Share News

Drug Awareness: యముడి వేశంలో టీచర్.. ఎందుకో తెలుసా?

ABN , Publish Date - Nov 24 , 2025 | 02:18 PM

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఓ ఉపాధ్యాయుడు వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మత్తు పదార్థాలకు అలవాటుపడి అమూల్యమైన జీవితాన్ని కోల్పోతున్నారని.. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలంటూ విచిత్ర వేషధారణలో అవగాహన కల్పిస్తున్నారు.

Drug Awareness: యముడి వేశంలో టీచర్.. ఎందుకో తెలుసా?
Drug Awareness

హైదరాబాద్, నవంబర్ 24: డ్రగ్స్ భూతానికి ఎంతో మంది యువత బలవుతున్నారు. డ్రగ్స్‌కు బానిసలుగా మారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో తరచూ డ్రగ్స్ పట్టుబడుతూనే ఉంది. యువతే టార్గెట్‌గా డ్రగ్స్ విక్రయిస్తోంది ముఠా. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు పోలీసులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రగ్స్‌ను తీసుకోవద్దని, దాని వల్ల కలిగే పరిణామాలపై అనేక అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. యువత డ్రగ్స్ జోలికి పోవద్దని.. డ్రగ్స్‌ విక్రయించినా, కొనుగోలు చేసినా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు కూడా చేస్తున్నారు.


కానీ ఏదో విధంగా యువత డ్రగ్స్‌ను కొనుగోలు చేస్తూ.. దానికి బానిసలుగా మారిపోతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ డ్రగ్స్‌కు వ్యతిరేకంగా వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. డ్రగ్స్‌ను తీసుకుంటే జీవితం లేనట్టే అంటూ యువతకు చెప్పే ప్రయత్నం చేశారు. ఇందుకోసం ఏకంగా యమధర్మ రాజు వేశాన్ని ధరించారు.


సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామంలో గంజాయి, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా యమధర్మ రాజు రూపంలో రాచకొండ ప్రభాకర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా యువత గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటుపడి అమూల్యమైన జీవితాన్ని కోల్పోతున్నారన్నారు. అంతేకాకుండా మత్తు పదార్థాల కారణంగా ప్రమాదాల రూపంలో ఏమీ తెలియని అమాకులను బలితీసుకుంటున్నారని తెలిపారు. మత్తుపదార్థాలు, మాదక ద్రవ్యాలు తీసుకోవద్దని.. నో డ్రగ్స్ సేవ్ లైఫ్ అంటూ పిలుపునిచ్చారు.


రోడ్డు ప్రమాదాలు, హత్యలు, అత్యాచారాలకు ప్రధాన కారణం మత్తు పదార్థాలను సేవించడమే అని అన్నారు. అందుకే తాను యముడి రూపంలో యమలోకం నుంచి భూలోకానికి వచ్చి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి సందేశాలతో కరపత్రాలు పంచుతూ మైక్‌సెట్ ద్వారా ప్లెక్సీల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నట్లు రాచకొండ ప్రభాకర్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

నా గురించి మాట్లాడితే తాట తీస్తా... నిరంజన్‌కు కవిత స్ట్రాంగ్ వార్నింగ్

మూడు గంటలుగా ఐబొమ్మ రవి విచారణ.. ఈరోజైనా నోరు విప్పుతాడా?

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 24 , 2025 | 03:13 PM