి. అందులో నేనూ భాగస్వామిని అవుతా. ఇప్పుడు మిస్‌ వరల్డ్‌ పోటీలతో ప్రపంచం తెలంగాణ ముందుకు వస్తోంది. ప్రతి ఒక్కరు దీనికి మద్దతివ్వాలి. ప్రతినిధులకు స్వాగతం పలకాలి. మన ఆతిథ్యాన్ని, సంస్కృతిని వారికి చూపించాలి.

ఈ తరం అమ్మాయిలకు మీరిచ్చే సందేశం ఏంటి?

ఎక్కడినుంచి వచ్చావన్నది కాదు. ఎక్కడికెళ్లాలన్నది నిర్ణయించుకో. నీ హద్దులు నువ్వే నిర్ణయించుకో. దానికి అనుగుణంగానే ముందుకెళ్లు. ..ఇదే ఈ తరం అమ్మాయిలకు నేనిచ్చే సందేశం.


ఈ వార్తలు కూడా చదవండి

CM Revanth Reddy: ఫోర్త్‌ సిటీకి మెట్రో అనుమతులు.. పరుగెత్తించండి

Vijayashanti: రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా

Air Pollution: గర్భస్థ శిశువులూ ఉక్కిరిబిక్కిరి!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 19 , 2025 | 04:44 AM